సత్రాజిత్తు మొదటి నుంచి కూడా సూర్యభగవానుడికి మహా భక్తుడు. అనునిత్యం సూర్యోపాసన తరువాతనే ఆయన దైనందిన కార్యక్రమాలు మొదలవుతూ ఉంటాయి. ఆయన ఒక్కగానొక్క కూతురు సత్యభామ. ఆమె అందచందాలను గురించి కృష్ణుడు వింటాడు. ఇక ఆమె మనసులో కూడా ఆయనే ఉంటాడు. నిరంతరం ఆయన గురించిన ఆలోచనలతోనే ఆమె కాలం గడుపుతూ ఉంటుంది. అయితే శతధన్వుడితో ఆమె వివాహం జరిపించాలనే ఉద్దేశంతో సత్రాజిత్తు ఉంటాడు. ఆయన తమ్ముడు “ప్రసేనజిత్తు” కూడా అదే నిర్ణయంతో ఉంటాడు.

సత్రాజిత్తు సూర్యోపాసన ఫలించి ఆయనకి సూర్యభగవానుడు ప్రత్యక్షమవుతాడు. అనునిత్యం పూజా సమయంలో కనకవర్షాన్ని కురిపించే “శ్యమంతకమణి”ని సత్రాజిత్తుకు ఇస్తాడు. శ్యమంతకమణి ఎక్కడ ఉంటే ఆ పరిసర ప్రాంతాల్లో ధనధాన్యాలకు లోటు ఉండదనీ, కరువుకాటకాలు దరిదాపుల్లోకి కూడా రావని సూర్యభగవానుడు చెబుతాడు. సంతోషంతో ఆ శ్యమంతకమణిని అందుకున్న సత్రాజిత్తు, ఆ మణిని పూజా మందిరంలో ఉంచి పూజిస్తుంటాడు. ఆశించిన సంపదలను ఆ మణి నుంచి పొందుతూ ఉంటాడు.

సత్రాజిత్తు శ్యమంతకమణి కారణంగా ఎవరినీ లెక్కచేయడం లేదనీ, మునుపటి సత్రాజిత్తుకి ఇప్పటి అతనికి మధ్య అసలు పోలిక లేదని కృష్ణుడికి తెలుస్తుంది. ఆయనలో అంతగా అహంభావం పెరగడానికి కారణం, ఆ శ్యమంతకమణినే అని కృష్ణుడికి తెలుస్తుంది. ఆ మణిని ఆయన నుంచి అడిగి తీసుకుని, అది ప్రసాదించే సంపదతో ప్రజోపకరమైన పనులు చేయాలని కృష్ణుడు భావిస్తాడు. తన మనసులోని మాటను సత్రాజిత్తుకు విన్నవిస్తాడు. ఆ మాట వినగానే ఆయన ఆగ్రహావేశాలకు లోనవుతాడు. శ్యంతకమణిని ఇచ్చేదిలేదంటూ తేల్చి చెప్పేస్తాడు.

సత్రాజిత్తు ధోరణి కృష్ణుడికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ప్రజల కోసం అడిగినా ఆయన మణిని ఇవ్వడానికి అంగీకరించకపోవడంతో ఆలోచనలో పడతాడు. ప్రసేనుడు .. శతధన్వుడి అభిప్రాయాలు కూడా ఆయన నిర్ణయం వెనుక బలంగా ఉన్నాయని భావిస్తాడు. శ్యమంతకమణి సత్రాజిత్తు దగ్గర ఉన్నంతవరకూ ఆయన ఎవరిమాటా వినడు అనే విషయం కృష్ణుడికి అర్థమైపోతుంది. సమయం వచ్చినప్పుడు ఆ విషయాన్ని గురించిన ఆలోచన చేయవచ్చని ఆయన తన పనుల్లో నిమగ్నమవుతాడు.

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.