ధృవుడి రాక ఉత్తానపాదుడికి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ఆ రోజు నుంచి ఆయన ఉత్తముడితో సమానంగా ధృవుడిని చూసుకుంటూ ఉంటాడు. శ్రీహరి దర్శన భాగ్యం వల్లనే సమస్త శాస్త్రాలలోని సారాన్ని గ్రహించిన ధృవుడు, యుద్ధ విద్యలను కూడా అభ్యసిస్తాడు. తండ్రితో పాటే ఉంటూ పరిపాలనా సంబంధమైన విషయాలను ఆకళింపు చేసుకుంటాడు. ధృవుడు యుక్తవయసులోకి అడుగుపెట్టగానే, ఆయనకి “భ్రమి” అనే యువతితో వివాహం జరుగుతుంది. వాళ్ల దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగుతూ ఉంటుంది.
ధృవుడు అన్ని విధాలా సమర్ధుడిగా తయారయ్యాడని గ్రహించిన ఉత్తానపాదుడు, ఇక తాను వనాలకు వెళ్లి తపస్సు చేసుకోవడం మంచిదని భావిస్తాడు. రాజ్యాలు .. సుఖాలు .. వైభవాలపై తనకి మక్కువ తగ్గిపోయిందనే విషయాన్ని ధృవుడితో చెబుతాడు. అతనికి పట్టాభిషేకం జరిపించి తాను వనాలకి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నానని అంటాడు. తండ్రి ముచ్చట తీర్చడం కోసం పట్టాభిషేక మహోత్సవానికి ధృవుడు అంగీకరిస్తాడు. అంగరంగ వైభవంగా ఆయన పట్టాభిషేకం జరుగుతుంది. ఆ తరువాత ఉత్తానపాదుడు వనాలకు వెళ్లిపోతాడు.
భ్రమి వలన ధృవుడికి కల్పుడు – వత్సరుడు అనే కుమారులు కలుగుతారు. ఆ తరువాత “ఇల” అనే మరో యువతితోను ధృవుడికి వివాహం జరుగుతుంది. మహావీరుడైన ధృవుడి గురించి తెలిసిన ఇతర రాజులెవరూ ఆ నగరం వైపు కన్నెత్తి చూడరు. సాధ్యమైనంత వరకూ ధృవుడితో స్నేహంగా మసలుకోవడానికే అంతా ప్రయత్నిస్తుంటారు. ఆయన పాలనలో ప్రజలంతా కూడా ఎంతో ఆనందంగా .. హాయిగా జీవిస్తూ ఉంటారు. ధర్మబద్ధమైన ఆయన పాలనలో పాడిపంటలు వృద్ధి చెందుతాయి. ప్రజలంతా కూడా ఆయన చల్లగా ఉండాలనే కోరుకుంటూ ఉంటారు.
కాలం గడిచిపోతుంటుంది .. ధృవుడి పిన్ని సురుచి ఓ ప్రమాదం కారణంగా మరణిస్తుంది. ఆమె మరణం పట్ల ధృవుడు ఆవేదన చెందుతాడు. అప్పటి నుంచి ఆయన తన సోదరుడైన ఉత్తముడిని మరింత ప్రేమాభిమానాలతో చూసుకుంటూ ఉంటాడు. అయితే హిమాలయ పర్వత ప్రాంతంలో ఒక యక్షుడితో జరిగిన యుద్ధంలో ఉత్తముడు మరణిస్తాడు. అతని మరణం ధృవుడికి చాలా బాధకలిగిస్తుంది. తన సోదరుడి మరణానికి కారకులైన యక్షులపై ఆయనకి ఆగ్రహం కలుగుతుంది.
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.