Udimudi – Sri Lakshmi Narasimha Swamy Temple
లక్ష్మీనరసింహస్వామి ఆవిర్భవించిన ప్రాచీన క్షేత్రాలలో “ఊడిమూడి”(Udimudi) ఒకటి. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం సమీపంలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. ఈతకోట .. గంటి .. పెదపూడి మీదుగా ఊడిమూడి గ్రామానికి చేరుకోవచ్చు. గోదావరి నదీ తీరంలోని ఈ గ్రామం ప్రశాంతమైన వాతావరణంలో అలరారుతోంది. పూర్వం ఈ గ్రామం పేరు “ఊడిపూడి”గా(Udimudi) ఉండేదనీ .. అంతకుముందు “ఊర్వశీపురం”గా ఉండేదని స్థానికులు చెబుతారు. పూర్వం పుష్పక విమానంలో బయల్దేరిన ఊర్వశీ .. పురూరవులు సింహాద్రి అప్పన్న క్షేత్రానికి చేరుకోవడానికి ముందుగా ఊడిమూడిలో కొంతసేపు ఆగారని అంటారు. ఈ కారణంగానే ఈ గ్రామానికి ఈ పేరు వచ్చిందని చెబుతారు.
పంచనారసింహ క్షేత్రాలలో ఊడిమూడి ఒకటని చెబుతుంటారు. ఈ ఆలయంలో లక్ష్మీనరసింహస్వామి .. ఉగ్రనరసింహస్వామి కొలువై దర్శనమిస్తారు. ఇలా ఇద్దరు నరసింహస్వాములు పూజలు అందుకోవడం వెనుక ఒక ఆసక్తికరమైన కథనం వినిపిస్తూ ఉంటుంది. పూర్వం ఈ ఆలయంలో ఉగ్రనరసింహస్వామి మూర్తి మాత్రమే ఉండేది. అయితే స్వామి చూపులోని తీవ్రత కారణంగా తరచూ గ్రామంలో అగ్నిప్రమాదాలు సంభవించేవట. తరచూ ఇలా జరుగుతూ ఉండటంతో గ్రామస్థులకు ఏం చేయాలనేది పాలుపోలేదు.
అలాంటి పరిస్థితుల్లోనే ఆ ఊరికి వచ్చిన ఒక సిద్ధ పురుషుడు .. ఉగ్రనరసింహ స్వామి మూర్తి ఊరు వైపుకు చూస్తున్నట్టుగా కాకుండా, గోదావరి నదివైపు చూస్తున్నట్టుగా ప్రతిష్ఠించమనీ .. ప్రస్తుతం ఆ స్వామి ఉన్న స్థానంలో లక్ష్మీనరసింహస్వామి మూర్తిని ప్రతిష్ఠించమని చెప్పాడట. పూర్వం వశిష్ఠ మహర్షిచే పూజించబడిన లక్ష్మీ నరసింహస్వామి మూర్తీ, గోదావరీ సమీపంలోని ఒక పుట్టలో ఉందనీ, ఆ విగ్రహాన్ని వెతికి తీసుకుని వచ్చి ప్రతిష్ఠ చేయమని చెప్పాడట. గ్రామస్థులు ఆ సిద్ధుడు చెప్పినట్టుగానే చేశారు. అందువలన ఈ ఆలయంలో ఇద్దరి మూర్తులు దర్శనమిస్తూ ఉంటాయి. హనుమంతుడు క్షేత్ర పాలకుడిగా ఈ ఆలయం వెలుగొందుతోంది.
మాఘమాసంలో ఇక్కడ ఐదు రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. భీష్మ ఏకాదశి రోజున స్వామివారికి కనుల పండుగలా కల్యాణోత్సవం జరుగుతుంది. స్వామివారి కల్యాణోత్సవానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఈ ఆలయానికి అత్యంత సమీపంలోనే శివాలయం దర్శనమిస్తుంది. ఇక్కడి శివలింగాన్ని శ్రీరాముడు ప్రతిష్ఠించిన కారణంగా రామలింగేశ్వరుడుగా పిలవబడుతున్నాడు. శివకేశవులు కొలువైన ఈ క్షేత్రాలను దర్శించడం వలన సమస్త దోషాలు తొలగిపోయి .. సకల శుభాలు కలుగుతాయనేది భక్తుల విశ్వాసం.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
గమనిక : ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత .. ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే. పూర్తి సమాచారం కాదు.
Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.