కృష్ణుడు .. రుక్మిణి దంపతులు ప్రేమకు ప్రతీకలుగా, మమతానురాగాల మాలికలుగా వెలుగొందుతుంటారు. క్షణమైనా కృష్ణుడిని విడిచి ఉండలేని రుక్మిణీదేవి ఆయన సేవలోనే కాలం గడుపుతూ ఉంటుంది. తన వాళ్లందరినీ తన కోసం వదులుకుని వచ్చిన కారణంగా, ఆమె మనసుకు ఎలాంటి కష్టం కలగకుండా కృష్ణుడు చూసుకుంటూ ఉంటాడు. ఆమె ఇష్టాయిష్టాలు .. అలవాట్లు .. అభిరుచులు తెలుసుకుని, ఆమెకి కావలసినవి అందుబాటులో ఉంచుతూ ఉంటాడు. తన అంతటి అదృష్టవంతురాలు లేదని రుక్మిణి పొంగిపోతూ ఉంటుంది.

ఇక తన గురించి .. తన వలన ముంచుకు వచ్చే ప్రమాదాన్ని గురించి ఎంతమాత్రం ఆలోచించకుండా కృష్ణుడు ఆనందంగా .. హాయిగా ఉండటం జరాసంధుడికి తీవ్రమైన అసహనాన్ని కలిగిస్తుంది. తగిన సమయం చూసి కృష్ణుడిపై యుద్ధం చేయడానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాడు. అందుకోసం తనకి అనుకూలంగా ఉండే రాజులతో మంతనాలు జరుపుతుంటాడు. వాళ్లంతా కూడా ఆయన మాయమాటలు నమ్మేసి, ఆయన వెంట నడవడానికి సిద్ధమవుతుంటారు. అలాగే జరాసంధుడు ఆయుధ సామాగ్రిని కూడా పెద్దమొత్తంలో సమకూర్చుకుంటూ ఉంటాడు.

మొదటి నుంచి కూడా కృష్ణుడిని ద్వేషిస్తూ వచ్చిన శిశుపాలుడు కూడా ఆయనపై మరింత కోపంతో రగిలిపోతుంటాడు. తన పెళ్లిని అపహాస్యంపాలు చేసిన కృష్ణుడికి తగిన బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంటాడు. కృష్ణుడిని ఆయుధాలతో ఎదుర్కోవడం అసాధ్యం .. మాయలతో ఆయనను జయించడం అసంభవం. అందువలన నలుగురిలో ఆయనను అవమానపరచడమే తగిన పని. అందుకు తగిన సమయం కోసం ఎదురుచూడటమే తెలివైనవాడి లక్షణం. అందువలన ఆ సమయం కోసం కాచుకుని ఉండాలని భావిస్తాడు.

ఇక మరో వైపున తన సోదరి అయిన రుక్మిణిని కృష్ణుడు నిర్భయంగా వచ్చి ఎత్తుకెళ్లడం, ఆ విషయంలో ఆయనను ఎవరూ అడ్డగించలేకపోవడం రుక్మికి అవమానంగా అనిపిస్తుంది. అంతేకాదు తన పరివారం ముందు అరమీసం .. అరగుండు గీయడం మరో అవమానం. జీవితంలో ఈ రెండు దృశ్యాలు ఎప్పటికీ గుర్తుకు వస్తూనే ఉంటాయి. అందుకు ప్రతీకారంగా తాను ఏం చేయగలననేది రుక్మి ఆలోచన చేస్తుంటాడు. ఇలా కృష్ణుడి వలన అవమానం పాలైన వాళ్లంతా, సమయం వస్తే ఆయనను దెబ్బతీయాలనే పట్టుదలతో ఎదురుచూస్తుంటారు.

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.