రుక్మి మనవరాలైన “రుక్మలోచన”తో శ్రీకృష్ణుడి మనవడైన అనిరుద్ధుడి వివాహం జరుగుతుంది. ఓ రోజున ఆ నూతన దంపతులను ఆశీర్వదించడానికి నారద మహర్షి ద్వారక వస్తాడు. ఆ దంపతులకు తన ఆశీస్సులను అందజేస్తాడు. అనిరుద్ధుడితో మాట్లాడుతూ నారదుడు బాణాసురుడి ప్రస్తావన తీసుకువస్తాడు. బాణాసురిడి కూతురైన “ఉష” మహా సౌందర్యరాశి అని చెబుతాడు. ఆమె సౌందర్యాన్ని తిలకించడానికి గంధర్వులు సైతం పోటీపడుతూ ఉంటారని అంటాడు. ఆ మాటలు విన్న దగ్గర నుంచి అనిరుద్ధుడు ఆమెను గురించే ఆలోచన చేస్తూ ఉంటాడు.

అక్కడి నుంచి నారదుడు వెళ్లిపోయినా ఉష సౌందర్యం గురించి ఆయన చెప్పిన మాటలే అనిరుద్ధుడికి అదే పనిగా గుర్తుకు వస్తుంటాయి. ఇదివరకటిలా ఆయన ఏ పనీ చేయలేకపోతుంటాడు. ఏ కార్యంపై దృష్టి పెట్టలేకపోతుంటాడు. ఆయన పరధ్యానంగా ఉండటాన్ని రుక్మలోచన గ్రహిస్తుంది. అయితే అందుకు కారణం ఏమిటనేది మాత్రం ఆమె గమనించలేకపోతుంది. మహా సౌందర్యరాశిగా అందరూ చెప్పుకునే ఉషను చూడాలని అనిరుద్ధుడు మనసు ఉవ్విళ్లూరుతుంటుంది.

శోణపురములో ఉష ఉంది .. కానీ అక్కడికి వెళ్లడం ఎలా? ఆమెను చూడటం ఎలా? అలా అని చెప్పి వెళ్లకుండా .. చూడకుండా ఉండలేని పరిస్థితి .. ఏమిటి చేయడం? ఇలా అనిరుద్ధుడు అనేక రకాలుగా ఆలోచన చేస్తూ సతమతమవుతుంటాడు. ఏదేమైనా ఆ కన్యామణిని చూడాలి .. మాట్లాడాలి .. మనసు దోచుకోవాలి అని అనిరుద్ధుడు నిర్ణయించుకుంటాడు. అందుకోసం అనుసరించవలసిన మార్గాల గురించి ఆయన అన్వేషిస్తూ ఉంటాడు. ఆ శోణపురములో కొలువైన పార్వతీ పరమేశ్వరులే తమని ఒకటిగా చేయాలని అనుకుంటాడు.

ఇదిలా ఉండగా శోణపురంలో ఉన్న పార్వతీదేవిని ఉష అనునిత్యం దర్శించుకుంటూ ఉంటుంది. తనపట్ల ఆమెకి గల భక్తికి పార్వతీదేవి మురిసిపోతుంది. ఆ సమయంలోనే ఉష వివాహం గురించి పార్వతీదేవి ప్రస్తావిస్తుంది. స్వప్నంలో ఆమెకి ఎవరైతే కనిపిస్తారో .. అతనికే ఆమె మనసు ఇస్తుందనీ .. అతనితోనే ఆమె వివాహం జరుగుతుందని చెబుతుంది. ఆ మాటకు ఉష సిగ్గుపడుతుంది. పార్వతీదేవి చెప్పడం వలన ఆ మాటకు ఎదురులేదని తెలిసిన ఉష, తనకి స్వప్నంలో ఎవరు కనిపిస్తారా అనే ఆసక్తితో రోజులు గడుపుతుంటుంది.

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.