సాందీపని మహర్షి ఆవేదనకు గల కారణం ఏమిటని బలరామకృష్ణులు అడుగుతారు. అప్పుడు ఆయన తన కుమారుడి గురించి ప్రస్తావిస్తాడు. సముద్ర స్నానానికి వెళ్లిన సందర్భంలో తన కుమారుడు ప్రమాదవశాత్తు మునిగిపోయాడనీ, ఆ బిడ్డ మరణించిన దగ్గర నుంచి తన భార్య ఇంకా కోలుకోలేదని చెబుతాడు. ఎన్నో విధాలుగా చెప్పినా ఆమె తన కుమారుడిని గురించే ఆలోచిస్తూ ఉంటుందని అంటాడు. ఒక్కగానొక్క కుమారుడిని బ్రతికించుకోలేకపోయిన తన నిస్సహాయత తనని కలచివేస్తుందని చెబుతాడు.
బలరామకృష్ణుల ధైర్యసాహసాలు తాను విని ఉన్నాననీ, అందువలన తన కుమారుడిని గురుదక్షిణగా అడగాలనిపిస్తుందని అంటాడు. ఆ మాటలు చెబుతున్నప్పుడు ఆయన కళ్లు చెమ్మగిల్లడం చూసిన కృష్ణుడు, ఆయన కుమారుడిని గురుదక్షిణగా ఆయనకి సమర్పిస్తామని మాట ఇచ్చి అక్కడి నుంచి బయల్దేరతాడు. గుర్తుపుత్రుడు స్నానం చేసిన సముద్రానికి వెళ్లి ఆవేశంతో సముద్రంలో వెదకడం మొదలుపెడతాడు. ఆ పిల్లవాడిని “పంచజనుడు” అనే రాక్షసుడు మింగివేశాడనీ, ఆ అసురుడు సముద్రగర్భంలోనే ఉన్నాడని సముద్రుడు చెబుతాడు.
దాంతో కృష్ణుడు సముద్ర గర్భంలోకి వెళతాడు. కృష్ణుడి రాక తెలిసి “పంచజనుడు” తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఆ అసురుడిని వెతికి పట్టుకుని కృష్ణుడు అతని ఉదరాన్ని చీల్చుతాడు. అసురుడికి ఆహారమైన గురుపుత్రుడు అతని ఉదరంలో కనిపించకపోవడంతో, నరకలోకంలో ఉన్నాడనే విషయాన్ని గ్రహిస్తాడు. అంతే ఎంతమాత్రం ఆలస్యం చేయక ఆయన అక్కడి నుంచి నేరుగా యమలోకానికి చేరుకుంటాడు. కృష్ణుడు శంఖం పూరించడంతో వెంటనే యమధర్మరాజు అక్కడికి వచ్చి వినయంగా నమస్కరిస్తాడు.
తాను వచ్చిన పనిని గురించి యమధర్మరాజుతో కృష్ణుడు చెబుతాడు. తన గురుపుత్రుడిని తనకి అప్పగించమని అడుగుతాడు. వెంటనే యమధర్మరాజు .. గురుపుత్రుడిని కృష్ణుడికి అప్పగిస్తాడు. ఆ పిల్లవాడిని తీసుకుని సాందీపని మహర్షి ఆశ్రమానికి చేరుకుంటాడు. సాందీపని మహర్షి దంపతులకు ఆ పిల్లవాడిని అప్పగిస్తాడు. ఆ దంపతులు తమ బిడ్డను ప్రేమతో అక్కున చేర్చుకుని మురిసిపోతారు. గురుదక్షిణ చెల్లించడం కోసం బలరామకృష్ణులు చేసిన ఈ సాహసం లోకంలో చిరస్థాయిగా నిలిచిపోతుందని ఆశీస్సులు అందజేస్తాడు.
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.