సాందీపని మహర్షి ఆశ్రమంలో విద్యాభ్యాసాన్ని పూర్తిచేసిన బలరామకృష్ణులు, ఆ మహర్షి దంపతుల దగ్గర సెలవు తీసుకుని “మధుర” చేరుకుంటారు. అక్కడి ప్రజలు సుఖశాంతులతో జీవించడానికి తమవంతు సహాయ సహకారాలను అందజేస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా, “మగధ” భూపాలుడైన “జరాసంధుడు” కృష్ణుడిపై ఆగ్రహావేశాలతో రగిలిపోతుంటాడు. కంసుడి భార్యలైన “అస్తి – ప్రాస్తి” జరాసంధుడి కూతుళ్లే. భర్త మరణించిన తరువాత వాళ్లు తండ్రి ఆశ్రయాన్ని పొందుతారు.

తన అల్లుడైన కంసుడిని హతమార్చి, తన కూతుళ్లకు వైధవ్యాన్ని కలిగించిన కృష్ణుడిని ఎలాంటి పరిస్థితుల్లోను వదలకూడదని నిర్ణయించుకుంటాడు. తన అల్లుడు కంసుడు మహాపరాక్రమవంతుడు .. అలాంటి బలవంతుడిని మాయచేసి అంతం చేసిన కృష్ణుడినే కాదు, ఆయన అండదండలు చూసుకుని చెలరేగిపోతున్న వాళ్లందరినీ అంతం చేసి తీరాలని భావిస్తాడు. కృష్ణుడిని సంహరించడం వలన, తన కూతుళ్ల మనసును కుదుట పరచాలని అనుకుంటాడు.

కంసుడు మరణించిన దగ్గర నుంచి కన్నీళ్లతోనే కాలం గడుపుతున్న తన కూతుళ్ల దగ్గరికి వెళతాడు. జరిగింది ఘోరమే అయినా, గుండె దిటవు చేసుకోమని చెబుతాడు. ఆ కృష్ణుడు ముల్లోకాల్లో ఎక్కడ దాక్కున్నా వెతికి మరీ వధిస్తానని అంటాడు. కృష్ణుడి మాయలు .. ఆయన చేసే విన్యాసాలు తనదగ్గర చెల్లవని చెబుతాడు. తన శౌర్య పరాక్రమాలు .. సైనిక బలగాలను గురించి తెలియకనే ఆయన కంసుడితో పెట్టుకున్నాడని అంటాడు. ఇక నుంచి కృష్ణుడిని అంతం చేయడమే ధ్యేయంగా తన పనులు సాగుతాయని ఓదార్చుతాడు.

జరాసంధుడు తన కూతుళ్లకు మాట ఇచ్చినట్టుగానే, సైన్యాధిపతిని పిలిపించి మాట్లాడతాడు. కృష్ణుడిని అంతం చేయడమే లక్ష్యంగా తాము “మధుర”ను ముట్టడించవలసి ఉందని అంటాడు. “మధుర” సైనిక బలగాలను మాత్రమే కాదు, కృష్ణుడు మహా మాయావి అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని, అందుకు తగిన విధంగా కార్యాచరణను రూపొందించమని ఆదేశిస్తాడు. దాంతో అందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరిగిపోతుంటాయి. జరాసంధుడు “మధుర”కు శత్రువులైన రాజులతో చేతులు కలుపుతూ తన బలాన్ని పెంచుకుంటూ ఉంటాడు.

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.