Ugadi Rasi Phalalu 2026 “పరాభవ” నామ సంవత్సర ఉగాది సందర్బంగా అన్ని రాశుల వారికి కొత్త తెలుగు సంవత్సరంలో జన్మ నక్షత్రం/చంద్ర రాశి ప్రకారం ఉగాది రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. Telugu yearly rashi phalalu 2026 for all 12 zodiac signs. viswavasu nama samvatsara rasi phalalu 2026. moonsign based telugu yearly horoscope 2026.
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)
ఆదాయం–11, వ్యయం–5, రాజపూజ్యం–2, అవమానం–4
వీరికి గురువు తృతీయమందు పాపి. జూన్2వ తేదీ నుండి చతుర్ధ, ఉచ్చస్థానాల్లో గురుసంచారం అత్యంత శుభకరం. ఇక శని వ్యయ స్థానంలో సంచారం వల్ల ఏలినాటి శని ప్రభావంతో కొన్ని వృథా ఖర్చులు చేయిస్తాడు. అయితే మొత్తానికి మిశ్రమ ఫలితాలు ఇస్తాడు. ఇక రాహుకేతువులు డిసెంబర్5వ తేదీ వరకూ లాభ, పంచమ స్థానాల్లో సంచరించి 6వ తేదీ నుండి దశమ, చతుర్ధ స్థానాలలోకి ప్రవేశిస్తారు. ఈ రీత్యా పరిశీలించగా జూన్ 6వ తేదీ నుండి శుభదాయకమే. ఆర్థికంగా బలం చేకూరుతుంది. కొన్ని అదనపు ఖర్చులు మీదపడొచ్చు. సంఘంలో పేరుప్రతిష్ఠలు సంపాదిస్తారు. ఎంతటి వ్యవహారం అప్పగించినా వెనుకడుగు వేయకుండా పూర్తి చేస్తారు. వివాహం కాని వారికి జూన్నుండి వివాహయోగం కలుగుతుంది. ఆస్తుల విషయంలో నెలకొన్న సమస్యలు ఒక్కొక్కటీగా పరిష్కారమవుతాయి. కొంత కాలంగా ఎదుర్కొంటున్న కొన్ని కేసుల నుంచి విముక్తి లభిస్తుంది. బంధువర్గం నుంచి ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. ఇతరులకు సైతం చేయూతనిచ్చి మీ దాతృత్వాన్ని చాటుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేసే వీలుంది.
ఇంటి నిర్మాణ యత్నాలు ద్వితీయార్ధంలో ఫలిస్తాయి. తరచూ ప్రముఖ తీర్థయాత్రలు చేస్తారు.
విద్యార్థులకు అనూహ్యమైన ఫలితాలు వచ్చి ఆశ్చర్యపరుస్తాయి. రాజకీయనేతలకు మధ్యలో ఇబ్బందులు నెలకొన్నా మొత్తం మీద అనుకూలమైన వాతావరణమే ఉంటుంది. కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉండి ఊహించని అవకాశాలు దక్కించుకుంటారు. వ్యవసాయదారులకు రెండవ పంట లాభదాయకంగా ఉంటుంది. ప్రభుత్వం నుంచి మరింత సాయం అందుకుంటారు. వ్యాపారులకు లాభనష్టాలు సమానంగా ఉండి మొత్తానికి ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది. ఉద్యోగులకు ప్రమోషన్లు అందుకునే అవకాశాలున్నాయి. అయితే వీరు కొన్ని బదిలీలకు సిద్ధంగా ఉండాలి. క్రీడాకారులకు మొదట్లో కష్టకాలంగా ఉన్నా మధ్యకాలంలో ఎదురుండదు. సాంకేతిక రంగం వారికి మరింత చేయూత లభిస్తుంది. డిసెంబర్5 నుండి కేతువు అర్థాష్టమ స్థితి పొందినా ఉచ్చస్థితిలో గురునితో కలయిక వల్ల శుభదాయకమే. ఏడాది మొదటి భాగంలో గురుబలం లోపించడం, వ్యయ శని కారణంగా ఆరోగ్యపరంగా ఇబ్బందులతో పాటు ఎంత సమకూరినా డబ్బు కనిపించని పరిస్థితి ఉంటుంది. అలాగే, శని జూలై చివరి వారం – డిసెంబర్ మొదటి వారం మధ్య వక్రగతి సంచారం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు. మరిన్ని ఖర్చులు. ఇతరులతో మాటపడాల్సిన పరిస్థితి ఉంటుంది. సంయమనం, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయడం ఉత్తమం. మొత్తం మీద ఈ రాశి వారికి ద్వితీయార్థమే అనుకూలమని చెప్పొచ్చు. వీరు ప్రథమార్ధంలో గురుని, డిసెంబర్ 5 తరువాత కేతువునకు పరిహారాలు చేయించుకోవాలి.
అదృష్టసంఖ్య–9, పగడం ధరించాలి.
సుబ్రహ్మణ్యారాధన మంచిది.
వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)
ఆదాయం–5, వ్యయం–14, రాజపూజ్యం–5, అవమానం–4
వీరికి జూన్ 1 వ తేదీ వరకూ గురువు ద్వితీయమందు విశేషంగా ఉంటుంది. తదుపరి తృతీయమందు ఉచ్ఛ స్థానంలో సంచార సమయం కూడా మంచిదే. ఇక శని లాభ స్థానంలో సంచారం అత్యంత శుభదాయకం. డిసెంబర్ 5 వరకూ రాహుకేతువులు దశమ, చతుర్ధ స్థానాలలోను తదుపరి భాగ్య, తృతీయ స్థానాలలో సంచారం అనుకూలం. వీరికి మధ్యమధ్యలో మినహా అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఆర్థికంగా కొంత ఇబ్బందులు వచ్చినా తట్టుకుని నిలబడతారు. అప్పులు చేసైనా ఖర్చులు అధిగమిస్తారు. స్థిరాస్తులు కొన్ని విక్రయించే అవకాశం ఉంది. గురుని తృతీయ రాశి సంచారంలో సోదరులు, సోదరీల నుండి ఊహించని సాయం అందుతుంది. అలాగే, వారితో సృహుద్భావ పరిస్థితులు నెలకొంటాయి. శని ప్రభావం వల్ల అందరితోనూ సఖ్యత. స్నేహసంబంధాలు మెరుగుపడతాయి. దీర్ఘకాలిక రుగ్మతల నుండి బయటపడతారు. అయితే జూలై –డిసెంబర్ మధ్య శని వక్రగతి కారణంగా ఆరోగ్యంపై ప్రధానంగా శ్రద్ధ అవసరం. హఠాత్తుగా ఆప్తులతో విరోధాలు రావచ్చు. మరింత సహనంతో మెలగాలి. మీరు తీసుకునే నిర్ణయాలు కుటుంబ సభ్యులందరికీ ఆమోదయోగ్యంగా ఉంటాయి. మిమ్మల్ని వ్యతిరేకించే వారిని సైతం ప్రేమిస్తారు. ఇంటి నిర్మాణం లేదా కొనుగోలు యత్నాలకు ద్వితీయార్థం సానుకూలం. ఇతరులకు సలహాలపై ఒకటికి రెండుసార్లు ఆలోచన చేయడం ఉత్తమం. తరచూ పుణ్యక్షేత్రాల సందర్శనం, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం వంటివి చేస్తారు. వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. కొత్త వ్యాపారాల ప్రారంభానికి సన్నద్ధులవుతారు. ఉద్యోగులకు ఒక ఊహించని అవకాశం దక్కవచ్చు. ఆకస్మిక మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవేత్తలు, పరిశోధకులకు ఒత్తిడులు తగ్గుతాయి. విదేశీ పర్యటనలు కూడా చేస్తారు. రాజకీయవేత్తల కృషి ఫలించి కొత్త పదవులు కూడా చేపట్టవచ్చు. విద్యార్థులు కోరుకున్న ఫలితాలు రాక నిరాశ చెందుతారు. కళాకారులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. క్రీడాకారులు చేజార్చుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. వ్యవసాయదారులకు మొదటి పంట అనుకూలిస్తుంది. ఇంట వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. చిత్రవిచిత్రమైన సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. మొత్తానికి అన్ని విధాలా కలసివచ్చేకాలమే. జూన్ 2 తరువాత గురునికి పరిహారాలు చేయించుకోవడం మంచిది.
అదృష్టసంఖ్య–6, వజ్రం ధరిస్తే శుభదాయకం.
నరసింహస్వామిని పూజించండి.
మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)
ఆదాయం–8 వ్యయం–11 రాజపూజ్యం–1, అవమానం–7
వీరికి జూన్ 1వ తేదీ వరకూ జన్మరాశిలో సువర్ణమూర్తిగా గురుబలం విశేషం. తదుపరి ద్వితీయంలో ఉచ్ఛస్థానంలో సంచారం మూర్తిమంతం చేత కొంత ఇబ్బంది కలిగినా మొత్తానికి శుభఫలితాలే ఇస్తాడు. ముఖ్యంగా ఆర్థికంగా బలం చేకూరుస్తాడు. ఇక దశమ స్థానంలో శని సంచారం వల్ల ధార్మిక చింతన పెరుగుతుంది. ఇక రాహుకేతువులు డిసెంబర్5వ తేదీ వరకూ భాగ్య, తృతీయస్థానాల్లో సంచారం. తదుపరి అష్టమ, ద్వితీయస్థానాల్లో సంచారం. ఈరీత్యా పరిశీలిస్తే వీరికి గురుబలం విశేషంగా కనిపిస్తోంది. ఆర్థిక లావాదేవీలు ఊపందుకుని స్థిర త్వం పొందుతారు. అప్పుల బాధలు తగ్గే అవకాశాలున్నాయి. ఇక ద్వితీయార్థంలో స్వగృహయోగం కనిపిస్తోంది. వాహనాలు, ఖరీదైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మీ ఖ్యాతి మరింత పెరిగి సంఘంలో మంచి పేరు గడిస్తారు. కొన్ని అపవాదుల నుండి బయటపడతారు. సంతానం లేని వారికి ఈ సంవత్సరం సంతానయోగం ఉంటుంది. నిరుద్యోగుల ఆశలు ఎట్టకేలకు ఫలిస్తాయి. ఇంటిలో వివాహాది శుభకార్యాలు జరుపుతారు. అనుకున్నది సాధించేందుకు తగిన సమయం. వ్యూహాత్మకంగా కొన్ని వివాదాల నుండి గట్టెక్కుతారు. కోర్టు కేసులు తుది దశకు చేరుకుని ఊరట చెందుతారు. వ్యాపారాలు మరింత పుంజుకుని అనుకున్న దానికంటే అధికంగా లాభాలు పొందుతారు. ఉద్యోగులకు ఉన్నతమైన హోదాలు దక్కుతాయి. కొన్ని మార్పులకు కూడా అవకాశాలున్నాయి. పారిశ్రామికవేత్తలు, పరిశోధకులు, న్యాయవాదులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. కళాకారులకు సన్మానాలు, ఊహించని అవార్డులు లభిస్తాయి. రాజకీయవేత్తలకు కొత్త పదవులు దక్కే సూచనలున్నాయి. విద్యార్థులు ఆశించిన ఫలితాలు సాధించి హుషారుగా ముందడుగు వేస్తారు. వ్యవసాయదారులకు రెండుపంటలూ లాభిస్తాయి. అయితే డిసెంబర్5వ తేదీ నుండి అష్టమంలో రాహువు, కుటుంబస్థానంలో కేతు సంచారం వల్ల తరచూ ఆరోగ్యసమస్యలు ఎదుర్కొంటారు. వాహనాలు నడిపే వారు అత్యంత జాగ్రత్తగా మసలుకోవడం మంచిది. మానసిక అశాంతి. ఇతరులతో మాటపడాల్సిన పరిస్థితులు ఉంటాయి.
