కార్తీకమాసంలో శివకేశవుల ఆరాధన విశేషమైన ఫలితాలను ఇస్తుందని జనకమహారాజుతో వశిష్ఠ మహర్షి చెబుతాడు. ఈ మాసంలో శ్రీమహావిష్ణువును కమలాలతో .. జాజిపూలతో పూజించాలి. కదంబ పుష్పాలు .. అవిసె పూవులతో పూజించడం వలన కూడా విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయి. తులసీదళాలను .. మారేడు దళాలను అత్యంత భక్తి శ్రద్ధలతో సమర్పించడం వలన కూడా పుణ్యరాశి పెరుగుతుంది. శివుడికి జిల్లేడు పూలను సమర్పించడం వలన ఆయన మరింత ప్రీతి చెందుతాడు.

కార్తీక మాసాల్లో చేసే వనభోజనాల వలన అనేక పాపాలు నశిస్తాయి. ఉసిరిచెట్టు ఉన్న వనాల్లో భోజనాలు చేయవలసి ఉంటుంది. “ఉసిరి చెట్టు” ఉన్న వనాల్లో బ్రాహ్మణుడితో కలిసి భోజనాలు చేయడం వలన సమస్త పాపాలు పటాపంచలవుతాయి. అనేక దోషాలు తొలగిపోతాయి. కార్తీక మాసంలో చాలామంది ఉపవాసాలు ఉంటూ ఉంటారు. అందువలన అలాంటివారికి వివిధ రకాల పండ్లను దానం చేయడం వలన కలిగే పుణ్యం మాటల్లో చెప్పలేనిది. అందువలన ఈ మాసంలో ఎవరి శక్తి కొద్దీ వారు పండ్లను దానం చేయడం మంచిది.

ఇలా కార్తీకమాసం యొక్క విశిష్టతను గురించి వశిష్ఠ మహర్షి చెబుతూ ఉంటే, జనకమహారాజు ఒక సందేహాన్ని వ్యక్తం చేస్తాడు. ఓ మహర్షి .. మహాపాపాలను చేసినవారు వాటి నుంచి బయటపడట మనేది ఎంతో కష్టమైన విషయం. జన్మజన్మల పాటు ఆ పాపాలు వారిని వెంటాడుతూ ఉంటాయి. ఘోరమైన పాపాల నుంచి ఇలాంటి చిన్న చిన్న నోములు .. వ్రతాలు .. ఉపవాసాలు .. దీపదానాలు .. నదీ స్నానాలు ఎలా బయటపడేయగలవు? సముద్రంలో పడిపోయినవాడిని గడ్డిపరక ఎలా కాపాడగలదు? ఒక్క గునపంతో పర్వతాన్ని ఎలా కదిలించగలం? అని అడుగుతాడు.

అందుకు వశిష్ఠ మహర్షి స్పందిస్తూ .. రాజా ఎవరు చేసిన కర్మను బట్టి వారు ఫలితాన్ని పొందడం అనేది నిజమే. అయితే సత్యధర్మాలను ఆశ్రయించి చేసే పుణ్యకార్యాలు వలన విశేషమైన ఫలితం కలుగుతుంది. పుణ్యకాలాల్లో .. పుణ్యక్షేత్రాల్లో చేసే పూజల వలన అసాధారణమైన ఫలితాలు ఉంటాయి. అప్పటివరకూ వెంటాడుతున్న పాపాలు ధ్వంసమవుతాయి. చిన్న నిప్పుకణిక వేల కట్టెలను దహించడం లేదా? అలాగే ఎన్ని పాపాలు చేసినా వాటిని ఒక్క పెట్టున తుడిచిపెట్టడనికి భగవంతుడికి ప్రీతిని కలిగించే ఒక చిన్న పుణ్యవిశేషం చాలు. అందుకు ఉదాహరణగా నేను ఒక కథ చెబుతాను విను ..

గమనిక : కార్తీకమాసంలో ఆచరించవలసిన నియమనిష్టలను .. అనుసరించవలసిన పద్ధతులను గురించి ప్రస్తావిస్తూ, ఈ మాసం యొక్క విశిష్టతను కథల రూపంలో “కార్తీక పురాణం” చెబుతుంది. ఆ కథలను సరళమైన భాషలో .. మరింత ఆసక్తికరంగా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. సేకరించిన కథలలోని సారాంశాన్ని అందరికి అర్ధమయ్యే భాషలో చెప్పడమే ఇక్కడి ముఖ్య ఉద్దేశము. ఇది ఏ రకంగానూ ప్రామాణికం కాదని మనవి చేస్తున్నాము.