వృషపర్వుడి కూతురు శర్మిష్ఠ ధోరణి .. తన కూతురు దేవయాని విషయంలో ఆమె ప్రవర్తించిన తీరు .. ఆ సమయంలో ఆమె తనని అవమానపరుస్తూ మాట్లాడిన విధానం గురించి తెలుసుకున్న శుక్రాచార్యుడు కోపంతో రగిలిపోతాడు. వృషపర్వుడి దగ్గర తాను పనిచేస్తున్నందు వల్లనే తన స్థానం తక్కువ చేయబడింది. తన స్థానం తక్కువ కావడం వల్లనే తన కూతురిని శర్మిష్ఠ అవమానపరచడానికి సాహసించింది. తన కూతురును బావిలోకి తోసేసి ఎలాంటి భయం లేకుండా తిరిగి వచ్చేసింది. విలువలేని చోటుకు వెళ్లకూడదని పెద్దలు అంటారు .. కానీ అలాంటి చోటున తాను పనిచేస్తున్నాడు.
శుక్రాచార్యుడు కూర్చున్న చోటు నుంచి దిగ్గున లేస్తాడు. ఇక ఆ రాజ్యంతో తమకి పనిలేదు .. అక్కడ ఉండవలసిన అవసరం కూడా తమకి లేదు అని దేవయానితో అంటాడు. ఆ మాటకి దేవయాని ఒక్కసారిగా బిత్తరపోతుంది. గౌరవ మర్యాదలు దక్కే చోటుకు ఆలస్యంగా వెళ్లినా ఫరవాలేదు. కానీ అవి లేని చోటు నుంచి తక్షణమే వెళ్లిపోవాలి అంటూ ఆయన తన మందిరంలో నుంచి బయటికి నడుస్తాడు. దేవయాని కూడా మౌనంగా తండ్రిని అనుసరిస్తుంది. అలా వాళ్లిద్దరూ రాజుకి సంబంధించిన ముఖ్యమైన పరివారం నివసించే ప్రదేశం నుంచి బయటికి వచ్చేస్తారు.
శుక్రాచార్యులవారు రాజ్యాన్ని విడిచి వెళ్లిపోతున్నారనే విషయం వృషపర్వుడికి తెలుస్తుంది. శుక్రాచార్యులవారు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు? తనతో మాట మాత్రమైనా చెప్పకుండా ఆయన వెళుతున్నాడంటే ఆయనకి కోపం వచ్చి ఉంటుంది. అందుకు కారణం ఏమై ఉంటుంది? అని ఆలోచన చేస్తూ వెంటనే బయల్దేరి వెళతాడు. అప్పటికే శుక్రాచార్యుడు – దేవయాని చాలా దూరం వెళ్లిపోతారు. వాళ్లని చేరుకున్న వృషపర్వుడు .. శుక్రాచార్యుడికి వినయంతో నమస్కరిస్తాడు. రాజ్యం విడిచి వెళ్లడానికి కారణం ఏమిటనీ .. తమ వలన జరిగిన అపరాథమేదైనా ఉంటే చెప్పమని అడుగుతాడు.
దాంతో శుక్రాచార్యుడు .. శర్మిష్ఠ వైఖరిని గురించి ప్రస్తావిస్తాడు. ప్రతి ఆడపిల్ల తండ్రి మహారాజు కాకపోవచ్చును .. కానీ తన కూతురుకు అంతఃపుర జీవితం లభించాలనే కోరుకుంటాడు. అందచందాల విషయంలో .. తన కూతురు శర్మిష్ఠకు ఎంతమాత్రం తీసిపోదు. అయినా శర్మిష్ఠ అలా మాట్లాడటానికి కారణం ఆమె రాకుమార్తె కావడం .. ఆమె సేవకోసం చుట్టూ దాసీలు వేచి ఉండటం. అందువలన తన కూతురికి శర్మిష్ఠను దాసీగా నియమిస్తానంటేనే, తాము తిరిగి వెనక్కు వస్తామని తేల్చి చెబుతాడు. శుక్రాచార్యుడు తమ రాజ్యానికి ఎంతటి అవసరమో తెలిసిన ఆ రాజు, అందుకు అంగీకరిస్తాడు.
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.