కృష్ణుడు ఎన్నివిధాలుగా చెప్పినా వినిపించుకోకుండా నరకాసురుడు సంగ్రామానికి సిద్ధపడతాడు. తనతో యుద్ధం చేసే సాహసం చేయలేకనే మంచి మాటలతో మాయ చేయడానికి ప్రయత్నిస్తున్నావంటూ అవమానకరంగా మాట్లాడతాడు. కృష్ణుడు ఒంటరిగా కాకుండా సత్యభామను యుద్ధానికి తీసుకురావడం గురించి ఎద్దేవా చేస్తాడు. ఇంతకుముందు అతని చేతిలో ప్రాణాలను వదిలిన అసురులు శక్తి హీనులు కావొచ్చుననీ, తనని అలాగే అనుకుని పొరపాటు పడి యుద్ధానికి వచ్చి ఉంటావని హేళన చేస్తాడు.
అనవసరమైన మాటలతో కాలయాపన చేయకుండా యుద్ధం మొదలు పెట్టమని కృష్ణుడిని రెచ్చగొడతాడు. యుద్ధ రంగంలోకి అడుగుపెట్టిన తరువాత పిరికివాడు మాత్రమే శాంతి వచనాలను వల్లె వేస్తారని చెబుతాడు. తానే అన్ని రాజ్యాలపైకి దండెత్తి వెళ్లి అందరినీ జయిస్తూ వచ్చాననీ, అలాంటిది తనపైకి యుద్ధానికి వస్తానని చెప్పినవారిని తాను ఎలా వదిలేస్తానని అంటాడు. యుద్ధం అంటే తనకి ఇష్టం .. విజయం అనే మాట వినడమే తన ముచ్చట అయినప్పుడు తాను ఎలా మనసు మార్చుకుంటానని ఎదురు ప్రశ్నిస్తాడు.
సమరం అనగానే తాను ఎంతో ఉత్సాహంతో బయల్దేరి వచ్చాననీ, అలాంటి తనని చల్లని మాటలతో చల్లబరచడానికి ప్రయత్నించవద్దని అంటాడు. తనతో యుద్ధం చేయడానికి ముందుగానే ఒకసారి తన గురించి పూర్తి వివరాలను తెలుసుకుని ఉండవలసిందని చెబుతాడు. అలా చేస్తే ఆయన అలసిపోయి ఇంత దూరం వచ్చేవాడు కాదని అంటాడు. అతను రాయబారిగా నారదుడిని పంపించినప్పుడే తన నిర్ణయం చెప్పాననీ, ఒకసారి తీసుకున్న నిర్ణయాలను మార్చుకోవడం తనకి అలవాటు లేదని స్పష్టం చేస్తాడు.
తాను ఎంతోమంది అసురులను సంహరించిన మాట నిజమేననీ, అయితే నరకాసురిడి విషయంలో ఓపిక పట్టడానికి ఒక కారణం ఉందని కృష్ణుడు చెబుతాడు. ఆ ఒక్క కారణం వల్లనే అతను ఇంతకాలం బ్రతికి ఉన్నాడని అంటాడు. తన సహనాన్ని చేతగానితనంగా ఆయన భావించిన కారణంగా, ఆయన ఆగడాలు మితిమీరుతున్న కారణంగా ఇక రంగంలోకి దిగవలసి వచ్చిందని చెబుతాడు. ఎవరు రంగంలోకి దిగినా తనని చేసేదేమీ లేదని వరబలగర్వంతో నరకాసురుడు వికటాట్టహాసం చేస్తాడు.
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.