అదృష్టసంఖ్య–5, ఆకుపచ్చ ధరించాలి.
వీరు రాహుకేతువులకు పరిహారాలు చేయించుకోవాలి.
అలాగే, తరచూ శివాలయ దర్శనాలు చేసుకుంటూ ఉండండి.
కర్కాటకం (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)
ఆదాయం–2, వ్యయం–11, రాజపూజ్యం–4, అవమానం–7.
ఈ రాశి వారికి గురువు వ్యయస్థాన సంచారమైనా మూర్తిమంతం వల్ల శుభుడు, అలాగే, జూన్ 2వ తేదీ నుండి జన్మరాశిలో ఉచ్ఛస్థితిలో సంచారం అత్యంత శుభదాయకం. అలాగే, భాగ్యస్థానంలో శని మిశ్రమ ఫలితాలు ఇస్తాడు. కష్టించి పనిచేసే వారికి విశేషంగా కలసివస్తుంది.
అంటే శ్రమ పడ్డా ఫలితం ఉంటుంది. ఇక వీరికి డిసెంబర్‌వరకూ అష్టమం, తదుపరి సప్తమరాశుల్లో రాహు సంచారం దోషకరం. అలాగే,డిసెంబర్ 5 నుండి జన్మరాశిలో కేతు సంచారం కూడా దోషకారకమే. ఈరీత్యా పరిశీలిస్తే వీరికి ఆదాయపరంగా ఎటువంటి ఇబ్బందులు కనిపించవు.
వచ్చినా ఏదో విధంగా సర్దుకుంటాయి. ఇక కుటుంబంలో సంతోషకరమైన జీవనం సాగిస్తారు.
సంతాన విషయంలో శుభవార్తలు వింటారు. వివాహాది శుభకార్యాల నిర్వహణపై తుది నిర్ణయాలు తీసుకుంటారు. ఆశ్చర్యకరంగా ద్వితీయార్థంలో సొంత ఇంటి కల నెరవేరే సూచనలున్నాయి. అలాగే, వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. కీర్తిప్రతిష్ఠలు సంపాదించి ఒక గుర్తింపు పొందుతారు. అనుకున్న కార్యక్రమాలను కొంత శ్రమ పడినా పూర్తి చేస్తారు. ఒక మిత్రుడు ఊహించని రీతిలో ఆదుకుంటాడు. విద్యార్థులకు మంచి ర్యాంకులు దక్కుతాయి. వ్యాపారాలలో అడుగుముందుకు వేసి లాభాలు గడిస్తారు. కొత్త పెట్టుబడులు సమకూర్చుకునేందుకు తగిన సమయం. ఉద్యోగస్తులు కోరుకున్న∙బదిలీలు ఉంటాయి. బాధ్యతలు అధికమైనా పైస్థాయి నుండి ప్రోత్సాహం లభిస్తుంది. పారిశ్రామికవేత్తలు, డాక్టర్లు, సాంకేతిక రంగాల వారికి విశేషయోగదాయకమైన కాలం. రాజకీయవేత్తలకు ప్రజాదరణ పెరుగుతుంది. కొత్త పదవులు దక్కించుకుంటారు. కళాకారులు, క్రీడాకారులకు అవార్డులు, రివార్డులు దక్కుతాయి. ఇక ఈ ఏడాది మొత్తం రాహుకేతువుల సంచారం అనుకూలం కానందున ఆరోగ్యం, కుటుంబ సమస్యలు వేధిస్తాయి. ప్రతి వ్యవహారంలోనూ ఆటంకాలు అధిగమిస్తూ రావలసి వస్తుంది. జీవిత భాగస్వామితో అకారణంగా వివాదాలు. వాహనదారులు మరింత అప్రమత్తంగా మెలగాలి.
అదృష్టసంఖ్య–2, వీరు ముత్యం ధరించాలి.
రాహుకేతువులకే ఎక్కువగా పరిహారాలు చేయించుకోవాలి.
శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోవడం ద్వారా ఉపశమనం పొందవచ్చు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
ఆదాయం –5, వ్యయం–5 రాజపూజ్యం–7 అవమానం–7
వీరికి జూన్1 వరకు గురువు శుభకారకుడు. తదుపరి వ్యయస్థితిలో సంచారమైనా ఉచ్ఛస్థితి కావడం వల్ల కొంత సానుకూల కాలం. ఇక అష్టమ శని ప్రభావం ఎక్కువగా ఉంది. డిసెంబర్5వరకు రాహు,కేతువులు సప్తమ,జన్మరాశుల్లో సంచారం. తదుపరి షష్ఠమ, వ్యయస్థానాలలో సంచరిస్తారు.
