కంసుడు ముందుగా వేసుకున్న పథకం ప్రకారమే చాణూర .. ముష్టికులతో కృష్ణుడి మల్లయుద్ధాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆ మల్లయుద్ధాన్ని తిలకించడానికి మధుర వాసులంతా వస్తారు. మల్లయుద్ధంలో చాణూర .. ముష్టికులు ఆరితేరినవారు. అంతవరకూ వాళ్లకు అపజయమనేది తెలియదు. ఉక్కుతో తయారు చేసిన విగ్రహాల మాదిరిగా ఉన్న ఆ యోధుల ధాటికి బలరామకృష్ణులు తట్టుకోగలరా? అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. మదపుటేనుగును అవలీలగా కూల్చినవారికి పెద్ద కష్టమేమీ కాదని మరికొంతమంది అనుకుంటూ ఉంటారు.

కృష్ణుడిని అంతం చేసిన తరువాతనే బరిలో నుంచి బయటికి రావాలనే కంసుడి ఆదేశం మేరకు, ఆ మల్లయోధులు రంగంలోకి దిగుతారు. తన సమక్షంలో .. తన మనషుల వలన బలరామకృష్ణులు అంతం కావడాన్ని ప్రత్యక్షంగా తిలకించాలనే ఉద్దేశంతో కంసుడు కూడా ఆ క్రీడను తిలకిస్తూ ఉంటాడు. చాణూర .. ముష్టికులు ముందుకు కదులుతారు. అంతా కూడా ఎంతో ఉత్కంఠభరితంగా చూస్తూ ఉంటారు. బలరామకృష్ణులతో వచ్చిన గోపాలకులు మాత్రం ధైర్యంగానే ఉంటారు. అసురులను కూల్చిన కృష్ణుడికి మల్లయోధుల ఆటకట్టించడం చాలా తేలిక అనే భావిస్తారు.

మల్లయుద్ధంలో ఆరితేరిన చాణూర ముష్టికులు తమకి తెలిసిన పట్లు పట్టడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. ఆ పట్ల నుంచి బలరామకృష్ణులు తెలివిగా తప్పించుకుంటూ ఉంటారు. అదను చూసి వాళ్లపై విరుచుకుపడుతుంటారు. అలా ఆ నలుగురి మధ్య మల్లయుద్ధం భీకరంగా జరుగుతూ ఉంటుంది. చాణూర, ముష్టికులు తాను ఆశించినంత వేగంగా బలరామకృష్ణులను మట్టి కరిపించలేకపోవడం పట్ల కంసుడు తీవ్రమైన అసహనానికి లోనవుతాడు.

బలరామ కృష్ణులను బరిలో పట్టుకోవడం .. నిలువరించడమే ఆ మల్లయోధులకు కష్టమైపోతుంది. అవలీలలుగా వాళ్లు తప్పించుకునే తీరును చూసి ఆ వీరులు ఆశ్చర్యపోతారు. వాళ్లు కొడుతున్న దెబ్బలు మహా యోధులు దాడి చేసినట్టుగా ఉండటం చూసి బిత్తరపోతుంటారు. అలా ఆ ఇద్దరు మల్లయోధులు బలరామకృష్ణుల విషయంలో అలసిపోతారు. ఉహించని విధంగా వాళ్ల చేతిలో పరాజితులై ప్రాణాలు వదులుతారు. ఆ దృశ్యం చూసిన కంసుడు తీవ్రమైన ఆగ్రహావేశాలకు లోనవుతాడు. గోపాలకులంతా సంతోషంతో కేరింతలు కొడతారు.

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.