Vijayawada Sri Kanaka Durga Temple

కృష్ణా నదీ తీరంలో ఆవిర్భవించిన పరమ పవిత్రమైన క్షేత్రాలలో “ఇంద్రకీలాద్రి” ఒకటిగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ .. కృష్ణా జిల్లా .. విజయవాడలో ఈ క్షేత్రం అలరారుతోంది. ఆదిపరాశక్తి అయిన అమ్మవారు “దుర్గాదేవి”గా ఆవిర్భవించిన అత్యంత శక్తిమంతమైన క్షేత్రం ఇది. ఇక్కడి ఇంద్రకీలాద్రిపై అమ్మవారు కొలువై భక్తుల పాలిట కొంగుబంగారంగా పూజలు అందుకుంటోంది. ఇంద్రకీలాద్రి అనే పేరు ఎలా వచ్చి ఉంటుందనే సందేహం రావడం సహజం.

పూర్వం “కీలుడు” అనే యక్షుడు అమ్మవారి సాక్షాత్కారాన్ని కోరుతూ ఇక్కడ తపస్సు చేశాడు. అమ్మవారిని తనపై కొలువై ఉండమని కోరాడు. మహిషాసురుడిని సంహరించిన అనంతరం అతని కోరిక తీరుతుందని అమ్మవారు చెబుతుంది. ఆ సమయానికి అతను పర్వత రూపాన్ని ధరించడం జరుగుతుందని సెలవిస్తుంది. అందుకు కీలుడు ఆనందంగా అంగీకరిస్తాడు. ఆ తరువాత కాలంలో లోక కంటకుడైన మహిషాసురుడిని అమ్మవారు సంహరించడం .. పర్వతంగా మారిపోయిన కీలుడుపై ఆవిర్భవించడం జరిగింది.

లోక కల్యాణం కోసం అమ్మవారు మహిషాసురిడిని సంహరించడంతో ఇంద్రాది దేవతలు ఈ ప్రదేశానికి వచ్చి అమ్మవారిని అనేక రకాలుగా స్తుతించారు. కీల పర్వతం పైన అమ్మవారు కొలువైన కారణంగా .. ఇంద్రాది దేవతలు అమ్మవారిని తొలుత దర్శించిన కారణంగా ఈ పర్వతానికి “ఇంద్రకీలాద్రి” అనే పేరు వచ్చింది. అసుర సంహారం చేసి అమ్మవారు విజయాన్ని సాధించిన కారణంగా ఈ ప్రాంతానికి “విజయవాడ”(Vijayawada) అనే పేరు వచ్చిందని అంటారు. అర్జునుడు ఇక్కడే తపస్సు చేసి పరమ శివుడి నుంచి “పాశుపతాస్త్రం” పొందాడు. అందువల్లనే అర్జునుడిని “విజయుడు” అని కూడా పిలుస్తుంటారు.

దుర్గముడు అనే అసురుడిని సంహరించడం వల్లనే అమ్మవారు దుర్గాదేవిగా పూజలు అందుకుంటోంది. దుర్గతులను నశింపజేసేదే “దుర్గా” అని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మవారిని భవానిగా కూడా భక్తులు కొలుస్తుంటారు. తన భక్తులను అమ్మవారు కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటుందనడానికి అనేక నిదర్శనాలు కనిపిస్తూ ఉంటాయి. అమ్మవారి అనుగ్రహంతో కష్టాల నుంచి బయటపడిన సంఘటనలు కథలు కథలుగా ఇక్కడ వినిపిస్తూ ఉంటాయి.

పూర్వం అమ్మవారి సన్నిధిలోనే ఉంటూ ఒక బ్రాహ్మణుడు ఆ తల్లిని ఉపాసన చేస్తూ ఉండేవాడు. ఒకరోజున గాజులు అమ్మే వ్యక్తి రావడంతో .. ఆ ఇంట్లో ఉన్న నలుగురు ఆడపిల్లలు గాజులు వేయించుకున్నారు. ఆ బ్రాహ్మణుడు డబ్బులు ఇవ్వబోగా .. తాను ఐదుగురు ఆడపిల్లలకు గాజులు వేశానని ఆ వ్యక్తి వాదించడం మెదలుపెట్టాడు. ఆ ఇంట్లో ఉన్నదే నలుగురు ఆడపిల్లలు .. ఐదుగురికి గాజులు వేసినట్టుగా ఆ వ్యక్తి చెబుతున్నాడు .. అదెలా సాధ్యం? అని ఆ బ్రాహ్మణుడు ఆలోచనలో పడ్డాడు.

అప్పుడు ఆ బ్రాహ్మణుడికి ఒక అనుమానం వచ్చింది .. వెంటనే అతను ఆలయంలోకి వెళ్లి అమ్మవారి మూర్తిని చూశాడు. అమ్మవారి చేతికి కొత్తగా తొడిగిన గాజులు కనిపించాయి. అంతే.. ఆయన ఆనందానికి హద్దులు లేవు. అమ్మవారే బాలిక రూపంలో వచ్చి గాజులు తొడిగించుకోవడం .. ఆ తల్లి ఇక్కడ ప్రత్యక్షంగా ఉందనడానికి నిదర్శనం. అందువల్లనే వేల సంఖ్యలో అమ్మవారిని భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. భవానీ దీక్షలు తీసుకుంటూ ఉంటారు. చైత్ర మాసంలో “వసంత నవరాత్రి ఉత్సవాలు” .. ఆశ్వయుజ మాసంలో “దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు” .. శివరాత్రి రోజున దుర్గా మల్లేశ్వరస్వామి వివాహోత్సవం కనుల పండుగలా జరుగుతాయి. ఆ వైభవాన్ని మనసుతో ధరించవలసిందే .. తరించవలసిందే!

ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ వారం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ సంవత్సరం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత .. ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే. పూర్తి సమాచారం కాదు.

Vijayawada Sri Kanaka Durga Temple