మొత్తానికి రాహుకేతువులు కూడా అంతగా అనుకూలురు కారు. ఈ రీత్యా పరిశీలిస్తే ఆర్థికంగా ఇబ్బందులు తగ్గినా ఏదో రూపంలో రుణదాతలను ఆశ్రయిస్తారు. ఖర్చులు తట్టుకునేందుకు యత్నిస్తారు. కుటుంబంలో అకారణంగా కొన్ని వివాదాలు ఏర్పడి సతమతం కాగలరు. జూన్ వరకూ కొన్ని శుభకార్యాలు నిర్వహించే అవకాశాలున్నాయి. ఇల్లు, వాహనాల కొనుగోలు ప్రయత్నాలు నెరవేరతాయి. ఎదుటవారిని ఆకట్టుకోవడంలో తెలివిగా వ్యవహరించండి. సప్తమ రాహువు సంచార సమయంలో జీవిత భాగస్వాముల మధ్య విభేదాలు, కొంత దూరం పెరగొచ్చు. ఓర్పు, సహనంతో మెలగడం ఎంతైనా అవసరం. విద్యార్థులకు ద్వితీయార్థంలో శుభవార్తలు అందుతాయి. అష్టమ శని ప్రభావంతో ఆరోగ్య సమస్యలు ఏర్పడి వైద్య ఖర్చులు పెరుగుతాయి. ఎముకలు, వాత సంబంధిత రుగ్మతలతో బాధపడతారు. ఎదుటవారి విషయాలలో జోక్యం వల్ల మాటపడాల్సిన పరిస్థితులు ఉంటాయి. వీరి నిర్ణయాలకు కుటుంబ సభ్యులు మొదట అభ్యంతరాలు చెప్పినా తర్వాత అంగీకరిస్తారు. ఒక చిరకాల మిత్రుని సుదీర్ఘకాలం తరువాత కలుసుకుని ఆనందంగా గడుపుతారు. తీర్థ యాత్రలు విరివిగా చేస్తారు. వ్యాపారాలలో లాభనష్టాలు సమానంగా భరించాల్సి ఉంటుంది. పెట్టుబడుల విషయంలో సందిగ్ధంలో పడతారు. అయితే ద్వితీయార్థంలో కొంత ఊపందుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు ఊరిస్తాయి, కానీ వాయిదా పడుతూ వస్తాయి.
పనిఒత్తిడులు తప్పవు. వ్యవసాయదారులకు మొదటి∙పంట అనుకూలం. పారిశ్రామికవేత్తలు, సాంకేతిక రంగాల వారికి మిశ్రమంగా ఉంటుంది. కళాకారులు,క్రీడాకారులకు కొంత సానుకూల సమయమనే చెప్పాలి. రాజకీయవేత్తలు ఊహించని విదేశీ పర్యటనలు చేయవచ్చు. వ్యవహారాలలో గతంలోని కొన్ని తప్పిదాలను సరిదిద్దుకుని ముందుకు సాగడం ఉత్తమం. జూలై – డిసెంబర్ మధ్య శని వక్ర సంచారం మరింత చికాకు పరుస్తుంది. ఈ కాలంలో శనికి తైలాభిషేకాలు, రుద్రాభిషేకాలు చేయించుకుంటే ఉపశమనం పొందవచ్చు.
అదృష్టసంఖ్య–1, కెంపు ధరించాలి.
దుర్గాదేవిని ఆరాధించడం మంచిది.
కన్య (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)
ఆదాయం–8 వ్యయం–11, రాజపూజ్యం–3 అవమానం–3
వీరికి గురువు జూన్1వ తేదీ వరకూ దశమ స్థానం, తదుపరి 2వ తేదీ నుండి లాభ స్థానంలో సంచారం. అయితే మూర్తిమంతం చేత ఈ గురువు మిశ్రమ ఫలితాలు ఇస్తాడు. ఇక శని ఏడాదంతా సప్తమ స్థానంలోనే సంచారం. రాహుకేతువులు డిసెంబర్5వరకు షష్ఠమ, వ్యయ స్థానాల్లోనూ,తదుపరి పంచమ, లాభస్థానాల్లో సంచరిస్తారు. వీరు అనుకూల ఫలితాలు ఇస్తారు. ఆధ్యాత్మిక చింతనను పెంచుతారు. తరచూ పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆర్థికంగా కొన్ని వెసులుబాట్లు కలిగినా సరిపడక అప్పులు చేస్తారు. ఇదే సమయంలో అవసరాలు కూడా పెరుగుతాయి. సంతానపరంగా కొన్ని ఇబ్బందులు రావచ్చు. కుటుంబంలో మరిన్ని బాధ్యతలు మీదపడొచ్చు. అలాగే, శని ప్రభావం కారణంగా భార్యాభర్తల మధ్య తరచూ కలహాలు. జూన్2 నుండి గురువు లాభస్థానంలో సంచారం వల్ల కొన్ని బాకీలు ఎట్టకేలకు వసూలవుతాయి. ఏదోరకంగా డబ్బు సమకూరుతునే ఉంటుంది. అలాగే, సంతానం కోసం ఎదురుచూసే వారికి కలలు ఫలిస్తాయి. చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. స్థిరాస్తి విషయంలో చిక్కులు ఏర్పడినా తెలివిగా బయటపడతారు. నిరుద్యోగులు ఉద్యోగాన్వేషణ ఫలిస్తుంది. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు లాభాలు కనిపిస్తాయి. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు మరింత కలసివస్తాయి. ఉద్యోగస్తులు పదోన్నతులు, ఇంక్రిమెంట్లు తద్వారా బదిలీలు ఉండొచ్చు. పారిశ్రామికవేత్తలు, వైద్యులు, లాయర్లు, సాంకేతిక రంగాల వారికి మంచి గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. రాజకీయవేత్తలకు శుభదాయకమైన కాలమే. విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారు. వ్యవసాయదారులకు రెండుపంటలూ అనుకూలిస్తాయి. ఏప్రిల్ 2వ తేదీ నుండి మే 11 వరకు కుజుడు, శని కలయిక వల్ల ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. ముఖ్యంగా నరాలు, చర్మ సంబంధిత రుగ్మతలు బాధిస్తాయి.
