Thirukoshtiyur – Sowmya Narayana Perumal Temple
శ్రీమన్నారాయణుడు భక్తులను అనుగ్రహించడం కోసం అనేక ప్రదేశాలలో ఆవిర్భవించాడు. దేవతలతో .. మహర్షులతో .. మహా భక్తులతో పూజాభిషేకాలు అందుకుంటూ వస్తున్నాడు. స్వామివారు ఆయా ప్రదేశాలలో ఆవిర్భవించడం వెనుక ఏదో ఒక కారణం ఉంటుంది .. అది లోక కల్యాణానికి సంబంధించినదై ఉంటుంది. తమిళనాడులోని “మధురై” సమీపంలో ఈ క్షేత్రం అలరారుతోంది. ఇక్కడ స్వామివారు సౌమ్యనారాయణ మూర్తి పేరుతో అమ్మవారితో కలిసి “అష్టాంగ విమానం”లో పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు.
12 మంది ఆళ్వారులలో ఎవరైనా ఒక క్షేత్రాన్ని దర్శించి తమ పాశురాలతో అక్కడి స్వామివారిని కీర్తిస్తే ఆ క్షేత్రాలు దివ్య తిరుపతులుగా చెప్పబడుతున్నాయి. ఈ క్షేత్రాన్ని పెరియాళ్వార్ .. పూదత్తాళ్వార్ .. తిరుమంగై ఆళ్వార్ దర్శించి తమ పాశురాలతో స్వామివారిని స్తుతించారు. అందువలన 108 దివ్య తిరుపతులలో ఒకటిగా ఈ క్షేత్రం విలసిల్లుతోంది. స్వామివారి అనేక మహిమలకు .. లీలావిశేషాలకు నిలయంగా ఈ క్షేత్రం దర్శనమిస్తూ ఉంటుంది.
“తిరుకోష్ఠియూర్”(Thirukoshtiyur) అత్యంత పవిత్రమైన ప్రదేశంగా ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. “కదంబ మహర్షి” ఈ విషయాన్ని దేవతలకు చెప్పినట్టుగా ఆధ్యాత్మిక గ్రంథాలలో కనిపిస్తుంది. హిరణ్యకశిపుడు శ్రీహరిని ద్వేషిస్తూ ఉండేవాడు. తన రాజ్యంలో ఎక్కడా కూడా శ్రీహరి నామస్మరణ వినిపించరాదని శాసనం చేసినవాడు. అందుకు వ్యతిరేకంగా ఎవరైనా శ్రీహరి నామాన్ని పలికితే కఠినంగా శిక్షిస్తూ ఉండేవాడు. నిరంతరం విష్ణు నామస్మరణతో తరించే దేవతలను కూడా అతను వదిలిపెట్టలేదు.
దేవతలను .. సాదు సజ్జనులను కూడా అతను అనేక విధాలుగా ఇబ్బందులు పెడుతూ ఉండేవాడు. ఇంద్రాది దేవతలు అతని ఆగడాలను భరించలేక భూలోకంలో కొంతకాలం పాటు తాము తలదాచుకునే ప్రదేశం ఏదైనా ఉంటే చెప్పమని కదంబ మహర్షిని కోరారు. అప్పుడు కదంబ మహర్షి ఈ ప్రదేశం గురించి చెప్పి .. దాని పవిత్రత కారణంగా హిరణ్య కశిపుడు అక్కడ అడుగుపెట్టలేడని సెలవిస్తాడు.
రామానుజులవారు అష్టాక్షరీ మంత్రాన్ని ఆలయ గోపురం మీదుగా సాధారణ ప్రజలకు వినిపించారనే విషయం తెలిసిందే. ఆయన అలా చేసింది ఈ క్షేత్రంలోనేనని అంటారు. అంటే ఈ క్షేత్రంలో నుంచే “అష్టాక్షరీ మంత్రం” సాధారణ ప్రజల్లోకి వెళ్లిందని భావించాలి. అలాంటి ఒక మహత్తరమైన కార్యక్రమానికి వేదికగా నిలిచిన క్షేత్రం ఇది. సౌమ్యనారాయణమూర్తి వైభవానికి అద్దం పట్టే ఈ క్షేత్ర దర్శనం వలన సమస్త పాపాలు హరించివేయబడతాయనీ .. సకల శుభాలు చేకూరతాయనేది మహర్షుల మాట.
ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ వారం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ సంవత్సరం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత .. ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే. పూర్తి సమాచారం కాదు.