కృష్ణుడి లీలావిశేషాలను గురించి శుక మహర్షి చెబుతూ ఉంటే, పరీక్షిత్తు మహారాజు ఎంతో ఆసక్తిగా వింటాడు. శ్రీమహా విష్ణువును సేవించడం కోసమే ఎంతోమంది భక్తులు తమ జీవితాలను అంకితం చేశారు. స్వామి నామస్మరణనే ఆహారంగా .. ఆధారంగా భావించారు. ఆ స్వామి నామ సంకీర్తనలో తరించారు. అలాంటి మహాభక్తుల కథలను తనకి వినిపించమనీ, లోకకల్యాణం కోసం ఆ స్వామి ధరించిన ఇతర అవతారాలను తెలియజేయమని అడుగుతాడు. శ్రీహరి లీలా విశేషాలను తెలుసుకుంటూ తాను తరిస్తానని శుక మహర్షిని పరీక్షిత్తు మహారాజు కోరతాడు. శ్రద్ధగా వినమని చెబుతూ, విష్ణు భక్తులలో అగ్రస్థానంలో కనిపించే అంబరీషుడు గురించి శుక మహర్షి చెప్పడం మొదలుపెడతాడు.

అయోధ్య పాలకులలో ఒకరైన “అంబరీషుడు” శ్రీమహావిష్ణువుకు మహా భక్తుడు. ఆయన అనునిత్యం ఆ స్వామినే పూజిస్తూ ఉంటాడు. విష్ణుపూజ అయిన తరువాతనే ఆయన తన దైనందిన కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటాడు. తను ఏ పని చేస్తున్నప్పటికీ ఆయన విష్ణు నామాన్ని స్మరిస్తూనే ఉంటాడు. ఆయన విష్ణుభక్తే ఆయనను కాపాడుతూ ఉంటుంది. విష్ణుమూర్తి ఆదేశం మేరకు “సుదర్శన చక్రం” అంబరీషుడి ఇంటనే ఉంటుంది .. అంతటి భక్తుడు ఆయన. ఏడాది పాటుగా ఆయన “ఏకాదశి వ్రతం” ఆచరిస్తూ వస్తుంటాడు.

అలా ఏడాది క్రితం కార్తీకమాసంలో ఆయన తన భార్యతో కలిసి చేపట్టిన ఏకాదశి వ్రతాన్ని ఎంతో నియమ నిష్టలతో కొనసాగిస్తూ వస్తాడు. ద్వాదశి రోజున బ్రాహ్మణులకు ఎన్నో దానాలు చేస్తాడు .. అందరికీ భోజనాలు పెడతాడు. ఆ తరువాత తాను కూడా భోజనం చేయడానికి అంబరీషుడు సిద్ధమవుతూ ఉంటాడు. అదే సమయంలో “దుర్వాస మహర్షి” అక్కడికి వస్తాడు. ఆయనను చూడగానే అంబరీషుడు సాదరంగా ఆహ్వానిస్తాడు. ఏడాదిపాటుగా తాను చేస్తున్న ఏకాదశి వ్రతం మరి కొంత సేపట్లో పూర్తవుతుందన్నట్టుగా చెబుతాడు. యమునా నదిలో స్నానమాచరించి వస్తే ఆయనకి భోజనం వడ్డించి తాను చేస్తానని అంటాడు.

దుర్వాసుడు అలాగేనని చెప్పి నదీ స్నానానికి వెళతాడు. అలా వెళ్లిన దుర్వాసుడు ఎంతసేపటికీ రాకపోవడంతో అంబరీషుడు ఆలోచనలో పడతాడు. ద్వాదశి ఘడియలు ముగిసేలోగా భోజనం చేయకపోతే వ్రతభంగం అవుతుంది. ఒకవేళ భోజనం చేస్తే అది అతిథిని అవమానపరిచినట్టు అవుతుంది. ఏమిటి చేయడం? భగవంతుడు ఇంతటి పరీక్ష పెట్టాడేనని అంబరీషుడు ఆలోచన చేస్తూ పచార్లు చేస్తూ ఉంటాడు. నదీ తీరం నుంచి రానున్న దుర్వాస మహర్షి కోసం ఎదురుచూస్తూ ఉంటాడు.

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.