Basara – Sri Gnana Saraswathi Temple
లక్ష్మీదేవి .. సరస్వతీదేవి .. పార్వతీదేవిలను త్రిమాతలుగా చెబుతారు. సరస్వతీదేవి అనుగ్రహం ఉంటే సహజంగానే లక్ష్మీదేవి కరుణా కటాక్ష వీక్షణలు ఉంటాయని చెబుతారు. సాధారణంగా సరస్వతీదేవి ఆవిర్భవించిన క్షేత్రాలు తక్కువగానే కనిపిస్తాయి. పురాణాల్లోకి వెళితే అమ్మవారి ప్రత్యేకత ఏమిటనేది .. ప్రాధాన్యత ఏమిటనేది అర్థమవుతుంది. అమ్మ అనుగ్రహం లేకపోతే ఙ్ఞాన శూన్యం ఏర్పడుతుందనే విషయం స్పష్టమవుతుంది. అలాంటి అమ్మవారి క్షేత్రాలలో “బాసర”(Basara) ప్రధానమైనదిగా కనిపిస్తుంది.
గోదావరి నదీ తీరంలోని ఈ క్షేత్రంలో అమ్మవారిని వ్యాస మహర్షి ప్రతిష్ఠించారని స్థలపురాణం చెబుతోంది. వ్యాస మహర్షి వేదరాశిని నాలుగు భాగాలుగా విభజించాడు. 18 పురాణాలను ఈ లోకానికి అందించాడు. అలాంటి వ్యాస మహర్షి తపస్సు చేసుకున్న ప్రదేశంగా బాసర కనిపిస్తుంది. ఇక్కడి గోదావరి నదీ తీరంలో వ్యాస మహర్షి ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని చాలా కాలం పాటు ఉన్నాడనీ, గోదావరీ నదిలోని ఇసుకతోనే సరస్వతీదేవి మూర్తిని ప్రతిష్ఠించాడని అంటారు. సరస్వతీదేవితో పాటు ఆ తల్లి సన్నిధిలోనే లక్ష్మీ .. దుర్గాదేవి మూర్తులను కూడా ప్రతిష్ఠించాడు.
వ్యాస భగవానుడు అమ్మవారిని ప్రతిష్ఠించి ఆరాధించిన కారణంగానే పూర్వం ఈ క్షేత్రం “వాసర”గా పిలవబడింది. ఆ తరువాత కాలంలో “బాసర”గా మారిందని చెబుతారు. ఇక్కడి అమ్మవారు జ్ఞానసరస్వతీదేవిగా పూజలు అందుకుంటూ ఉంటుంది. సహజంగానే అమ్మవారు జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. ఇక అలాంటి పేరుతోనే అమ్మవారు కొలువై ఉండటం విశేషం. జ్ఞానం వలన బుద్ధి వికసిస్తుంది .. దాని వలన వివేకం కలుగుతుంది. వివేకం వలన విజయం వరిస్తుంది .. విజయం కీర్తి ప్రతిష్ఠలను తెచ్చిపెడుతుంది.
అంటే .. ఎవరైనా జీవితంలో అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలంటే ముందుగా కావాల్సింది సరస్వతీదేవి అనుగ్రహమే. సంగీత సాహిత్యాలలో రాణించాలంటే అమ్మవారి కృప ఉండాలసిందే. ఎంతో మంది పండితులు .. మహాభక్తులు అమ్మవారిని దర్శించి తరించారు. త్యాగయ్య తనకి సంగీత జ్ఞానం లేదని బాధపడుతూ ఉంటే, నారద మహర్షిచే అమ్మవారు “స్వరార్ణవం” అనే గ్రంథాన్ని పంపించినట్టుగా చరిత్ర చెబుతోంది. పోతన తన భాగవత రచన మానవ మాత్రులకు అంకితమీయనని అమ్మవారికి మాట ఇచ్చిన ఘటన మనకి ఆయన జీవితచరిత్రలో కనిపిస్తుంది.
ఆదిశంకరులవారు ఈ లోకానికి సరస్వతీదేవి యొక్క అనుగ్రహం అవసరమని భావించి శృంగేరి పీఠాన్ని స్థాపించారు. ఇక అమ్మవారి క్షేత్రాల విషయంలో బాసర భక్తుల పాలిట వరంలా కనిపిస్తుంది. ఇక్కడ అక్షరాభ్యాసాలు పెద్ద సంఖ్యలో జరుగుతుంటాయి. ఇక్కడ అక్షరాభ్యాసం చేసుకున్నవారు ఉన్నతమైన స్థానానికి వెళతారని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. వసంత పంచమి .. దసరా నవరాత్రులు .. వ్యాస పౌర్ణమి రోజుల్లో ఇక్కడ ప్రత్యేకమైన పూజలు జరుగుతుంటాయి. భక్తుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. తెలంగాణ ప్రాంతంలోని నిర్మల్ జిల్లా పరిధిలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
గమనిక: ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత .. ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే. పూర్తి సమాచారం కాదు.
Basara – Sri Gnana Saraswathi Temple