కాలం గడిచిపోతూ ఉంటుంది .. యయాతి విలాసవంతమైన జీవితంలో మునిగితేలుతుంటాడు. దేవయాని కూడా ఆయన సేవలో బాహ్యప్రపంచాన్ని మరిచిపోతుంది. ఇద్దరూ కూడా ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా జీవితాన్ని కొనసాగిస్తూ వస్తారు. అలా వాళ్ల జీవితం సంతోషకరంగా సాగిపోతున్న సమయంలో ఒక్కసారిగా యయాతి దృష్టి మారిపోతుంది. అప్పటివరకూ అనుభవిస్తూ వచ్చిన సుఖాల పట్ల అనాసక్తి కలుగుతుంది. విషయవాసనల పట్ల విముఖత ఏర్పడుతుంది. జీవితం అశాశ్వతం .. కట్టెల్లో కాలిపోయే ఈ శరీరానికి సుఖాలను అలవాటు చేయడం అవివేకం అనుకుంటాడు.

రాజ్యాలు .. రాచరికాలు .. సంపదలు .. సుఖాలు ఇవేవి పై లోకంలో సమకూరవు. అందమైన భార్య .. వారసులు ఎవరూ కూడా వెంటరారు. ఎవరు చేసుకున్న పుణ్యం మాత్రమే వాళ్లతో వస్తుంది. భగవంతుడి నామస్మరణ .. ఆయన సేవ మాత్రమే ఉత్తమ గతులను కలిగించగలదు. అందువల్లనే శరీరానికి సంబంధించిన సుఖాలను వదిలేసి .. మోక్షపదం చేరుకోవడానికి అవసరమైన మార్గాన్ని అనుసరించాలని భావిస్తాడు. ఎవరి సౌందర్యమైనా తాత్కాలికమే .. అసలైన సౌందర్యం ఆ పరమాత్ముడిదే. ఆ సౌందర్యాన్ని ఆరాధించడంలోనే అసలైన ఆనందం ఉందని గ్రహిస్తాడు.

యయాతి .. ఇక తన జీవితాన్ని భగవంతుడి సేవకి సమీపంగా తీసుకెళ్లాలని నిర్ణయించుకుంటాడు. తాను తీసుకున్న నిర్ణయాన్ని గురించి దేవయానితో చెబుతాడు. ఆయన ఆ మాట అనగానే దేవయాని ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది. ఆయనతో పరిచయమైనా దగ్గర నుంచి సాగిన తమ జీవన ప్రయాణాన్ని తలచుకుంటుంది. అపారమైన ప్రేమానురాగాలను అందిస్తూ వచ్చిన ఆయన హఠాత్తుగా ఆ నిర్ణయాన్ని తీసుకోవడం పట్ల ఆమె కలవరపాటును వ్యక్తం చేస్తుంది. అప్పటి వరకూ కొనసాగిస్తూ వచ్చిన జీవితానికి భిన్నంగా ఆయన ఆలోచించడం పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తుంది.

తన జీవితంలో చోటుచేసుకున్న అనేక మలుపులను గురించి యయాతి ప్రస్తావిస్తాడు. ముఖ్యంగా ఆమె అందచందాలను ఆరాధిస్తూనే చాలాకాలం గడిపేశానని చెబుతాడు. పిల్లలు యవ్వనంలోకి అడుగుపెట్టినా ఆమె పట్ల తనకి గల వ్యామోహం తగ్గలేదని అంటాడు. అలాంటి వ్యామోహంలో తాను బందీని అయినట్టుగా అనిపించిందని చెబుతాడు. ఆ బంధాలను భగవంతుడి నామమే తెంచగలదని చెబుతాడు. అందుకే తాను ఆ మార్గం వైపు అడుగులు వేయనున్నట్టు చెబుతాడు. అందుకు దేవయాని అంగీకరించడంతో, “పూరువు”కు యవ్వనాన్ని ఇచ్చేసి, తన వృద్ధాప్యాన్ని తిరిగి తీసుకుంటాడు. కొడుకులకు రాజ్యాన్ని అప్పగించిన ఆయన తపోవనాలకు వెళ్లిపోతాడు.

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.