బలరామకృష్ణులు ఏనుగును హతమార్చినప్పుడు కంసుడు కాస్త బలహీనపడతాడు. ఆ తరువాత ఆయన చాణూర, ముష్టికులపైనే నమ్మకం పెట్టుకుంటాడు. ఎంతోమంది మహా యోధులను వాళ్లు నేల కూల్చడాన్ని స్వయంగా చూసిన కారణంగా ఆయన వాళ్లపై చాలా ఆశలు పెట్టుకుంటాడు. వాళ్ల బారి నుంచి బలరామకృష్ణులు ఎలాంటి పరిస్థితుల్లోను తప్పించుకోలేరని అనుకుంటాడు. కానీ తన కళ్లముందే బలరామకృష్ణుల చేతిలో వాళ్లు అరటిచెట్ల మాదిరిగా కూలిపోవడం చూసి బిత్తరపోతాడు.
ఇక తానే స్వయంగా రంగంలోకి దిగవలసిన అవసరం ఆసన్నమైనదనే విషయం కంసుడికి అర్థమైపోతుంది. శిశువుగా ఉన్న కృష్ణుడిని రహస్యంగా తరలించి తనకి ఈ రోజున ఇలాంటి పరిస్థితిని తీసుకొచ్చిన వసుదేవుడిపై ఆయన ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. దాంతో వెంటనే వసుదేవుడిని అంతం చేయమని తన పరివారాన్ని ఆదేశిస్తాడు. అంతేకాదు కృష్ణుడిని ఉత్సాహపరుస్తూ ఆయన విజయానికి కారకులవుతున్న గోపాలకులను బంధించమని ఆజ్ఞాపిస్తాడు. బలరామకృష్ణులను కట్టడి చేయమని చెబుతాడు.
కంసుడి అనుచరులు .. ఆయన సైనికులు బలరామకృష్ణులను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. కంసుడి సంహారానికి సమయం రావడంతో ఆయన వైపు కృష్ణుడు అడుగులు వేస్తూ ఉంటాడు. కృష్ణుడిని అడ్డగించడానికి ప్రయత్నిస్తున్నవారిని బలరాముడు కడతేర్చుతూ వెళుతుంటాడు. మిగతా వాళ్లంతా తమకి తోచిన దిశగా పరుగులు పెడుతుంటారు. మధురానగరమంతా గగ్గోలుగా ఉంటుంది. తనవైపు వస్తున్న కృష్ణుడిని చూసిన కంసుడు, తన ఖడ్గాన్ని దూస్తాడు.
కంసుడి ఖడ్గానికి దొరక్కుండా కృష్ణుడు తప్పించుకుంటూ ఉంటాడు. అదనుచూసి కంసుడి గుండెలపై కొడతాడు. అప్పుడు కంసుడు నివ్వెరపోయి కృష్ణుడివైపు చూస్తాడు. మహాబలవంతులైన అసురులను కృష్ణుడు ఎలా మట్టుపెట్టాడనేది ఆయనకి అర్థమవుతుంది. కృష్ణుడు కొట్టిన మరో దెబ్బకు కంసుడు తూలుతూ వెళ్లి నేలపై పడిపోతాడు. ఎగిరి అతని ఉదరంపై కూర్చున్న కృష్ణుడు ఆయన వక్షస్థలంపై పిడిగుద్దులు కురిపిస్తాడు. దాంతో రాక్షసరాజైన కంసుడు హతమవుతాడు. ద్వేషంతోనే అయినా అనుక్షణం తన నామాన్ని పలుకుతూ వచ్చిన కారణంగా కంసుడికి కృష్ణుడు ముక్తిని ప్రసాదిస్తాడు.
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.