హనుమంతుడు ఆవిర్భవించిన ప్రాచీన క్షేత్రాలలో “కర్మన్ ఘాట్” ఒకటిగా కనిపిస్తుంది. హైదరాబాద్ .. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం పరిధిలో ఈ క్షేత్రం దర్శనమిస్తుంది. దిల్ సుఖ్ నగర్ .. ఎల్బీనగర్ .. సాగర్ రోడ్ కి సమీపంలో ఈ క్షేత్రం వెలుగొందుతోంది. సువిశాలమైన ప్రదేశంలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. గర్భాలయంలో స్వామివారు ధ్యానముద్రలో దర్శనమిస్తాడు. స్వామివారి మూర్తి 11వ శతాబ్దంలో వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి ధూప దీప నైవేద్యాలు కొనసాగుతూనే ఉన్నాయి.
క్రీ.శ. 1143లో కాకతీయ ప్రభువైన రెండవ ప్రతాప రుద్రుడు తన సైన్యంతో కలిసి ఈ ప్రదేశం మీదుగా వెళుతూ .. ఇక్కడ ఒక చెట్టు క్రింద విశ్రాంతి తీసుకున్నారు. అప్పుడు ఆయనకి పెద్దపులి గాండ్రింపు వినిపించాయి. ఆ గాండ్రింపు వినిపిస్తున్న దిశగా అడుగులు వేస్తూ ఆయన ఒక పొద దగ్గరికి చేరుకున్నారు. అక్కడికి వెళ్లగానే ఆ పొదలో నుంచి రామనామం వినిపించసాగింది. దాంతో ఆయన ఆ పొదలను తొలగించి చూడగా, అక్కడ ధ్యానముద్రలో ఉన్న హనుమ శిలారూపం దర్శనమిస్తుంది. దాంతో ఒక్కసారిగా ఆయన ఆనందాశ్చర్యాలకి లోనయ్యారు.
ధ్యానముద్రలో ఉన్న హనుమ మూర్తిని గురించిన ఆలోచన చేస్తూనే ఆయన తన ఇంటికి చేరుకున్నారు. అప్పుడు హనుమంతుడు ఆయనకి కలలో కనిపించి, తన మూర్తి బయటపడిన ప్రదేశంలో ఆలయాన్ని నిర్మించి .. ధూప దీప నైవేద్యాలు జరిగేలా చూడమని ఆదేశించాడట. దాంతో రెండవ ప్రతాప రుద్రుడు స్వామివారికి ఆలయాన్ని నిర్మించి నిత్యపూజల నిర్వహణకు శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి స్వామివారు పూజాభిషేకాలు అందుకుంటూ భక్తుల పాలిట కొంగు బంగారమై నిలిచారు.
17వ శతాబ్దంలో ఔరంగేజేబు హిందూ దేవాలయాలను ధ్వంసం చేయడమే పనిగా పెట్టుకున్నాడు. ఆ సమయంలో స్వామివారి ఆలయాన్ని ధ్వంసం చేయడానికి ఔరంగజేబు సైన్యం అక్కడికి చేరుకుంది. అయితే ఎంతగా ప్రయత్నించినా వాళ్లు ఆలయం దగ్గరికి వెళ్లలేకపోయారు. ఆలయంలో గంటలు అదేపనిగా మ్రోగడం .. అడుగుముందుకు వేయనీయకుండా సుడిగాలి వాళ్లను ఉకిక్కిరిబిక్కిరి చేయడం మొదలుపెట్టిందట. దాంతో సైనికులంతా ఆలయానికి దూరంగా కూర్చుండిపోయారు. ఏదో శక్తి తన సైన్యాన్ని అడ్డుకుంటుందనే సమాచారం ఔరంగజేబుకు అందుతుంది.
దాంతో ఆయనే స్వయంగా ఆలయానికి చేరుకున్నాడు. తన సైన్యాన్ని వెంటబెట్టుకుని ఆలయం దిశగా కదిలాడు. అప్పుడు “మందిర్ తోడ్నా హై రాజా .. పహేలే తుమ్ కరో మన్ ఘాట్” అంటూ ఆయనకి అశరీరవాణి వినిపించింది. “ఈ మందిరాన్ని కూల్చాలనే నిర్ణయానికే నువ్వు కట్టుబడి ఉంటే .. ఆ తరువాత జరగబోయే పరిణామాలకు నువ్వు సిద్ధంగా ఉండు” అని హెచ్చరించడమే ఆ మాటకి అర్థం. దాంతో ఔరంగజేబు తన సేనలతో వెనుదిరిగిపోయాడని స్థలపురాణం చెబుతోంది.
అంతటి మహిమాన్వితమైన ఈ ఆలయంలో కోదండరామస్వామితో పాటు అనేక ఉపాలయాలు కనిపిస్తాయి. ముందుగా స్వామివారిని దర్శించుకున్న భక్తులు ఆ తరువాత ప్రదక్షిణ పూర్వకంగా ఉపాలయాలను దర్శించుకుంటారు. హనుమజ్జయంతి సందర్భంగా జరిగే ఉత్సవాలు .. శ్రీరామనవమి రోజున జరిగే సీతారాముల కల్యాణోత్సవం చూడటానికి రెండు కళ్లు సరిపోవు. మహిమాన్వితమైన ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం వలన, సమస్త భయాలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయనేది భక్తుల విశ్వాసం.
గమనిక: ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత .. ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే. పూర్తి సమాచారం కాదు.