Udupi – Sri Krishna Temple
శ్రీకృష్ణుడు కొలువైన ప్రాచీనమైన క్షేత్రాలలో .. చెప్పుకోదగిన మహిమాన్విత క్షేత్రాలలో కర్ణాటక రాష్ట్రంలోని “ఉడిపి”(Udupi) ఒకటిగా కనిపిస్తుంది. స్వామివారి మూర్తి ఎంతో అందంగా ఉంటుంది .. ఇది ద్వారకలో రుక్మిణీదేవి చేత పూజలు అందుకుందని అంటారు. స్వామివారు బాలకృష్ణుడుగా ఉన్నప్పటి రూపాన్ని ఆమె ఎంతో అపురూపంగా చూసుకునేదనీ .. ఆరాధించేదని అంటారు. ఆ తరువాత కాలంలో స్వామివారి మూర్తి .. మధ్వాచార్యులు వారిని వెతుక్కుంటూ ఆయన దగ్గరికి చేరుకున్నట్టుగా చెబుతారు.
మధ్యా చార్యులవారు ఈ కృష్ణుడి రూపాన్ని చూస్తూ పొంగిపోయారట. తప్పిపోయిన బిడ్డ తిరిగి ఎదురుపడినప్పుడు ఒక తల్లి ఎంత ఆనందాన్ని పొందుతుందో .. అలాంటి ఆనందాన్ని ఆయన పొందారని అంటారు. ఆ ప్రతిమను తన గుండెలకు హత్తుకుని ఆయన పరవశించిపోయారని చెబుతారు. ముద్దులొలికే ఆ బాలకృష్ణుడి విగ్రహాన్ని ఆ తరువాత ఆయన తన మఠంలో ప్రతిష్ఠించారనీ, ఆ తరువాత కాలంలో దానినే ఆలయంగా మార్చారని కథనం.
మధ్వ సంప్రదాయాన్ని జనంలోకి తీసుకుని వెళ్లడానికి తన జీవితాన్ని అంకితం చేసిన మధ్వాచార్యులవారు నిర్దేశించిన ప్రకారమే స్వామివారికి కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి. శ్రీకృష్ణుడికి సంబంధించిన ప్రసిద్ధి చెందిన క్షేత్రాలలో ఇది ఒకటిగా కనిపిస్తుంది. ఇక్కడ స్వామివారు గర్భాలయంలో ఉంటారు .. కానీ నేరుగా దర్శనం ఇవ్వరు. స్వామివారిని పడమర దిశగా ఉన్న తొమ్మిది రంధ్రముల గల కిటికీలో నుంచి చూడవలసిందే. గర్భాలయం ముఖం వైపు కాకుండా .. పడమర దిక్కున కిటికీ వైపుకు స్వామి ఎందుకు తిరిగాడనే సందేహం కలగడం సహజం.
భక్త కనకదాసు గురించి వినే ఉంటారు .. అప్పట్లో తక్కువ కులానికి చెందిన వ్యక్తిగా చూడబడుతూ .. ఆ కారణంగా అవమానాలను ఎదుర్కున్న వ్యక్తి. కులానికి .. భగవంతుడికి సంబంధం ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన వ్యక్తి. అందుకోసం అనేక మంది గురువులను కలుసుకుంటూ తన సందేహ నివృత్తిని చేసుకుంటూ వెళ్లి .. చివరికి భగవంతుడిని సాక్షాత్కరింపజేసుకున్నాడు. భగవంతుడి దృష్టిలో అందరూ సమానులేనని చాటి చెప్పిన భక్తుడు ఆయన.
ఒకసారి ఆయన శ్రీకృష్ణుడి దర్శనం కోసం “ఉడిపి”(Udupi) వచ్చాడట. స్వామివారి దర్శనం కోసం ఆయన వెళుతుంటే .. తక్కువ కులస్థుడు అనే కారణంగా ఆయన దర్శనానికి కొంతమంది అడ్డుపడ్డారట. అంత దూరం వచ్చి స్వామివారిని దర్శించుకోలేక పోయినందుకు ఆయన బాధపడుతూ .. ఆలయం వెనుక వైపుగా ఉన్న కిటికీలో నుంచి స్వామిని చూడటానికి ప్రయత్నించాడట. దాంతో గర్భాలయంలోని స్వామివారి మూర్తి .. కనకదాసుకి కనిపించడం కోసం ఆ కిటికీ వైపుకు తిరిగాడట. అందువల్లనే ఇప్పటికీ ఆ కిటికీ ద్వారానే భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. స్వామివారు ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నాడనడానికి ఇది ఒక నిదర్శనంగా చెబుతుంటారు.
ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ వారం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ సంవత్సరం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత .. ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే. పూర్తి సమాచారం కాదు.
Udupi – Sri Krishna Temple