Tripuranthakam – Tripurantakeswara Swamy Tripurasundari-temple
త్రిపురాసురులను సంహరించిన కారణంగా పరమశివుడిని త్రిపురాంతకుడు అంటారు. లోక కల్యాణం కోసం స్వామి తలపెట్టిన ఆ కార్యానికి అమ్మవారు సహకరించిన కారణంగా ఆ తల్లిని త్రిపురసుందరీదేవి అని అంటారు. ఆ పేర్లతో స్వామివారు .. అమ్మవారు పూజాభిషేకాలు అందుకునే క్షేత్రమే త్రిపురాంతకం. శ్రీ శైలానికి తూర్పు ద్వారంగా చెప్పుకునే ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్ .. ప్రకాశం జిల్లాలో మండల కేంద్రంగా ఉంది. అత్యంత ప్రాచీనమైన క్షేత్రాలలో ఇది ఒకటిగా అలరారుతోంది.
ఇక్కడి కొండపై త్రిపురాంతకుడుగా సదాశివుడు .. కొండ దిగువున త్రిపుర సుందరిగా అమ్మవారు కొలువై ఉన్నారు .. ఈ కొండకే “కుమారగిరి” అని పేరు. ఇక్కడి అమ్మవారు చతుర్భుజాలతో .. ఖడ్గం .. ఢమరుకం .. కపాలం .. త్రిశూలాన్ని ధరించి దర్శనమిస్తూ ఉంటుంది. ఈ మూర్తి కాకతీయుల కాలంలో ప్రతిష్ఠించిందని చరిత్ర చెబుతోంది. గర్భాలయం మరో వైపున అంతకు పూర్వం ఉన్న అమ్మవారి రూపం కూడా అస్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఇది చాలా ప్రాచీనమైనది అంటారు. త్రిపురాసుర సంహార సమయంలో అమ్మవారు ఇక్కడి “చిదాగ్ని కుండం” నుంచి ఆవిర్భవించిందని స్థలపురాణం చెబుతుతోంది.
అమ్మవారి మహిమలను భక్తులు కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. ఇక త్రిపురాంతకుడు కూడా ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నాడనడానికి నిదర్శనంగా ఒక ఆసక్తికరమైన కథనం వినిపిస్తూ ఉంటుంది. పూర్వం ఈ క్షేత్రంలో బ్రహ్మయ్య అనే ఒక భక్తుడు స్వామివారిని అనునిత్యం సేవిస్తూ ఉండేవాడు. ఆ గ్రామానికి చెందిన జంగమయ్య అనే వ్యక్తి ఒక మేకను బలి ఇవ్వడం కోసం తీసుకుని వెళుతుంటే అది తప్పించుకుని బ్రహ్మయ్య దగ్గరికి వస్తుంది. ఆ వెనుకే దానిని వెతుక్కుంటూ జంగమయ్య అక్కడికి వస్తాడు.
ప్రాణ భయంతో తన దగ్గరికి వచ్చిన మేకను అప్పగించనని బ్రహ్మయ్య అంటాడు. అవసరమైతే ఆ మేక ఖరీదును చెల్లిస్తానని చెబుతాడు. అయినా జంగమయ్య వినిపించుకోకుండా గొడవకి దిగుతాడు. ఫలితంగా బ్రహ్మయ్య చేతిలో జంగమయ్య చనిపోతాడు. దాంతో పెద్ద మనుషులు పంచాయతీ పెడతారు. మేకను చంపడానికి జంగమయ్య ప్రయత్నించిన కారణంగానే తమ మధ్య గొడవ జరిగిందని బ్రహ్మయ్య చెబుతాడు. అతను చెబుతున్నది నమ్మడం ఎట్లా? సాక్ష్యం కావాలంటారు పెద్దలు.
జరిగిన సంఘటనకు త్రిపురాంతకుడే సాక్షి అనీ .. ఆ స్వామినే సాక్ష్యం చెప్పాలని వాళ్లని వెంటబెట్టుకుని ఆలయానికి తీసుకుని వెళతాడు బ్రహ్మయ్య. తాను నమ్మిన దైవం అక్కడ ఉంటే .. జరిగిన సంఘటనకి సాక్ష్యం చెప్పాలని త్రిపురాంతకుడిని కోరతాడు. అప్పుడు .. “బ్రహ్మయ్య చెబుతున్నది నిజమే” అనే మాట గర్భాలయంలో నుంచి వినిపిస్తుంది. భగవంతుడే సాక్షిగా మారిన సంఘటన ఇది. పరమశివుడు ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నాడనడానికి నిలువెత్తు నిదర్శనం ఇది. అలాంటి ఈ క్షేత్ర దర్శనం వలన సకల శుభాలు జరుగుతాయని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు.
ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ వారం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ సంవత్సరం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత .. ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే. పూర్తి సమాచారం కాదు.
Tripuranthakam – Tripurantakeswara Swamy Tripurasundari-temple