యయాతి తనకి యవ్వనం ఇవ్వమని కోరడం పట్ల యదువు అసంతృప్తిని వ్యక్తం చేస్తాడు. ఒక తండ్రి ఒక కొడుకుని ఈ విధమైన కోరిక కోరడం సరైనదిగా అనిపించడం లేదని అంటాడు. యవ్వనం అందరిలో ఒకే రకమైన భావనలు కలిగిస్తూ ఉంటుందని చెబుతాడు. ఎవరికైనా ఒకటే జీవితం ఉంటుందనీ, అందమైన ఆ జీవితాన్ని ఆనందంగా గడపాలనే కోరుకుంటారని అంటాడు. జీవితంలో ఎంతోకొంత అనుభవించిన ఆయన, యవ్వనంలోకి అడుగుపెట్టిన తనని ఒక మోడులా బ్రతకమని చెప్పడంలో పూర్తి స్వార్థం కనిపిస్తుందని చెబుతాడు.

యదువును తాను ఎంత ప్రేమతో పెంచినదీ … ఎంతగా గారం చేసింది యయాతి చెబుతాడు. అతని ముచ్చట తీర్చడం కోసం ఎంతగా కష్టపడింది గుర్తుచేస్తాడు. అలాంటి ఒక తండ్రి కోరికను యదువు కాదనడం పట్ల ఆయన అసహనాన్ని వ్యక్తం చేస్తాడు. అసలు ఈ విషయమై తాను అభ్యర్ధించకూడదనీ, కుమారులే ముందుకు రావాలని అంటాడు. అలాంటిది తాను బ్రతిమాలినా ఒప్పుకోకపోవడం విచారించదగిన విషయమని చెబుతాడు. ఈ విషయమై తనతో ఎంతసేపు మాట్లాడినా ప్రయోజనం ఉండదనీ, ఎవరూ కూడా వేరెవరికీ త్యాగం చేయలేనివాటిలో యవ్వనం కూడా ఒకటని తేల్చేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

మొదటి సంతానమైన యదువు తన ముసలితనాన్ని తీసుకోనని అనడంతో, యయాతి చిన్నబుచ్చుకుంటాడు. కుమారులు తన వారసత్వంగా రాజ్యాన్ని తీసుకుంటారు .. సంపదలను పంచుకుంటారు. వాటితో తమ జీవితాన్ని ఆనందంగా అనుభవిస్తారు. కానీ తమ జీవితానికి రాచ మార్గాన్ని వేసిన తండ్రి కోరికను మాత్రం తీర్చలేరు. వాళ్ల కోసం చేసిన త్యాగాలు గుర్తుండవు .. తన కోసం త్యాగాలు చేయడానికి ముందుకురారు. ఇలాంటి కుమారులపై తాను అనవసరంగా ఆశ పెట్టుకున్నానేమోనని ఆవేదన చెందుతాడు.

ఆ తరువాత తుర్వసుడు .. దృహ్యుడిని కూడా యయాతి తన భవనానికి పిలిపిస్తాడు. తాను కబురు చేయడానికి గల కారణాన్ని గురించి చెబుతాడు. ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు తనకి యవ్వనాన్ని ఇవ్వవలసి ఉంటుందని అంటాడు. తన మనసులోని బలమైన కోరికను అర్థం చేసుకోవలసిన బాధ్యత వాళ్లకి ఉందని చెబుతాడు. అయితే వాళ్లు కూడా తమ యవ్వనాన్ని ఇవ్వడానికి నిరాకరిస్తారు. సమస్త భోగభాగ్యాలు అందుబాటులో ఉన్నప్పుడు యవ్వనాన్ని ఎలా త్యాగం చేయాలని అడుగుతారు. యవ్వనం శక్తినీ .. ఉత్సాహాన్ని ఇస్తుంది. కోరుకున్న పదార్థాలను ఆస్వాదించేలా చేస్తుంది. వైభవాలను పొందే అవకాశాన్ని ఇస్తుంది. అందువలన తాము ఒప్పుకోలేమని అంటారు.

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.