అది నిర్జన ప్రదేశం కావడం వలన పాడుబడిన బావిలోనే దేవయాని ఉండిపోతుంది. కాపాడమని పిలిచినా ఎవరూ వచ్చే ప్రదేశం కాకపోవడంతో దేవయాని ఆలోచనలో పడుతుంది. ఒకవేళ కాపాడమని పిలుద్దామనుకున్నా, తన వంటిపై వస్త్రాలు లేవు. ప్రాణాలు దక్కినా పరువు పోతుంది. ఇతరుల సహాయం లేకుండా ఆ బావి నుంచి బయటపడటం కష్టం. ఏమిటి చేయడం అని ఆలోచనలో పడుతుంది. తనని ఇలాంటి పరిస్థితిలో పడేసిన శర్మిష్ఠకు తగిన బుద్ధి చెప్పాలి. అందుకోసమైనా తాను ప్రాణాలను రక్షించుకోవాలి అనుకుంటుంది.

దేవయాని ఒంటరిగా అలా పాడుబడిన బావిలోనే ఉండిపోతుంది. సమయం గడుస్తున్నా కొద్దీ ఆమె నీరసించిపోతుంటుంది. ఇక ఆత్మాబిమానం గురించి ఆలోచన చేయకుండా, ఓపిక ఉండగానే కాపాడామని కేకలు వేయడం మంచిదని భావించి కేకలు వేయడం మొదలు పెడుతుంది. ఎవరూ పలకకపోవడంతో ఆమె కన్నీళ్ల పర్యంతమవుతూ ఉంటుంది. కానీ తన ప్రయత్నాన్ని మానుకోకుండా అలా పిలుస్తూనే ఉంటుంది. అడవి మృగాలను వేటాడుతూ అదే సమయంలో “యయాతి” మహారాజు అటుగా వస్తాడు. ఆ బావిలో నుంచి స్త్రీ గొంతుక వినిపించడంతో తన గుర్రాన్ని ఆపేస్తాడు.

ఇంతటి నిర్జన ప్రదేశంలో .. పాడుబడిన బావిలో నుంచి స్త్రీ అరుపు వినిపించడం ఆయనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అలా ఆలోచన చేస్తూనే చకచకా ఆ బావి దగ్గరికి చేరుకుంటాడు. లోపల వంటిపై వస్త్రం లేకుండా ఉన్న దేవయానిని చూసి, వెంటనే తన వద్ద ఉన్న ఒక వస్త్రాన్ని ఆమె పైకి విసురుతాడు. ఆ అడవిలో తన అరుపు విని ఒక వ్యక్తి రావడం దేవయానికి ఆనందాన్ని కలిగిస్తుంది. ఆయన అందించిన వస్త్రాన్ని నిండుగా కప్పుకుంటుంది. ఆ తరువాత నెమ్మదిగా ఆమెను యయాతి మహారాజు బావి పై వరకూ లాగేసి తన చేయి అందించి బయటికి తీసుకువస్తాడు.

దేవయానిని బయటికి తీసుకు వచ్చిన మహారాజు .. ముందుగా ఆమె దాహాన్ని తీరుస్తాడు. ఆమె ఆకలి తీరడానికి అవసరమైన ఫలాలను ఏర్పాటు చేస్తాడు. ఇంతటి అందగత్తెను ఇంతవరకూ చూడలేదని మనసులోనే అనుకుంటాడు. ఎంతో సుకుమారి అయిన ఆమె అంతటి దట్టమైన అడవులకు ఎలా వచ్చిందీ .. ఏ పరిస్థితులను ఎదుర్కొన్నది అనుకుంటాడు. మనసు కుదుటపడిన తరువాత తాను శుక్రాచార్యుడి కూతురునని దేవయాని చెబుతుంది. తన పరిస్థితికి గల కారణాన్ని వివరిస్తుంది.

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.