Pandaripuram Panduranga Temple Maharashtra
తల్లిదండ్రులను ప్రేమిస్తే .. వారిని సేవిస్తే భగవంతుడు ప్రీతి చెందుతాడనడానికీ .. అలాంటివారిని అనుగ్రహించడం కోసం దైవం దిగివస్తుందని చెప్పడానికి నిదర్శనంగా నిలిచే క్షేత్రంగా “పండరీపురం”(Pandaripuram) కనిపిస్తుంది. ఇది మహారాష్ట్ర లోని షోలాపూర్ జిల్లా పరిధిలో వెలుగొందుతోంది. మహారాష్ట్రలో చెప్పుకోదగిన ప్రాచీనమైన క్షేత్రాలలో ఇది ఒకటి. శ్రీకృష్ణుడు .. ఇక్కడ “పాండురంగస్వామి”గా పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. ఈ క్షేత్రానికి .. ఇక్కడి స్వామి వారికి ఈ పేరు రావడానికి కారణం ఒక భక్తుడు .. ఆ భక్తుడిపేరే పుండరీకుడు.
పుండరీకుడు యవ్వనంలోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి వేశ్యాలోలుడిగా మారిపోతాడు. అతని ప్రవర్తనలో మార్పు వస్తుందేమోనని తల్లిదండ్రులు ఒక ఉత్తమురాలితో వివాహాన్ని జరిపిస్తారు. ఆమె ఎంతగా ప్రయత్నించినా పుండరీకుడి ధోరణిలో మార్పురాదు. వేశ్యలను సంతోష పెట్టడం కోసం సంపదలు పంచేస్తాడు. అందుకు అడ్డుపడిన తల్లిదండ్రులను .. భార్యను ఇంట్లో నుంచి తరిమివేస్తాడు. అలా కాముకుడైన పుండరీకుడికి ఒక మహర్షి ద్వారా కనువిప్పు కలుగుతుంది. దాంతో ఆయన తన తప్పు తెలుసుకుని తల్లిదండ్రులను ఇంటికి తీసుకుని వస్తాడు.
సుఖాలు .. భోగాలు తాత్కాలికమని భావించి తల్లిదండ్రుల సేవలో తరిస్తూ ఉంటాడు. పుండరీకుడిని పరీక్షించడం కోసం కృష్ణుడు వచ్చి .. ఆశ్రమం వాకిట నిలిచి పిలుస్తాడు. వచ్చింది ఎవరని కూడా పుండరీకుడు తెలుసుకోడు .. తల్లిదండ్రుల సేవలో ఉన్నందువలన తాను ఇప్పుడు బయటికి రాలేనని జవాబిస్తాడు. ఎండకి తన కాళ్లు కాలుతున్నాయని శ్రీకృష్ణుడు అంటే .. ఒక ఇటుక బయటికి విసిరి దానిపై నుంచోమంటాడు. అలా ఇటుకపైనే నుంచుని కృష్ణుడు అక్కడే వెలిశాడు. మరాఠీలో “విఠ్” అంటే ఇటుక. దానిపై వెలసిన స్వామి కనుక “విఠలుడు”గా స్వామిని కొలుస్తారు.
పుండరీకుడి కోసం వెలసిన స్వామి కనుక “పాండురంగడు” అయ్యాడు. చివరికి పుండరీకుడు ఆ స్వామిని సేవిస్తూ ఆయనలోనే ఐక్యమైపోయాడు. ఆ తరువాత కాలంలో ఆలయం నిర్మించబడింది. “చంద్రభాగ” నదీ తీరంలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. దీనినే “భీమానది”గా కూడా పిలుస్తుంటారు. మహారాష్ట్ర .. ఆ పరిసర ప్రాంతాల్లో పాండురంగస్వామి(Panduranga Swamy) భక్తులు ఎక్కువగా కనిపిస్తారు. పురందరదాసు ..జ్ఞానేశ్వర్ .. నామదేవ్ .. ఏకనాథుడు .. భక్త తుకారాం .. ఛోఖ మేళ .. జనాబాయి ఇలా ఎంతోమంది భక్తులు స్వామివారి సేవలో తమ జీవితాలను చరితార్థం చేసుకున్నారు.
చంద్రభాగ నదిలో స్నానం చేసిన భక్తులు .. ముందుగా నదీ తీరంలోని పుండరీకుడి ఆలయాన్ని దర్శించుకుంటారు. ఆ తరువాత ప్రధాన ఆలయ ద్వారం చెంతనున్న నామదేవ్ .. చోఖమేళ మందిరాలను దర్శించుకుంటారు. ఆ తరువాతనే పాండురంగ స్వామి .. రుక్మిణి దేవి మూర్తులను దర్శించుకుంటారు. తన భక్తులను భగవంతుడు ఇచ్చిన స్థానం ఎలా ఉంటుందనేది ఈ ఆలయాన్ని దర్శిస్తే అర్థమవుతుంది. ఆలయ ప్రాంగణంలో తుకారాం మూర్తితో పాటు ఆయన పాదుకలు కూడా పూజలు అందుకుంటూ ఉంటాయి.
ప్రతి ఏడాది తుకారాం .. జ్ఞానేశ్వర్ పాదాలను వారి గ్రామాల నుంచి ఊరేగింపుగా ఇక్కడికి తీసుకుని వస్తారు. దీనినే “వారీ యాత్ర” అంటారు. ఈ యాత్రలో లక్షలాదిమంది భక్తులు పాల్గొంటారు. వాళ్లంతా భజనలు చేస్తూ .. తమ సంప్రదాయ రీతిలో నాట్యాలు చేస్తూ కాలినడకన ఈ క్షేత్రానికి చేరుకుంటారు. భక్తుడి కోసం భగవంతుడే దిగి వచ్చిన ఈ క్షేత్ర దర్శనం వలన సమస్త పాపాలు నశిస్తాయనేది ఇక్కడి విశ్వాసం.
ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ వారం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ సంవత్సరం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత .. ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే. పూర్తి సమాచారం కాదు.