Kumbakonam – Sri Sarangapani Swamy Temple

తమిళనాడులోని ప్రాచీమైన క్షేత్రాలలో “కుంభకోణం”(Kumbakonam) ఒకటిగా కనిపిస్తుంది. ఆలయాల చుట్టూ ఊరు ఏర్పడిందా? లేదంటే ఊరంతా ఆలయాల నిర్మాణమే జరిగిందా? అన్నట్టుగా అనేక ఆలయాల సమాహారంగా ఈ క్షేత్రం కనిపిస్తుంది. ఎన్నో వైష్ణవ సంబంధమైన ఆలయాలు .. మరెన్నో శైవ సంబంధమైన ఆలయాలు ఇక్కడ కనిపిస్తాయి. ఎటువైపు చూసినా భగవంతుడి నామస్మరణే వినిపిస్తూ ఉంటుంది .. ఆలయ గోపురాలు .. గర్భాలయ విమానాలు .. ధ్వజ స్థంభాలు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి ఆలయాలలో ప్రధానమైనదిగా సారంగపాణిస్వామి ఆలయం కనిపిస్తుంది.

సువిశాలమైన ప్రదేశంలో .. ఎత్తైన గోపురాలు .. పొడవైన ప్రాకారాలతో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. ఆయా రాజుల కాలంలో ఆలయ అభివృద్ధి జరిగిందనడానికి నిదర్శనంగా అనేక ఆధారాలు .. ఆనవాళ్లు కనిపిస్తూ ఉంటాయి. గర్భాలయంలో స్వామివారు శయన ముద్రలోనే కనిపిస్తుంటారు. కాకపోతే కాస్త పైకి లేవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా అనిపిస్తాడు. పన్నెండు మంది ఆళ్వారులలో ఒకరు స్వామివారికి మంగళాశాసనాలు చేస్తుండగా స్వామివారు లేవబోయారట. ఆ ఆళ్వార్ వారించడంతో స్వామి మూర్తి అలాగే ఉండిపోయిందని చెబుతారు.

ఇక అమ్మవారు ఇక్కడ కోమలవల్లీ తాయారు పేరుతో పూజాలు అందుకుంటూ ఉంటుంది. స్వామివారిని దర్శించుకున్న తరువాత భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆ తల్లి అనుగ్రహాన్ని కోరుతుంటారు. అడుగడుగునా ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లే ఈ క్షేత్రానికి ఈ పేరు రావడానికి వెనుక ఒక ఆసక్తికరమైన కథనం వినిపిస్తూ ఉంటుంది. ప్రళయకాలం తర్వాత మళ్లీ సృష్టి మొదలు కావడానికి అవసరమైన “బీజరాశి”ని బ్రహ్మదేవుడు ఒక కుండలో భద్రపరచగా, ప్రళయకాలంలో ఆ కుండా ప్రవాహంలో కొట్టుకువచ్చి ఆగిన ప్రదేశం కావడం వల్లనే ఈ క్షేత్రానికి “కుంభకోణం”(Kumbakonam) అనే పేరు వచ్చిందని అంటారు.

ఈ కారణంగానే ఇక్కడ బ్రహ్మదేవుడి ఆలయం కూడా కనిపిస్తుంది. ఎక్కడా కనిపించని బ్రహ్మదేవుడికి ఇక్కడ ఆలయం ఉండటం .. బ్రహ్మదేవుడిని దర్శించుకోవడం ఒక అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది. ఇక ఈ క్షేత్రానికి “భాస్కర క్షేత్రం” అనే మరో పేరు కూడా ఉంది. ఒకానొకసారి సూర్యభగవానుడు తన తేజస్సు విషయంలో అహంభావానికి పోయి సుదర్శన చక్రంతోనే పోటీకి దిగుతాడు. ఫలితంగా సూర్యుడు తన తేజస్సును కోల్పోతాడు. అప్పుడు సూర్యుడు ఈ క్షేత్రంలో తపస్సు చేసి తిరిగి తన తేజస్సును పొందినట్టుగా స్థలపురాణం చెబుతోంది.

ఇక్కడి పుష్కరిణికి “హేమ పుష్కరిణి” అని పేరు. ఇది చాలా మహిమాన్వితమైనదని చెబుతారు. ఇక్కడే పాతాళ శ్రీనివాసుడిని దర్శించుకోవచ్చు. గర్భాలయంలో ఉన్న స్వామివారిని దర్శించుకోవాలంటే నేలబారు నుంచి లోపలికి వెళ్లి స్వామివారిని దర్శించుకోవలసి ఉంటుంది. పన్నెండు మంది ఆళ్వారులలో చాలావరకూ ఈ క్షేత్ర దర్శనం చేసుకుని, స్వామికివారిని తమ పాశురాలతో కీర్తించినవారే.108 దివ్య తిరుపతులలో తప్పకుండా దర్శించుకోవలసిన క్షేత్రం ఇది.

ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ వారం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ సంవత్సరం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత .. ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే. పూర్తి సమాచారం కాదు.