Sri Bhagavatam – Vishnumurthy took the third step on Bal Chakravarthy’s head

వామనుడు అడిగిన మూడు అడుగుల నేలను దానంగా ఇవ్వడానికి బలిచక్రవర్తి అంగీకరిస్తాడు. వామనుడికి మూడు అడుగుల నేలను ధారపోయడానికి సిద్ధమవుతాడు. వామనుడు వచ్చిన దగ్గర నుంచి శుక్రాచార్యుడు అతనిని అనుమానిస్తూనే ఉంటాడు. తను అనుమానాన్ని వ్యక్తం చేసినా బలిచక్రవర్తి పట్టించుకోవడం లేదు. దానంగా ఏది అడిగినా ఇవ్వొద్దమని చెప్పినా వినిపించుకోవడం లేదు. ఏమిటి చేయడం? అని శుక్రాచార్యుడు ఆలోచనలో పడతాడు. అప్పుడు ఆయనకి ఒక ఆలోచన వస్తుంది.

కమండలంలోని నీటి ధార సక్రమంగా పడుతున్నప్పుడే దానం చేసే కార్యక్రమం పూర్తవుతుంది. అందువలన అలా జరగకుండా ఉండటం కోసం, ఆ నీటి పాత్రలోని రంధ్రానికి సూక్ష్మ రూపంలో శుక్రాచార్యుడు అడ్డుపడతాడు. దాంతో కమండలంలోని నీటి ధార ఆగిపోతుంది. వామనుడిగా వచ్చిన శ్రీమన్నారాయణుడికి అది శుక్రాచార్యుడి పనే అనే విషయం అర్థమైపోతుంది. దాంతో ఆయన కమండలంలోని నీటి ధారకు ఏదో అడ్డుపడినట్టుగా ఉందంటూ, తన చేతిలోని దర్భ పుల్లతో దాని రంధ్రంలో పొడుస్తాడు. దాంతో శుక్రాచార్యుడి కన్నుపోతుంది.

శుక్రాచార్యుడు ఆ బాధతో పక్కకి తప్పుకోవడంతో దానం ఇచ్చే కార్యక్రమం పూర్తవుతుంది. అప్పుడు వామనుడు తనకి ధారగా పోసిన మూడు అడుగుల నేలను స్పర్శిస్తానంటూ ఒక అడుగుతో సమస్త భూమండలాన్ని ఆక్రమిస్తాడు. మరో అడుగుతో ఆకాశమండలాన్ని ఆక్రమిస్తాడు. మూడో అడుగు ఎక్కడ పెట్టనని బలిచక్రవర్తిని అడుగుతాడు. తాను అనుకున్నట్టుగానే వచ్చింది విష్ణుమూర్తి అనే విషయం స్పష్టం కావడంతో, మూడో అడుగును తన తలపై పెట్టమని బలిచక్రవర్తి చెబుతాడు.

అప్పుడు వామనుడు .. బలిచక్రవర్తిని “సుతల” లోకానికి అధిపతిని చేస్తున్నట్టుగా చెబుతాడు. సావర్ణి మన్వంతరంలో బలిచక్రవర్తికి దేవేంద్రుడి పదవి లభిస్తుందని అంటాడు. బలిచక్రవర్తి స్వామికి భక్తి శ్రద్ధలతో నమస్కరించుకుంటాడు. ఆయన తలపై స్వామి మూడో అడుగుమోపి, ఆయనను సుతల లోకానికి పంపించి వేస్తాడు. మూడు అడుగుల నేలను అడిగి ముల్లోకాలను ఆక్రమించిన వామనుడు, దేవేంద్రుడికి అమరావతిని అప్పగిస్తాడు. దాంతో దేవతలంతా తిరిగి అక్కడికి చేరుకుంటారు. అందుకు ఆ స్వామికి అదితీదేవి కృతఙ్ఞతలు తెలియజేస్తుంది.

ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ వారం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ సంవత్సరం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో  సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.

Sri Bhagavatam – Vishnumurthy took the third step on Bal Chakravarthy’s head