Karthika Puranam – 6: Dipadanam in Kartikam – widow gets access to heaven
కార్తీక వ్రత మహాత్మ్యం గురించి జనక మహారాజుకి చెప్పిన వశిష్ఠ మహర్షి, దీపదానం వలన కలిగే విశేషామైన ఫలితాలను గురించి కూడా ప్రస్తావిస్తాడు. ఉదాహరణగా ఒక కథను చెప్పడం మొదలుపెడతాడు. రాజా … ద్రావిడ దేశంలో అనాథ అయిన ఒక వితంతువు ఉండేది. వెనకా ముందు ఎవరూ లేని ఆమె, ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చేసుకుంటూ ఉండేది. ఎవరు ఏది ఇచ్చిన వాటిని అమ్మేసి డబ్బుగా మార్చుకుంటూ ఉండేది. తాను కష్టపడి సంపాదించిన సొమ్మును, ఇతరులను యాచించగా వచ్చిన డబ్బును ఆమె చాలా జాగ్రత్త చేసేది.
ఉన్నది తాను ఒక్కతే .. అయినా ఆమె రుచికరమైనవి వండుకోవడం చేసేది కాదు. డబ్బు ఖర్చు అవుతుందని చెప్పేసి, సాధ్యమైనంత వరకూ ఇతర కుటుంబాలపై ఆధారపడుతూ రోజులు గడుపుతూ ఉండేది. ఎంతసేపు డబ్బు ధ్యాసలో ఉండటం వలన ఆమె ఎప్పుడూ కూడా భగవంతుడి నామస్మరణ చేసేది కాదు. ఎక్కడ కాసేపు కూర్చుని పురాణ కథలు వినేది కాదు. అందువలన భక్తి .. భగవంతుడు అనేవి ఆమెకి పరిచయం లేనివిగా అయిపోయాయి.
ఆ వితంతువు ధోరణిని ఒక బ్రాహ్మణుడు గమనిస్తాడు. పూర్వజన్మలో చేసిన పాపాల కారణంగానే ఆమె ఈ రోజున నా అనేవారు లేక అనేక కష్టాలు అనుభవిస్తోంది. ఇప్పుడు కూడా ఆమె ఇలా భగవంతుడికి దూరంగా బ్రతకడం వలన, వచ్చే జన్మలోను మళ్లీ ఇలాంటి కష్టాలనే పడుతూ ఉండవలసి వస్తుంది. అందువలన ఆమెను సరైన దారిలో పెట్టాలని నిర్ణయించుకుంటాడు. ఒక రోజున ఆమెను పిలిచి ఆమెతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నానని అంటాడు. అయిష్టంగా .. అయోమయంగా ఆమె ఆయనకి కాస్త దూరంలో కూర్చుంటుంది.
జీవితం నీటి బుడగ లాంటిది .. ఎప్పుడు ఇది చిట్లిపోతుందో ఎవరికీ తెలియదు. ఈ లోగా సంపదలు శాశ్వతం … ఆ సంపదే కాపాడుతుందని అనుకోవడం అమాయకత్వం. అందుకోసం డబ్బు గురించిన ఆలోచన చేస్తూ, ఎంతో విలువైన మానవ జీవితాన్ని వృథా చేసుకుంటున్నావు. మానవ జన్మ అంత తేలికగా దొరికేది కాదు .. ఎంతో పుణ్యం చేసుకుంటేనే తప్ప మళ్లీ లభించదు. ఆ పుణ్యం చేసుకునే అవకాశం కూడా మానవులకు మాత్రమే ఉంది. అందువలన తాత్కాలికమైన సంపదలను గురించి కాకుండా, శాశ్వతమైన భగవంతుడి అనుగ్రహం కోసం ప్రయత్నించమని చెబుతాడు.