సోదరులతో కలహాలు. మొత్తం మీద మిశ్రమంగా సాగిపోతుంది.
అదృష్టసంఖ్య–5, పచ్చ ధరించాలి.
వీరు శని, కుజులకు పరిహారాలు చేయించుకోవాలి.
అలాగే, శివార్చన మంచిది.
తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)
ఆదాయం–5, వ్యయం–14 రాజపూజ్యం–6 అవమానం–3
వీరికి సంవత్సరమంతా గురువు అనుకూలుడు. జూన్1వరకు భాగ్యస్థానం, తదుపరి దశమ స్థానంలో ఉచ్ఛస్థితి సంచారం అత్యంత శుభకరం. ఇక శని సంవత్సరమంతా షష్ఠమంలో మంచి ఫలితాలు ఇస్తాడు. అలాగే, రాహుకేతువులు డిసెంబర్5వరకు పంచమ, లాభస్థానాల్లోనూ, తదుపరి చతుర్ధ, దశమస్థానాల్లోనూ సంచరిస్తారు. వీరికి డబ్బుకు లోటు రాకుండా గడిచిపోతుంది. లేదనుకునే సమయానికి ఏదోవిధంగా సొమ్ములు అందుతాయి. రుణబాధలు చాలావరకూ తొలగుతాయి. కుటుంబంలోని వారితో సత్సంబంధాలు నెలకొంటారు. కొంత కాలంగా వైరాగ్యం ప్రదర్శించిన మీరు ఈ ఏడాది నూతనోత్సాహంతో గడుపుతారు. అందరినీ మెప్పించే నేర్పరితనంతో ముందుకు దూసుకువెళతారు. ఆత్మీయులు, బంధువుల ద్వారా తరచూ ఆహ్వానాలు, వర్తమానాలు అందుతాయి. శత్రువులు అనుకున్న వారు కూడా మీ బాటలో పయనిస్తారు. వాహనాలు, ఖరీదైన ఆభరణాలు కొంటారు. స్థిరాస్తుల విషయంలో కొంతకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు తీరతాయి. గురువు ఉచ్ఛస్థితి సంచారంలో అంటే జూన్2వ తేదీ నుండి రాజకీయవేత్తలకు అనూహ్యమైన పదవులు, హోదాలు రావచ్చు. అలాగే, విద్యార్థులు విశేషమైన ర్యాంకులు సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ లాభ సూచనలు. మీ అనుమానాలు పెద్దల ద్వారా నివృత్తి చేసుకుంటారు. ప్రతి నిర్ణయం వెనుక ఆప్తుల సలహాలు ఉంటాయి. శుభకార్యాల రీత్యా అధిక ధనవ్యయం. కార్యక్రమాలు కష్టసాధ్యమైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. దైవకార్యక్రమాలలో మరింత చురుగ్గా పాల్గొంటారు. శని శుభుడే అయినా షష్ఠమ రాశి సంచారం వల్ల ఆరోగ్యపరంగా చికాకులు, తద్వారా వైద్యసేవలు అవసరం కావచ్చు. వ్యాపార, వాణిజ్యవర్గాలకు లాభాలు తగినంతగా దక్కవచ్చు. భాగస్వాములతో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగులు పెండింగ్ బకాయిలు అందుకుంటారు. అలాగే, ఉన్నత పోస్టులు దక్కించుకుంటారు. వ్యవసాయదారులకు రెండుపంటలు సానుకూలం. కళాకారులు, సాంకేతికరంగాల వారికి మంచి గుర్తింపు రాగలదు. క్రీడాకారులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. డిసెంబర్5 నుండి రాహువు అర్థాష్ఠమ స్థితి వల్ల చేసే పనుల్లో అవాంతరాలు. వ్యయప్రయాసలు. మానసికంగా ఆందోళన. కోర్టు వివాదాలు. ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. మొత్తం మీద అనుకూల ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
అదృష్టసంఖ్య–6, వజ్రం ధరించాలి.
వీరు రాహువుకు పరిహారాలు చేయించుకోవాలి.
సుందరకాండ పారాయణ మంచి ఫలితాలు ఇస్తుంది.
వృశ్చికం (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)
ఆదాయం–11 వ్యయం–5, రాజపూజ్యం–2 అవమానం–6
ఈరాశి వారికి గురువు జూన్1 వరకు అష్టమ స్థానంలోనూ తదుపరి భాగ్య స్థానంలోనూ సంచారం. శని పంచమ స్థానం శుభకరం. ఇక రాహుకేతువులు డిసెంబర్5వరకు అర్థాష్ఠమ, దశమ స్థానాల్లో సంచారం. తదుపరి తృతీయ, భాగ్య స్థానాల్లోకి ప్రవేశిస్తారు. వీటిని పరిశీలించగా, గురువు అష్టమ రాశిలో మూర్తిమంతం చేత సువర్ణమూర్తి కావడం శుభకరం. కొంత కాలంగా పడుతున్న ఇబ్బందులు, ముఖ్యంగా ఆర్థిక సమస్యలు తీరే సమయం. రుణాలు సైతం తీరుస్తారు. కుటుంబంలో ప్రత్యేక అభిమానం చూరగొంటారు. వివాహాది శుభకార్యాలు వైభవంగా నిర్వహిస్తారు. విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు. విదేశీ పయనాలు ఉంటాయి. బంధువుల ద్వారా విశేష సాయం అందుతుంది. స్థిరాస్తులను కొనుగోలు చేయాలన్న ఆలోచన ఫలిస్తుంది. ఖరీదైన వాహనాలు కొంటారు. శని పంచమ స్థానంలో సంచారం వల్ల విశేష గౌరవం, పట్టుదలతో కార్యజయం కలుగుతుంది. సౌఖ్యమైన జీవనం సాగిస్తారు. సంతానరీత్యా శుభవార్తలు రాగలవు. ఇక డిసెంబర్5 వరకు అర్థాష్ఠమ రాహువు వల్ల ఈతి బాధలు. మానసిక ఆందోళన. వివాదాలు.
