Aluru Kona Ranganatha Swamy Temple
సాధారణంగా శ్రీమహావిష్ణువు .. రాముడిగా .. కృష్ణుడిగా .. వేంకటేశ్వరస్వామిగా ఆవిర్భవించిన క్షేత్రాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఆ స్వామి రంగసనాథుడిగా ఆవిర్భవించిన క్షేత్రాలు చాలా తక్కువగా ఉంటాయి. రంగనాథస్వామివారు కొలువైన ప్రాచీన క్షేత్రాలు మరింత తక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి ప్రాచీన క్షేత్రాలలో ఆలూరు కోన రంగనాథస్వామి క్షేత్రం (Aluru Kona Ranganatha Swamy Temple) ఒకటిగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ .. అనంతపురం జిల్లా తాడ్రిపతి మండల కేంద్రానికి సమీపంలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది.
రంగనాథస్వామి కొండపై కొలువైన క్షేత్రాలు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మాత్రం స్వామివారు కొండపై ఆవిర్భవించడం విశేషం. చుట్టూ అందమైన ప్రకృతి .. ఆహ్లాదకరమైన వాతావరణం .. మనసుకి అనిర్వచనీయమైన అనుభూతిని అందించే పూల పరిమళాలు ఆధ్యాత్మిక చింతనకు మరింత దగ్గరగా తీసుకుని వెళుతుంటాయి. ప్రశాంతమైన వాతావరణంలో శయన రంగనాథస్వామిని దర్శించినప్పుడు కలిగే ఆధ్యాత్మికపరమైన ఆనందం వేరు .. అనుభూతి వేరు. ప్రకృతిమాత సిగలో సంపెంగలా ఈ క్షేత్రం దర్శనమిస్తుంది.
గర్భాలయంలో స్వామివారి పాదాల చెంత శ్రీదేవి – భూదేవి దర్శనమిస్తూ ఉంటారు. స్వామివారి నాభికమలంలో బ్రహ్మదేవుడు కూడా కనిపిస్తుంటాడు. విశ్వామిత్రుడి తపస్సుకు మెచ్చి సాక్షాత్కరించిన రంగనాథస్వామి, ఆయన అభ్యర్థనమేరకు ఇక్కడ కొలువై ఉన్నట్టుగా స్థలపురాణం చెబుతోంది. అలా ఇక్కడి స్వామి స్వయంభువుగా ఆవిర్భవించి, బ్రహ్మర్షి అనిపించుకున్న విశ్వామిత్రుడిచే పూజలు అందుకున్నవాడు. అప్పట్లో ఇదంతా అడవీ ప్రదేశం కావడం వలన, ఇక్కడి స్వామి చాలాకాలం పాటు అంతర్హితంగా ఉండిపోయాడు.
ఆలూరుకోన చుట్టూ జనసంచారం మొదలైన తరువాత స్వామివారు వెలుగులోకి వచ్చారు. అప్పటి నుంచి స్వామివారికి నిత్యపూజలు మొదలయ్యాయి. విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన చరిత్రలో కనిపించే బుక్కరాయల వారు 13వ శతాబ్దంలో స్వామివారికి ఆలయాన్ని నిర్మించినట్టుగా చరిత్ర చెబుతోంది. ఆ తరువాత కృష్ణదేవరాయలవారి కాలం లో మరింత అభివృద్ధి జరిగింది .. వైభవాన్ని చూసింది. ఇక్కడి కోనేరు చాలా మహిమాన్వితమైనదనీ, ఈ నీటిని తలపై చల్లుకోవడంతోనే సమస్త పాపాలు .. దోషాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తుంటారు.
కొండపై రంగనాథస్వామి శయనముద్రలో కనిపిస్తే .. కొండదిగువున ఉన్న ఆలయంలో స్వామివారు అమ్మవార్లతో కలిసి నుంచున్న అర్చా మూర్తిగా దర్శనమిస్తుంటాడు. కొండపైన .. కొండ దిగువున కూడా చైత్ర పౌర్ణమి రోజున కల్యాణోత్సవం కనుల పండుగగా జరుగుతుంది. ఈ కల్యాణోత్సవాన్ని తిలకించడానికిగాను చుట్టూ పక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. ఆ స్వామి దర్శన భాగ్యంతో తరిస్తుంటారు. ఇటు చరిత్ర .. అటు ఆధ్యాత్మిక సంపద కలిగిన ఈ క్షేత్ర దర్శనం ఒక అందమైన అనుభూతిగా ఎప్పటికీ మిగిలిపోతుందని చెప్పచ్చు.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
గమనిక: ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత .. ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే. పూర్తి సమాచారం కాదు.
Aluru Kona Ranganatha Swamy Temple