బ్రాహ్మణుడు చెప్పిన మాటలు ఆ వితంతువు మనసుపై ప్రభావం చూపుతాయి. ఇంతవరకూ ఎప్పుడూ కూడా భగవంతుడి గురించిన ఆలోచన చేయలేదు. భగవంతుడిని గురించిన నాలుగు మంచి మాటలు వినలేదు. ఆయన ముందు నిలబడి నమస్కరించలేదు. జీవితంలో యాచించడం కోసం వెళ్లి ఒక్కో ఇంటిముందు ఎంతో సేపు నిలబడ్డాను .. ఎవరో ఒకరు ఇంట్లో నుంచి వచ్చి .. ఏదో ఒకటి ఇచ్చేవరకూ పిలిచాను. అలా ఇచ్చేవరకూ ఆ వాకిట్లో నుంచి కదిలేదానిని కాదు.
కానీ అన్నీ ఇచ్చే ఆ భగవంతుడిని వదిలేసి .. అందరి ఇళ్లకూ తిరిగాను. నిజంగా ఇది ఎంత అమాయకత్వం. యాచన కోసం ఒక్కో ఇంటిముందు నిలబడే సమయం .. నేను గుడిలో భగవంతుడి సన్నిధిలో నిలబడితే ఎంత బాగుండేది. నా పరిస్థితి తలచుకుని బాధపడుతూ అందరి ఇళ్లకూ తిరిగే బదులూ, ఆ భగవంతుడికి నా కష్టాలు చెప్పుకుని ఉండవలసింది కదా. వెలుగు వైపు వెళ్లకుండా చీకట్లోనే తిరిగేవాళ్లను మూర్ఖులనే కదా అంటారు. అలాంటి మూర్ఖపు పనులే కదా తాను చేసింది అనుకుంటుంది.
ప్రతిరోజూ ఎంతోమంది తనని చీదరించుకున్నారు .. కానీ తనని ఆశ్రయించినవారిని భగవంతుడు ఎప్పుడూ అసహ్యించుకోడు కదా. తనని అడిగారు కదా అని ఆయన ఎవరినీ ఎప్పుడూ కూడా చులకనగా చూడడు కదా. భగవంతుడు దయామయుడు .. పుణ్యకార్యాల ద్వారానే ఆయన మనసు గెలుచుకోవాలి. రేపటి కోసం అన్నట్టుగా ఇప్పటివరకూ ఎలా డబ్బు దాచుకుంటూ వచ్చానో .. వచ్చే జన్మ కోసం అన్నట్టుగా పుణ్యాన్ని సంపాదించుకోవాలి. అందుకు ఆ బ్రాహ్మణుడు చెప్పినట్టుగా కార్తీక వ్రతాన్ని ఆచరించాలి అనుకుంటుంది.
కార్తీక మాసంలో ఆమె కార్తీకవ్రతాన్ని ఆచరించడానికి అన్నిరకాల ఏర్పాట్లు చేసుకుంటుంది. సూర్యోదయానికి ముందు నదీ స్నానం చేసి .. దేవతార్చన చేసి .. శివకేశవులను ఆరాధించసాగింది. తన శక్తికొలది దానం చేయడం మొదలుపెట్టింది. దేవాలయాలలో దీపాలు వెలిగించడమే కాకుండా .. బ్రాహ్మణులకు దీపదానాలు ఇచ్చింది. పురాణ శ్రవణం చేయసాగింది. అలా చేయడం వలన ఆమె పాపాలు నశించి, శివలోకానికి చేరుకుంది. దీపదాన ఫలితాన్ని గురించి తెలుసుకున్న జనకమహారాజు, వశిష్ట మహర్షికి భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తాడు.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
గమనిక : కార్తీకమాసంలో ఆచరించవలసిన నియమనిష్టలను .. అనుసరించవలసిన పద్ధతులను గురించి ప్రస్తావిస్తూ, ఈ మాసం యొక్క విశిష్టతను కథల రూపంలో “కార్తీక పురాణం” చెబుతుంది. ఆ కథలను సరళమైన భాషలో .. మరింత ఆసక్తికరంగా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. సేకరించిన కథలలోని సారాంశాన్ని అందరికి అర్ధమయ్యే భాషలో చెప్పడమే ఇక్కడి ముఖ్య ఉద్దేశము. ఇది ఏ రకంగానూ ప్రామాణికం కాదని మనవి చేస్తున్నాము.
Karthika Puranam – 6: Dipadanam in Kartikam – widow gets access to heaven