ఆరోగ్యం కొంత చికాకు పరుస్తుంది. మీరు నమ్మిన వ్యక్తులే కొంత మోసగించే వీలుంది.
అప్రమత్తత అవసరం. వ్యాపార, వాణిజ్యవర్గాలు ఆశించినమేర లాభాలు ఆర్జిస్తారు. మరిన్ని పెట్టుబడులు సమీకరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు, ఇంక్రిమెంట్లు రావచ్చు. వీరికి కొన్ని బాధ్యతల నుండి విముక్తి లభిస్తుంది. పారిశ్రామిక, సాంకేతిక రంగాల వారు రెట్టించిన ఉత్సాహంతో గడుపుతారు. కళాకారులు అనుకున్న అవకాశాలు పొందుతారు. రాజకీయవర్గాలపై అపవాదులు, ఆరోపణలు తొలగుతాయి. వైద్యులు, క్రీడాకారుల అంచనాలు నిజం కాగలవు. వ్యవసాయదారులకు రెండవపంట లాభసాటిగా ఉంటుంది. అయితే ఏప్రిల్– మే నెలల్లో శని, కుజుల కలయిక వల్ల మానసిక సంఘర్షణ, జీవిత భాగస్వాముల మధ్య విభేదలు రావచ్చు. మొత్తం మీద వీరికి సానుకూల ఫలితాలే ఎక్కువ.
అదృష్టసంఖ్య–9, పగడం ధరించాలి.
డిసెంబర్5 నుండి రాహు గ్రహానికి పరిహారాలు చేసుకుంటే మంచిది.
వీరు దుర్గా, సుబ్రహ్మణ్య ఆరాధనలు చేస్తే ప్రతికూలత తగ్గుతుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
ఆదాయం–14 వ్యయం –11 రాజపూజ్యం–5, అవమానం–6.
వీరికి గురువు జూన్1వ తేదీ వరకూ సప్తమస్థితిలోనూ, తదుపరి అష్టమస్థితిలోనూ సంచారం. అష్టమస్థితిలో ఉచ్ఛయందు సంచారం కొంత అనుకూలమైనా మొత్తానికి సామాన్యంగానే ఉంటుంది. ఇక శని సంవత్సరమంతా అర్థాష్టమ స్థానంలో సంచారం. ఇది ఇబ్బందికరమైన పరిస్థితులు సూచిస్తోంది . రాహుకేతువులు డిసెంబర్5వరకు తృతీయ, భాగ్యస్థానాలలో సంచారం. తదుపరి ద్వితీయ, అష్టమస్థానాల్లో సంచరిస్తారు. మొత్తానికి వీరికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. రాబడి మీరు ఆశించినంతగా లభించినా ఏవో ఖర్చులు వచ్చి మిగులున్నది లేకుండా ఉంటుంది. కుటుంబంలో ప్రతి విషయంలోనూ వాదోపవాదాలు సాగుతాయి. తద్వారా సత్సంబంధాలకు ఇబ్బంది రావచ్చు. మీరే కొంత తగ్గి సంయమనంతో మెలగడమే మేలు. ఇక సంతానపరంగా కూడా కొన్ని చిక్కులు, చికాకులు రావచ్చు. తృతీయ రాహువు, భాగ్యస్థానంలో కేతువు శుభాలను ఇస్తారు. తదుపరి డిసెంబర్ 5నుండి వీరు కూడా దోషకారులే. వివాహాది శుభకార్యాలు ప్రథమార్థంలో జరుగుతాయి. అలాగే, ఆస్తుల కొనుగోలుకు చేసే యత్నాలు అనుకూలిస్తాయి. జూన్ 2 నుండి అష్టమ గురువు , అర్థాష్టమ శని ప్రభావం సమస్యలకు కారణమవుతుంది. ప్రతిదీ సమస్యగానే మారి సవాలుగా మారవచ్చు. ఆరోగ్యపరంగా ముఖ్యంగా నరాలు, మెదడు, ఛాతీ సంబంధిత రుగ్మతలు ఎదుర్కొనే అవకాశాలున్నాయి. అదే విధంగా ఖర్చులు కూడా విశేషంగా పెరుగుతాయి. తరచూ ప్రయాణాలు, అలసట తప్పదు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొని దైవచింతనలో గడుపుతారు. వ్యాపారస్తులు, వాణిజ్యవర్గాలకు ఒడిదుడుకులు ఎదుర్కొన్నా ప్రథమార్థమంతా లాభసాటిగా సాగుతాయి. అనుకున్న పెట్టుబడులలో కొంత జాప్యం. ఉద్యోగులు ఆకస్మిక బదిలీలకు సిద్ధపడాలి. పై స్థాయి అధికారుల వైఖరి అర్థంకాక అయోమయంలో పడతారు. పారిశ్రామికవేత్తలు, సాంకేతిక రంగాల వారికి నిరాశానిస్పృహలు. విద్యార్థుల కష్టం కొంత వృథా కాగలదు. వ్యవసాయదారులకు రెండవ పంట కొంత అనుకూలిస్తుంది. క్రీడాకారులకు ప్రోత్సాహం అంతగా ఉండదు. రాజకీయనేతలకు ఒత్తిడులు పెరుగుతాయి. న్యాయవాదులు, కళాకారులకు ప్రారంభంలో శుభదాయకంగా ఉంటుంది. తదుపరి చిక్కులు ఎదురుకావచ్చు.
