బలరాముడి దగ్గరికి చేరుకున్న కృష్ణుడు .. జరిగిన పెళ్లి విషయాన్ని గురించి ప్రస్తావిస్తాడు. సుభద్రకు ఊహ తెలిసిన దగ్గర నుంచి అర్జునుడే తన భర్త అని ఊహించుకుంటూ పెరిగింది. అర్జునుడినే తలచుకుంటూ రోజులు గడుపుతోంది. ఆమె కలల్లో .. ఊహల్లో అర్జునుడే ఉన్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె మనసంతా అర్జునుడే నిండి ఉన్నాడు. అలాంటప్పుడు ఆమెను దుర్యోధనుడికి ఇచ్చి వివాహం చేయడం ఎంతవరకూ సమంజసం? అని కృష్ణుడు అడుగుతాడు.

దుర్యోధనుడికి అహంభావం ఎక్కువ .. తన పేరు ప్రతిష్ఠల గురించిన విషయాలు తప్ప ఆయన వేరెవరి గౌరవ మర్యాదలను గురించి ఆలోచన చేయడు. విలాసాలకు ఇచ్చిన విలువ .. వ్యక్తులకు ఇవ్వడు. తనకి తప్ప మరెవరికీ ఆత్మాభిమానం అవసరం లేదనుకోవడం ఆయన నైజం. ప్రేమానురాగాలకంటే రాజసాలకు ఆయన ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుని సుభద్ర ఎలా సుఖపడుతుంది? తనని ద్వేషించే దుర్యోధనుడివలన సుభద్ర ఎలా ప్రశాంతంగా ఉంటుంది? అని అడుగుతాడు.

ఇక సుభద్ర మనసులో అర్జునిడికి ఏ స్థానం ఉందో .. ఆయన హృదయంలో సుభద్రకు కూడా అంతే స్థానం ఉంది. అర్జునుడు ఎంతటి వీరుడో అంతటి వినయం కలిగినవాడు. తాను ఇబ్బందిపడిన ఫరవాలేదు .. ఇతరులను కష్టపెట్టకూడదనే స్వభావం కలిగినవాడు. తనపట్ల అర్జునుడికి ఎంతటి అనురాగం ఉందో .. బలరాముడు పట్ల కూడా అంతే ఆత్మీయత ఉంది. తనముందు తనవారిని దూషించని భర్త సన్నిధిలో ప్రతి ఇల్లాలు ఆనందంగానే ఉంటుంది. అందువల్లనే వాళ్లిద్దరి వివాహాన్ని జరిపించవలసి వచ్చిందని కృష్ణుడు చెబుతాడు.

కృష్ణుడు చెప్పిన మాటల్లో నిజం ఉందనిపించడంతో బలరాముడు శాంతిస్తాడు. దాంతో అక్కడి వాళ్లంతా తేలికగా ఊపిరిపీల్చుకుంటారు. సుభద్ర మనసుకి కష్టం కలగకుండా, ఆమెకి పుట్టింటివారి తరపు నుంచి అందవలసిన లాంఛనాలు అందేలా చూడమని చెబుతాడు. ఆ మాటకు సంతోషించిన కృష్ణుడు అందుకు సంబంధించిన పనుల్లో నిమగ్నమవుతాడు. అలా అర్జునుడు – సుభద్రల వివాహం జరుగుతుంది. అత్తవారింట్లో సుభద్రకు ఆత్మీయ స్వాగతం లభిస్తుంది. అలాంటి కుటుంబానికి కోడలిగా వచ్చినందుకు సుభద్ర సంతోషంతో పొంగిపోతుంది.

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.