Sri Bhagavatam – Aditi’s God kids living in forests make her unhappy
ఒక రోజున కశ్యప ప్రజపతి తన భార్య “అదితి” అదోలా ఉండటం చూసి, అందుకు కారణం అడుగుతాడు. అప్పుడు ఆమె తన సంతానమైన దేవతలను గురించి ప్రస్తావిస్తుంది. “దితి” సంతానమైన దానవుల అరాచకాలను గురించి ప్రస్తావిస్తుంది. దానవులు .. దేవతలను అమరావతి నగరం నుంచి తరిమివేశారని అంటుంది. అప్పటి నుంచి వాళ్లంతా అడవులు పట్టుకుని తిరుగుతున్నారని చెబుతుంది. వరాలనిచ్చే వారే వనాల్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని కన్నీళ్లు పెట్టుకుంటుంది.
తన కుమారుడైన దేవేంద్రుడు .. తన కోడలు శచీదేవి స్వర్గ సుఖాలకు దూరమై నానాపాట్లు పడుతున్నారని ఆవేదన చెందుతుంది. అందమైన భవంతులలో ఆనందాలను అనుభవించే వాళ్లు, అడవులలో పడుతున్న కష్టాలను తలచుకుంటే తన ప్రాణం తల్లడిల్లిపోతోందని బాధపడుతుంది. బిడ్డలు కష్టాలు పడుతుంటే ఏ తల్లి మాత్రం తట్టుకోగలదని అంటుంది. తన కుమారుడైన ఇంద్రుడిని తిరిగి సింహాసనంపై చూడాలనుకుంటున్నాననీ, అప్పటివరకూ తనకి మనశ్శాంతి లేదని చెబుతుంది. అయితే అందుకు ఏం చేయాలనేది తనకి అర్థం కావడం లేదని అంటుంది.
తన బిడ్డలను ఈ గండం నుంచి గట్టెక్కించే మార్గం ఏదైనా ఉంటే సెలవీయమని కోరుతుంది. దేవతలు ఈ కష్టాల నుంచి బయటపడాలంటే శ్రీమహా విష్ణువును ప్రసన్నం చేసుకోవడమే మార్గమని కశ్యప ప్రజాపతి చెబుతాడు. సమస్త లోకాలను పాలించే పరంధాముడి దర్శనం లభించాలంటే మాటలా .. అందుకు తాను ఏం చేయాలని అదితి అడుగుతుంది. “పయో భక్షణం” అనే వ్రతాన్ని 12 రోజుల పాటు ఆచరించటం వలన, స్వామి ప్రసన్నుడవుతాడని ఆయన చెబుతాడు.
ఓ శుభ ముహూర్తాన అదితి “పయో భక్షణం” వ్రతాన్ని ఆచరించడం మొదలుపడుతుంది. అత్యంత భక్తి శ్రద్ధలతో .. నియమనిష్టలతో ఆ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటుంది. అలా 12 రోజుల పాటు ఎక్కడా వ్రత భంగం జరగకుండా ఆమె ఆ స్వామిని సేవిస్తూ .. ధ్యానిస్తూ వ్రతాన్ని పూర్తి చేస్తుంది. అప్పుడు శ్రీమన్నారాయణుడు ఆమె ఎదుట ప్రత్యక్షమవుతాడు.అత్యంత భక్తి శ్రద్ధలతో .. అంకితభావంతో ఆమె ఆ వ్రతాన్ని పూర్తి చేయడం పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తాడు. ఏం కావాలో కోరుకోమని అడుగుతాడు.
ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ వారం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ సంవత్సరం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.