అదృష్టసంఖ్య–3. వీరు పుష్యరాగం ధరించాలి.
శని, గురునికి పరిహారాలు చేయించుకోవాలి.
వారాహీ స్తోత్రాలు పఠించండి.
శివాలయ దర్శనాలు చేస్తూ ఉండండి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణ, ధనిష్ట 1,2 పాదాలు)
ఆదాయం–2 వ్యయం–8, రాజపూజ్యం–1 అవమానం–2.
ఈరాశి వారికి జూన్2 నుండి సప్తమ స్థానమైన ఉచ్ఛస్థితిలో గురు సంచారం విశేషం. అప్పటి వరకూ షష్ఠమ సంచారం వల్ల మానసిక ఆందోళన. ధనవ్యయం. రాబడి తగ్గడం వంటి ఫలితాలు ఉంటాయి. ఇక శని అనుకూలుడు. అందరిలోనూ మంచి గుర్తింపు పొందుతారు. శ్రమపడ్డా ఫలితం ఇస్తాడు. ఇక డిసెంబర్5వరకు రాహుకేతువులు ద్వితీయ, అష్టమ స్థానాల్లో సంచరించి తదుపరి జన్మ, సప్తమరాశుల్లో సంచరిస్తారు. వీరు సామాన్య ఫలితాలు ఇస్తారు. మొత్తానికి వీరికి ద్వితీయార్థమే అత్యంత సానుకూలమైదిగా చెప్పొచ్చు ద్వితీయార్థంలో ఆర్థికంగా బలం చేకూరినా ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. మిత్రులు, బంధువులతో వివాదాలు పరిష్కారమవుతాయి. స్థిరాస్తుల కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. మీ అభిప్రాయాలను కుటుంబ సభ్యులు గౌరవిస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపంలో పెడతారు. చిరకాలంగా ఎదురవుతున్న కొన్ని చిక్కులు వీడతాయి. అనుకున్న పనులు పూర్తి చేయడంలో పట్టుదలతో కృషి చేస్తారు. మరింతగా తీర్థ యాత్రలు చేస్తారు. వ్యాపారులు, వాణిజ్యవర్గాలకు ద్వితీయార్థం విశేషంగా కలసివస్తుంది. అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగవర్గాలకు పదోన్నతులు రావచ్చు. అలాగే, ఆశించిన బదిలీలు జరిగే సూచనలున్నాయి. పారిశ్రామికవేత్తలు, సాంకేతిక రంగాల వారికి నూతనోత్సాహం. న్యాయవాదులు, కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. క్రీడాకారులు మరింత కీర్తి పొందుతారు.
వ్యవసాయదారులకు రెండవ పంట అనుకూలిస్తుంది. అయితే ఆరోగ్యంపై ప్రథమార్థం తగు జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా చర్మ, ఉదర, నరాల సంబంధిత రుగ్మతలు ఉండవచ్చు.
అదృష్టసంఖ్య–8. వీరు నీలం ధరించాలి.
గురు, రాహుకేతువులకు పరిహారాలు చేయించుకోవాలి.
రుద్రనమకం, సూర్యారాధన మంచిది.
కుంభం (ధనిష్ట 3,4 పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
ఆదాయం–2 వ్యయం–8 రాజపూజ్యం – 4 అవమానం–2
వీరికి జూన్1వరకు పంచమ స్థానం, తదుపరి షష్ఠమమైనా సువర్ణమూర్తి కావడం, ఉచ్ఛస్థానం కావడం గురుని సంచారం శుభకరం. ఇక ఏల్నాటిశని, జన్మరాశిలో రాహువు దోషకారులు. డిసెంబర్‌నుండి రాహువు వ్యయస్థానంలో మరింత దోషకారి. ఈరీత్యా పరిశీలిస్తే ధనకారకుడు గురువు శుభత్వం వల్ల ధనానికి లోటు లేకున్నా ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. అంటే ఆదాయానికి సరిపడు ఖర్చులు కూడా చేస్తారు. సోదరులతో నెలకొన్న విభేదాలు పరిష్కరించుకుంటారు. వివిధ రంగాల్లో మీ సేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు ద్వితీయార్థంలో అనుకూలిస్తాయి. ఆస్తి విషయాలలో ఒప్పందాలు చేసుకుంటారు. కోర్టు కేసులు పరిష్కారదశకు చేరతాయి. ఇక ఏలినాటి శని, జన్మరాశిలో రాహువు, సప్తమంలో కేతువు ప్రభావం వల్ల తరచూ ఆరోగ్య సమస్యలు. ముఖ్యంగా నేత్ర, నరాలు, ఎముకలు, చర్మ సంబంధిత రుగ్మతలతో ఇబ్బందిపడవచ్చు. వైద్యసేవలు అవసరం కావచ్చు. అత్యంత ఆప్తులతో అకారణంగా తగాదాలు ఏర్పడతాయి. మీ మంచితనం అంతగా పనిచేయదు. ఏ కార్యక్రమం చేపట్టినా అత్యంత శ్రమానంతరం పూర్తి కాగలవు. ఇంటి నిర్మాణాలు, కొనుగోలు యత్నాలలో కొంత పురోగతి ఉంటుంది. దైవకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలను విస్తరించాలన్న ఆలోచనలు క్రమేపీ ఫలిస్తాయి. కొత్త పెట్టుబడులు కొంతమేర సమకూరతాయి. ఉద్యోగస్తులకు విధుల్లో ఒత్తిడులు రావచ్చు. అయితే ప్రథమార్థంలో పదోన్నతులు లేదా ఇంక్రిమెంట్లు దక్కవచ్చు. పారిశ్రామికవేత్తలు, సాంకేతిక వర్గాలకు కష్టానికి ఫలితం స్వల్పంగా ఉంటుంది. కళాకారులు అనుకున్న అవకాశాలు కొన్ని దక్కించుకుంటారు. విద్యార్థులు ఆశించిన అవకాశాలు ఎట్టకేలకు దక్కించుకుంటారు. క్రీడాకారులకు విజయాలు దక్కవచ్చు. వ్యవసాయదారులకు రెండవ పంట కలసివస్తుంది. వైద్యులు, న్యాయవాదులకు నిరాశాజనకంగా ఉన్నా క్రమేపీ సానుకూలత ఉంటుంది.
