కచుడిని గురించి దేవయాని ఆందోళన చెందుతూ ఉండటంతో, శుక్రాచార్యుడు దివ్య దృష్టితో చూస్తాడు. సురపానం ద్వారా కచుడు తన కడుపులోకి వెళ్లిన విషయం ఆయనకి తెలుస్తుంది. దాంతో ఆయన ఆ విషయాన్ని దేవయానికి చెబుతాడు. ఎలాగైనా కచుడిని బ్రతికించమని ఆమె శుక్రాచార్యుడిని కోరుతుంది. కచుడిని బ్రతికించాలంటే తను ప్రాణాలను వదలవలసి వస్తుందని శుక్రాచార్యుడు చెబుతాడు. అలా జరగకుండా ఉండాలంటే కచుడికి “మృతసంజీవిని” మంత్రాన్ని ఉపదేశించవలసి వస్తుందని అంటాడు. ఆ విధంగా చేయడం వలన ఇప్పటివరకూ తనవరకే పరిమితమైన మంత్రం బయటికి వెళ్లిపోతుందని చెబుతాడు.
తనకి ఆ విషయాలు ఏమీ చెప్పవద్దనీ, కచుడిని బ్రతికించమని దేవయాని కన్నీళ్ల పర్యంతమవుతుంది. కచుడు లేకపోతే తాను బ్రతకలేనని చెబుతుంది. మృత సంజీవిని మంత్రం బయటికి వెళుతుందనే విషయాన్ని గురించిన ఆలోచన చేయకుండా, ఆయన కడుపులో ఉన్న కచుడికి ఆ మంత్రాన్ని ఉపదేశించమని అంటుంది. కచుడు బయటికి వచ్చిన తరువాత ఆ మంత్రంతో ఆయనని బ్రతికిస్తాడని చెబుతుంది. ఎంతో తపోబలంతో సంపాదించుకున్న మృతసంజీవిని మంత్రాన్ని కచుడికి ఉపదేశించాలా? వద్దా? అనే విషయంలో శుక్రాచార్యుడు సతమతమైపోతాడు. సురపానం సేవించినందుకు తనని తానే నిందించుకుంటాడు.
కచుడిపై దేవయాని అమితమైన ప్రేమనురాగాలను పెంచుకుంది. అలాంటి కచుడు లేకపోతే తాను బ్రతకనని చెబుతోంది. కచుడు కొంతసేపు కనిపించకపోతేనే తల్లడిల్లిపోతున్న దేవయాని, అతను శాశ్వతంగా లేకపోతే ఆమె అన్నంత పనిచేస్తుంది. అందువలన తాను కచుడికి మృతసంజీవిని మంత్రాన్ని ఉపదేశించక తప్పదు. కూతురు కోసం .. ఆమె ఆనందం కోసం తాను ఈ పని చేయవలసిందే అని నిర్ణయించుకుంటాడు. ఇక ఆలస్యం చేయకుండా తన కడుపులో భస్మ రూపంలో ఉన్న కచుడిని బ్రతికిస్తాడు. ఆ తరువాత అతనికి మృతసంజీవిని మంత్రాన్ని ఉపదేశిస్తాడు.
శుక్రాచార్యుడు మృతసంజీవిని మంత్రం ఉపదేశించగానే, కచుడు ఆయన గర్భాన్ని చీల్చుకుని బయటికి వస్తాడు. దాంతో శుక్రాచార్యుడు ప్రాణాలను వదులుతాడు. ఆ వెంటనే కచుడు మృతసంజీవిని మంత్రాన్ని పఠించి శుక్రాచార్యుడిని బ్రతికిస్తాడు. తాను మనసు పడినవాడు .. తన తండ్రి ఇద్దరూ సజీవులు కావడం దేవయానికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. తన కోసం ఎంతో త్యాగం చేసిన తండ్రికి కృతజ్ఞతలు తెలియజేస్తుంది. కచుడు కూడా ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తాడు. రాక్షస శిష్యులకి మాత్రం, ఇంత చేసినా తమ పేరును కచుడు బయటికి చెప్పకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.