కంసుడి ఆదేశం మేరకు అక్రూరుడు బృందావనానికి బయల్దేతారాడు. రథం బృందావనంలోకి ప్రవేశించిన దగ్గర నుంచి అక్కడి ప్రకృతి అందాలను చూసి ఆయన ముగ్ధుడవుతాడు. పరమాత్ముడైన కృష్ణుడు అడుగుపెట్టడం వల్లనే అక్కడి వాతావరణం అంత అందంగా .. ఆహ్లాదంగా ఉందని ఆయన అనుకుంటాడు. కృష్ణుడు నడయాడిన నేలపై అడుగుపెట్టడమే తాను చేసుకున్న అదృష్టంగా భావిస్తాడు. ఆ పరమ పురుషుడిని మరికొద్ది సేపట్లో దర్శించుకోనున్నాననే ఆనందం అతనిలో ఆత్రుతను పెంచుతూ ఉంటుంది.

బృందావనం వీధుల్లోకి ప్రవేశించగానే రథాన్ని ఆపేసి, నందుడి ఇంటికి వెళతాడు. లోపలికి అడుగుపెడుతూనే బలరామకృష్ణులకు భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తాడు. ఆయనను వాళ్లు సాదరంగా ఆహ్వానిస్తారు. కంసుడు “ధనుర్యాగం” తలపెట్టాడనీ, ఆ వేడుకను తిలకించడానికి వాళ్లని ఆహ్వానిస్తూ స్వయంగా తీసుకురమ్మని తనని పంపించాడని చెబుతాడు. ఏ ఉద్దేశంతో కంసుడు “ధనుర్యాగం” తలపెట్టింది కూడా వివరిస్తాడు. దాంతో తప్పకుండా అక్రూరుడితో కలిసే వెళ్లాలని బలరామకృష్ణులు నిర్ణయించుకుంటారు.

కానీ మధురానగరానికి కృష్ణుడిని పంపించడానికి యశోదాదేవి అయిష్టతను వ్యక్తం చేస్తుంది. ఎందుకో తన మనసు ఆందోళనగా ఉందనీ, అందువలన తాను కృష్ణుడిని అక్కడికి పంపించనని అక్రూరుడితో చెబుతుంది. తమ గురించి భయపడవలసిన పనిలేదనీ, ధైర్యంగా ఉండమని కృష్ణుడు తల్లితో అంటాడు. ఎలా వెళ్లామో అలాగే తిరిగి వస్తామనీ, కంగారుపడవలసిన పనిలేదని చెబుతాడు. కోరి కంసుడు పిలిపించుకుంటున్నప్పుడు, కాదనడం సరైనదికాదని చెబుతాడు. నందుడు కూడా యశోదాదేవికి నచ్చజెబుతాడు.

కృష్ణుడు “మధుర”కు వెళుతున్నాడనే విషయం తెలియగానే గోపకాంతలు నివ్వెరపోతారు. తన కృష్ణయ్య ఎప్పటికీ తమతోనే ఉండిపోతాడని అనుకుంటే, ఈ అక్రూరుడు ఎక్కడి నుంచి దాపురించాడని అసహనానికి లోనవుతారు. “మధుర” ఎంతో అందమైన నగరం .. అక్కడ ఎన్నో వినోదాలు … విశేషాలు ఉంటాయి. తమకంటే అందమైన యువతులు అక్కడ ఉంటారు. అలాంటప్పుడు ఆ మధురానగరాన్ని వదిలిపెట్టి వెనక్కి రావడానికి కృష్ణుడు ఇష్టపడతాడా? మళ్లీ తమకి ఆయన దర్శన భాగ్యం లభిస్తుందా? అని చింతిస్తూ ఉంటారు.

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.