తండ్రి విషయంలో .. పిన్ని విషయంలో ధృవుడికి నిజం చెబితే ఆ పసిమనసు పాడైపోతుందని భావించిన సునీతి, ఆయన పిన్ని చెప్పిన మాట నిజమేనని అంటుంది. తండ్రి తొడపై కూర్చునే ముచ్చట తీరాలంటే శ్రీమహావిష్ణువు కోసం తపస్సు చేయాలనీ, అయన అనుగ్రహాన్ని సంపాదిస్తే సాధ్యం కానిదంటూ లేదని అంటుంది. ఎంతోమంది మహర్షులు .. మహాభక్తులు శ్రీమహావిష్ణువు అనుగ్రహం కోసం తపస్సు చేస్తూ ఉంటారనీ, ఆయన అనుగ్రహంతో అనుకున్నవి సాధిస్తూ ఉంటారని చెబుతుంది. అందువలన ఆ శ్రీమన్నారాయణుడి కోసం తపస్సు చేయమని అంటుంది.
శ్రీహరి కోసం తపస్సు చేయాలంటే మనసును ఆయన పాదాల చెంత ఉంచాలనీ, ఆయన గురించిన స్మరణ చేయాలని సునీతి చెబుతుంది. అందుకోసం ప్రశాంతమైన ప్రదేశాన్ని ఎంచుకోవాలని అంటుంది. శ్రీహరిని మెప్పిస్తే అడిగినది తప్పకుండా ఇస్తాడని చెబుతుంది. ఐదేళ్ల వయసులో ఉన్న ధృవుడి మనసులో ఆ మాటలు నాటుకుపోతాయి. దాంతో ఆయన ఆ స్వామి కోసం తపస్సు చేయాలని అనుకుంటాడు. ఆ క్షణమే ఊరు వదలి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటాడు. స్వామిని చూసిన తరువాతనే తిరిగి వస్తానని తల్లితో చెప్పేసి బయల్దేరతాడు.
పరమాత్ముడు ఎవరు? ఆయన రూపం ఎలా ఉటుంది? ఎలా సాధన చేస్తే ఆ స్వామి కరుణిస్తాడు? ఇలా ఇవేవీ తెలియకుండా అమాయకంగా నడచుకుంటూ వెళుతున్న ధృవుడిని చూస్తూ సునీతి కన్నీళ్ల పర్యంతమవుతుంది. తన కుమారుడి సంకల్పం బలమైనదే అయితే, ఆయన భక్తి దృఢమైనదే అయితే అనుక్షణం అండగా ఉంటూ అనుగ్రహించమని ఆ శ్రీమన్నారాయణుడిని సునీతి మనసులోనే కోరుకుంటుంది. ఆ స్వామి ఉన్నాడనే ఒకే ఒక్క ధైర్యంతోనే తన కొడుకును పంపిస్తున్నానని చెప్పుకుంటుంది.
ఎక్కడికి వెళ్లాలో .. ఏం చేయాలో తెలియకపోయినా ధృవుడు వడివడిగా నడిచివెళుతుంటాడు. ఊరు దాటేసి నిర్జన ప్రదేశంలో ఆయన నడక సాగుతూ ఉంటుంది. అలా ఆయన దట్టమైన అడవిలోకి ప్రవేశిస్తాడు. అనేక క్రూరమృగాలకు ఆలవాలమైన ఆ అడవిలో ఆయన ఎలాంటి భయం లేకుండా .. మరో ఆలోచన లేకుండగా .. వెనుదిరిగి చూడకుండా నడుస్తూ ఉంటాడు. ఒక ఐదేళ్ల కుర్రాడికి తపస్సు చేయమని తల్లి చెప్పడం .. తపస్సు ఎలా చేయాలో తెలియని ఆ కుర్రాడు ఆవేశంగా బయల్దేరడం చూసిన నారదుడు ముచ్చటపడతాడు.
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.