“మధుర” రాజుల ఆధిపత్యం నచ్చని రాజులందరినీ కూడగట్టిన జరాసంధుడు, కృష్ణుడిపై యుద్ధానికి బయల్దేరతాడు. భారీ సైనిక దళాలతో ఆయన ముందుకు కదులుతూ ఉంటాడు. జరాసంధుడు తనపైకి యుద్ధానికి వస్తున్నాడనే విషయం కృష్ణుడికి తెలిసిపోతుంది. జరాసంధుడు దుష్టబుద్ధి కలిగినవాడు .. దుర్మార్గులతోనే ఆయన స్నేహం చేస్తూ ఉంటాడు. లోక కల్యాణం కోసం ఒక్కో దుర్మార్గుడిని వెతికి పట్టుకుని సంహరించడం కష్టం. అందువలన కృష్ణుడు ఒక ఉపాయం ఆలోచిస్తాడు.
జరాసంధుడు ఎంతటి బలవంతుడైనా ఆయనను సంహరించడానికి ఎంతోసేపు పట్టదు. దుష్ట బుద్ధి కలిగినవారు అదే స్వభావం కలిగినవారితో స్నేహం చేస్తారు .. చేతులు కలుపుతారు. అందువలన జరాసంధుడిని కాకుండా అతనితో వచ్చే దుష్టులను వధిస్తూ వెళ్లాలి. క్షమించి వదిలేసినట్టుగా జరాసంధుడిని వదిలేయాలి. అతను మళ్లీ కొంతమంది దుర్మార్గులను కూడగట్టుకుని వస్తాడు. అప్పుడు కూడా ఆయనకి సాయం చేయడం కోసం వచ్చిన వారినే అంతమొందించాలి. ఈ విధంగా దుష్టుల సంఖ్య చాలావరకూ నశించిన తరువాత జరాసంధుడి సంగతి చూడాలని భావిస్తాడు.
జరాసంధుడి సైన్యం “మధుర” పొలిమేరలకు చేరుకుంటుంది. “మధుర”ను రహస్యంగా ముట్టడించడానికి తగిన వ్యూహం ప్రకారం పావులను కదుపుతుంటారు. జరాసంధుడు తమపైకి యుద్ధానికి వచ్చిన సంగతిని బలరాముడితో కృష్ణుడు చెబుతాడు. తమని అంతం చేయడానికి వచ్చిన సైన్యాన్ని సమూలంగా నాశనం చేయమని అంటాడు. ఆ తరువాత ఇద్దరూ కలిసి యాదవ సైన్యంతో జరాసంధుడు తన సైన్యంతో ఉన్న ప్రదేశానికి చేరుకుంటారు. కృష్ణుడు తన పాంచజన్యాన్ని పూరించడంతో జరాసంధుడు ఉలిక్కిపడతాడు.
ఊహించని విధంగా బలరామకృష్ణులు అప్రమత్తులై రంగంలోకి దిగడంతో, జరాసంధుడితో పాటు ఆయన సైనికులంతా బిత్తరపోతారు. చకచకా ఆయుధాలు పూని యుద్ధరంగాన దిగుతారు. అల్పులపై మాయలు ప్రయోగిస్తూ, తనకి మించిన బలవంతుడు లేడని విర్రవీగడం సరైనది కాదని కృష్ణుడితో జరాసంధుడు అంటాడు. గోపాలకులు చప్పట్లు కొట్టినంత మాత్రాన గొప్పవాళ్లమనుకుంటే అది అమాయకత్వమవుతుందని చెబుతాడు. శత్రువు బలాబలాలు తెలుసుకుని వివేకవంతులు ముందడుగు వేస్తారు. ఆ వివేకం తనకి కృష్ణుడియందు కనిపించడం లేదని హేళన చేస్తాడు.
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.