అదృష్టసంఖ్య–8, నీలం ధరించాలి.
వీరు శని,రాహుకేతువులకు పరిహారాలు చేయించుకోవాలి.
శివాలయంలో తరచూ అభిషేకాలు జరిపించుకోవడం మంచిది.
మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)
ఆదాయం–14 వ్యయం–11, రాజపూజ్యం–7, అవమానం–2.
వీరికి గురువు జూన్1 వరకు చతుర్ధమందు, తదుపరి పంచమ స్థానంలో ఉచ్చస్థితి సంచారం అనుకూలం. ఇక జన్మరాశిలో శని(ఏలినాటి శని), రాహుకేతువులు డిసెంబర్ 5 వరకు వ్యయ, షష్ఠమస్థానాల్లోనూ, తదుపరి లాభ, పంచమస్థానాల్లో సంచారం. వీరికి గురువు మూర్తిమంతం చేత సామాన్యుడైనా ఉచ్ఛ స్థితి సంచారం కాలంలో శుభత్వం ఇస్తాడు. అనూహ్యమైన ధనలాభాలు. సోదరులు, ఆప్తులు మీకు సహాయం అందించడంలో ముందుంటారు. కొన్ని వ్యవహారాలలో క్రియాశీల పాత్ర పోషిస్తారు. సంఘంలో విశేష గౌరవప్రతిష్ఠలు పొందుతారు. ఆశ్చర్యకరమైన రీతిలో తీసుకునే నిర్ణయాలపై కుటుంబ సభ్యులు విస్మయం వ్యక్తం చేస్తారు. ఆలోచనలు వెనువెంటనే అమలు చేస్తారు. స్థిరాస్తులు సమకూర్చుకునేందుకు యత్నాలు సాగిస్తారు.
వాహనయోగం. వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. సంతానరీత్యా శుభవార్తలు వింటారు. వీరికి ఏలినాటి శని ఉన్నా ఉచ్చస్థితిలోని గురువు స్వక్షేత్రమైన మీనరాశిని విశేష దృష్టితో వీక్షించడం శుభదాయకం. శని ప్రభావం అంతగా కనిపించదు. అయితే కఠోర శ్రమానంతరం ఫలితం ఉంటుంది. చాకచక్యం, నేర్పుగా వ్యవహరించడం మంచిది. పట్టుదల పెరుగుతుంది. ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడొచ్చు. తరచూ దూరప్రయాణాలు, వృథాగా ఖర్చులు చేస్తారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. అలాగే, వ్యయంలో రాహువు వల్ల ప్రతి పనిలో ఆటంకాలు.
వ్యయప్రయాసలు. డిసెంబర్ 5 నుండి శుభదాయకంగా ఉంటుంది. వ్యాపారాలు ద్వితీయార్థం నుండి విశేషంగా రాణిస్తాయి. పెట్టుబడుల విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా కలసివస్తుంది. ఉద్యోగులకు అనుకూల మార్పులు అనివార్యం. పై స్థాయి అధికారులరీత్యా ఒత్తిడులు వచ్చినా నిలబడతారు. రాజకీయనేతలకు పదవులు ఊరిస్తాయి. సాంకేతిక రంగాలు, పారిశ్రామికవేత్తలకు కాస్త ఆశాజనకంగా ఉంటుంది. విద్యార్థులు శ్రమానంతరం మంచి ఫలితాలు సాధిస్తారు. వ్యవసాయదారులకు రెండవ పంట లాభిస్తుంది. సాంకేతిక రంగం, కళాకారులకు గుర్తింపుతో పాటు, వ్యయప్రయాసలు కూడా తప్పవు.
అదృష్టసంఖ్య–3, పుష్యరాగం ధరించాలి.
వీరు శని, రాహుకేతువులకు పరిహారాలు చేయించుకోవాలి.
ఏప్రిల్–మే మధ్యకాలంలో సుబ్రహ్మణ్యారాధన మంచిది.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
Ugadi rasi phalalu 2026 content by Vakkantham Chandramouli’s Janmakundali.com
Check our Telugu Calendar App on Android or iPhone by clicking below links. Our calendar app contains daily panchangam (today panchangam in telugu), horoscope, festivals and spiritual content. మా తెలుగు కేలండర్ ఆప్ ను ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని పంచాంగం, రాశి ఫలాలు, పండుగలు మరియు ఆధ్యాత్మిక వివరాలను తెలుసుకోగలరు.
