ఒక రోజున బ్రహ్మ మానస పుత్రులైన సనక సనందులు శ్రీమహావిష్ణువు దర్శనం కోసం వైకుంఠానికి వెళతారు. ప్రధాన ద్వారం దగ్గర కాపలాగా ఉన్న జయవిజయులు వాళ్లను అడ్డగిస్తారు. అది స్వామివారి ఏకాంత సమయం కావడం వలన లోపలికి అనుమతి లేదని చెబుతారు. తాము వచ్చామనే విషయాన్ని స్వామికి తెలియపరచమనీ, నిజానికి తమకి ఎవరి అనుమతులతో పనిలేదని సనక సనందులు అంటారు. స్వామితో తమకి గల అనుబంధం గురించి తెలియక అజ్ఞానంతో అలా మాట్లాడుతున్నారనీ, పక్కకి తప్పుకోమని చెబుతారు.
స్వామికి భక్తులు అయినా తమ అనుమతి లేనిదే లోపలికి అడుగుపెట్టలేరని జయవిజయులు చెబుతారు. తాము చెప్పేవరకూ ఎంతటివారైనా నిరీక్షించక తప్పదని అంటారు. సమయము కాని సమయంలో వచ్చి దర్శనాన్ని కోరడం సరైనది కాదంటూ హేళనగా మాట్లాడతారు. స్వామివారి దర్శనానికి జయవిజయులు అడ్డగించడం సనక సనందులకు ఆగ్రహాన్ని కలిగిస్తుంది. అహంభావంతో తమని అవమానపరిచిన కారణంగా భూలోకాన రాక్షసులుగా జన్మించమని సనక సనందులు శపిస్తారు. ఆ శాపానికి జయవిజయులు ఆందోళనకి లోనవుతారు.
శ్రీమహావిష్ణువు దగ్గరికి వెళ్లి సనక సనందులు తమకి శాపం విధించిన సంగతి చెబుతారు. తరుణోపాయం సెలవీయమని కోరతారు. మహర్షుల రాకకు అభ్యంతరం చెప్పడం .. వాళ్లు చెబుతున్న విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించక పోవడం .. లోక కళ్యాణం కోసం తపమాచరించే వారిని అవమాన పరచడం జయవిజయులు చేసిన తప్పేనని శ్రీహరి అంటాడు. అజ్ఞానంతో తాము తప్పే చేశామనీ .. శాపానికి విమోచనమేదో సెలవీయమని అక్కడే ఉన్న సనక సనందులను జయవిజయులు కోరతారు. శ్రీమన్నారాయణుడే విమోచనం చెప్పాలనే అభిప్రాయాన్ని వాళ్లు వ్యక్తం చేస్తారు.
తనకి హితులై ఏడు జన్మల తరువాతగానీ, తనకి విరోధులై మూడు జన్మల తరువాతగాని తిరిగి వైకుంఠానికి చేరుకోవచ్చని శ్రీమహావిష్ణువు చెబుతాడు. ఈ రెండింటిలో ఏది సమ్మతమే తెలియజేయమని అడుగుతాడు. జయవిజయులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. స్వామి సేవకు ఏడు జన్మలపాటు దూరంగా ఉండలేమని అంటారు. స్వామితో విరోధమనే మాట వినడమే మనసుకు కష్టంగా ఉందనీ, అయినా మూడు జన్మల తరువాత ఆయన పాదపద్మాల చెంతకి చేరుకోవాలనే అనుకుంటున్నామని చెబుతారు. అయితే మూడు జన్మలలో రాక్షసులుగా జన్మించి .. తనతో సంహరించబడటం వలన ముక్తిని పొంది, తన సన్నిధికి చేరుకుంటారని స్వామి సెలవిస్తాడు.
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.
ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి