Chilkur Balaji Temple

శ్రీవెంకటేశ్వరస్వామి పేరు వినగానే అందరికీ గుర్తుకు వచ్చే క్షేత్రం తిరుమల. ఇక్కడి ఏడుకొండలు .. స్వామివారి వైకుంఠానికి చెందినవి అని చెబుతుంటారు. తిరుమల క్షేత్రంలో అనేక తీర్థాలు కనిపిస్తాయి. ఒక్కో తీర్థానికి ఒక్కో విశేషం కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడి స్వామివారిని అనునిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. క్రమం తప్పకుండా ప్రతి యేటా స్వామివారిని దర్శించుకునే భక్తులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి మహా భక్తులలో గొన్నాల మాధవరెడ్డి ఒకరు. హైదరాబాద్ .. రంగారెడ్డి జిల్లా పరిధిలోని “చిలుకూరు బాలాజీ” టెంపుల్ తో ఆయన జీవితం ముడిపడి కనిపిస్తుంది.

మాధవరెడ్డికి చిన్నప్పటి నుంచి వెంకటేశ్వర స్వామి అంటే ఎంతో ఇష్టం. వయసుతో పాటు ఆయనకి స్వామిపై భక్తిశ్రద్ధలు పెరుగుతూ పోయాయి. ప్రతి ఏడాది ఆయన తప్పనిసరిగా తిరుమల వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకుని వచ్చేవారు. అయితే ఈ “చిలుకూరు” గ్రామం నుంచి ఆయన కాలి నడకన తిరుమలకి వెళ్లి వస్తుండేవారు. కనులారా స్వామిని దర్శించుకుని .. గుండెల నిండుగ ఆయన రూపాన్ని ముద్రించుకుని ఆయన తిరిగి వచ్చేసేవారు. అలా చాలా కాలం గడచిపోయింది.

వయసైపోయిన కారణంగా ఓ ఏడాది మాధవరెడ్డి తిరుమల వెళ్లలేకపోయారు. స్వామి దర్శనం చేసుకోలేక ఆయన బాధపడుతూ ఉంటారు. ఆ రోజు రాత్రి ఆయనకి కలలో స్వామి కనిపించి ఆయన కోసం తానే వచ్చాననీ .. ఫలానా ప్రదేశంలో పుట్టలో తన మూర్తి ఉందనీ .. దానిని వెలికి తీసి అనునిత్యం ఆరాధించమని చెబుతాడు. మరునాడు స్వామివారు చెప్పిన జాడ మేరకు ఆ మూర్తిని పుట్టనుంచి బయటికి తీసి ప్రతిష్ఠిస్తారు. శ్రీదేవి – భూదేవి సమేతుడైన స్వామివారికి మాధవరెడ్డి చిన్న మందిరం నిర్మించి, తన చివరి శ్వాస వదిలేవరకూ నిత్య ధూపదీప నైవేద్యాలు నిర్వహిస్తూ స్వామివారి సేవలోనే తరించారు.

ఆ తరువాత కాలంలో గోల్కొండ నవాబు సంస్థానంలో పనిచేస్తున్న అక్కన్న మాదన్నలకు ఇక్కడి స్వామివారిని గురించి .. ఆ స్వామి మహాత్మ్యం గురించి తెలుస్తుంది. దాంతో వాళ్లిద్దరూ తమ అనుచరులతో కలిసి ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. ఆ సమయంలోనే స్వామివారికి ఆలయాన్ని నిర్మించాలనే నిర్ణయం తీసుకుంటారు. అలా స్వామివారికి వారు ఆలయాన్ని నిర్మిస్తారు. అప్పటి నుంచి కూడా స్వామివారికి చైత్ర శుక్ల పౌర్ణమి రోజున బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలి వస్తుంటారు.

స్వామివారి ఆలయం చుట్టూ విశాలమైన ప్రదక్షిణ మార్గం ఉంటుంది. ఇక్కడి స్వామివారికి మనసులోని ధర్మ బద్ధమైన కోరిక చెప్పుకుని, ప్రదక్షిణలనే మొక్కుగా చెల్లిస్తుండటం విశేషం. ఈ కారణంగా ఇక్కడ ఉదయం నుంచి రాత్రి వరకూ భక్తులు ప్రదక్షిణలు చేస్తూనే ఉంటారు. స్వామివారి దర్శనం చేసుకుని మొక్కుకుంటే ఆ కోరిక తప్పకుండా నెరవేతుందనేది భక్తుల విశ్వాసం. స్వామివారికి ప్రదక్షిణలు చేసే భక్తుల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతుండటం మరొక నిదర్శనం. మహిమాన్వితమైన ఈ క్షేత్రం తప్పకుండా దర్శించుకోవలసింది.

ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత .. ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే. పూర్తి సమాచారం కాదు.