ఒక రోజున కృష్ణుడు గ్రహణ స్నానం చేయడానికి తన పరివారముతో కలిసి “శ్యమంత పంచకము” అనే క్షేత్రానికి చేరుకుంటాడు. ఆయన అక్కడికి వచ్చాడని తెలిసి యశోద నందులు అక్కడికి చేరుకుంటారు. యశోదను చూడగానే కృష్ణుడు ఆమె పాదాలకు నమస్కరిస్తాడు. ఆమె అతణ్ణి ఎంతో ఆప్యాయంగా అక్కున చేర్చుకుని ముద్దాడుతుంది. ప్రేమతో ఆయన శరీరాన్ని నిమురుతుంది. తనని చూడకుండా ఎలా ఉన్నావు కృష్ణా అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. తన గురించిన ఆలోచనలతో ఆమె మనసు ఎంతగా బరువెక్కిందనే విషయం ఆయనకి అర్థమైపోతుంది.

తల్లిని మరిచిపోవడం ఏ తనయుడికి సాధ్యం కాదని కృష్ణుడు అంటాడు. తన మనసులో ఆమె రూపం అలాగే ఉందని చెబుతాడు. పసితనంలో ఆమె కొంగు పట్టుకుని చేసిన అల్లరి పనులన్నీ తన మనసులో అందమైన జ్ఞాపకాలుగా అలాగే మిగిలిపోయాయని అంటాడు. తనని ఆమె సున్నితంగా మందలించడం .. ఆ మాత్రం దానికే ఆ తరువాత కన్నీళ్లు పెట్టుకోవడం తాను ఇంకా మరిచిపోలేదని చెబుతాడు. తనకి దిష్టి తగులుతుందేమోనని ప్రతిరోజూ ఆమె చేసిన హడావిడి తనకళ్ల ముందు కదలాడుతూనే ఉందని అంటాడు.

అసురుల కారణంగా తనకి ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ఆమె ఆందోళన చెందడం, తనని ఒంటరిగా వదలకుండా వెంటే ఉండటం తాను మరిచిపోలేదని చెబుతాడు. తనకి ఇష్టమైన వంటకాలు చేయడానికి ఆమె పడిన తాపత్రయం .. తనకి చద్దిమూట కట్టి గోవులను మేపడానికి పంపించిన క్షణాలు .. తన కోసం ఆమె వీధి గుమ్మం దగ్గరే ఎదురుచూస్తూ నిలబడటం .. తనకి ఎదురొచ్చి ఆప్యాయంగా అక్కున చేర్చుకోవడం అన్నీ కూడా తన మనోఫలకంపై మెదులుతూనే ఉంటాయని అంటాడు. బృందావన వాసులు కృష్ణుడినే కాదు .. యశోదాదేవిని కూడా ఎప్పటికీ మరిచిపోలేరని చెబుతాడు.

అదే సమయంలో దేవకీ వసుదేవులు అక్కడికి వస్తారు. కృష్ణుడిని తాము కన్నామనే మాటేగానీ, కంసుడి బారి నుంచి అతణ్ణి కాపాడుతూ కంటికి రెప్పలా పెంచినది యశోదనే అంటూ దేవకీ ఆమెను ఆత్మీయంగా అక్కున చేర్చుకుంటుంది. కృష్ణుడిపై తమకంటే ఎక్కువగా ఆమెకే ప్రేమ ఉంటుందనీ, అలాగే తమపై కంటే కృష్ణుడికి ఆమెపై ఎక్కువగా ప్రేమ ఉందని అంటారు. బాల్యం నుంచి కృష్ణుడు చేసిన అనేక వీరోచిత్ర కార్యాలు తాము చూడలేకపోయామనీ, ఆ భాగ్యం ఆమెకు మాత్రమే లభించిందని చెబుతారు. కృష్ణుడు ఆమెను తలచుకోని క్షణం లేదని అంటారు.

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.