Sri Kalahasti Temple

పంచభూత క్షేత్రాలలో “శ్రీకాళహస్తీ”(Sri Kalahasti) ఒకటిగా కనిపిస్తుంది. ఇక్కడ స్వామి “వాయులింగం”గా దర్శనమిస్తుంటాడు. ఆంధ్రప్రదేశ్ .. తిరుపతి జిల్లాలో మండల కేంద్రంగా ఈ క్షేత్రం దర్శనమిస్తుంది. శ్రీకాళహస్తీశ్వరుడిగా స్వామివారు ఇక్కడ పూజలు అందుకోవడానికిగల కారణంగా ఒక పురాణ కథనం వినిపిస్తూ ఉంటుంది. పూర్వం ఈ ప్రాంతమంతా అడవిగా ఉండేది. అడవిలోని ఈ ప్రదేశంలోనే స్వామివారు ఆవిర్భవించారు. ఒక సాలెపురుగు ఇక్కడి స్వామివారిని సేవిస్తూ ఉండేది .. అలాగే ఒక పాము .. ఏనుగు కూడా స్వామిని ఆరాధిస్తూ ఉండేవి.

పాము మణులతో స్వామివారిని పూజించేది .. వాటిని తన తొండంతో తుడిచేసి ఏనుగు శివలింగాన్ని అభిషేకించి పుష్పాలు సమర్పించేది. దాంతో ఆ పాము కోపంతో ఏనుగు తొండంలోకి దూరుతుంది. ఆ బాధను భరించలేక ఏనుగు తన కుంభస్థలాన్ని కొండకు ఢీకొడుతుంది. ఏనుగుతో పాటు సర్పం కూడా మరణిస్తుంది. తనని సేవించడం కోసం పోటీపడిన పాముకు .. ఏనుగుకు స్వామి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. శ్రీ అంటే సాలీడు .. కాళము అంటే పాము .. హస్తీ అంటే ఏనుగు. ఈ మూడింటి పేరుమీదనే ఈ క్షేత్రానికి “శ్రీకాళహస్తి” అనే పేరు వచ్చింది.

ఇది వాయులింగం .. అందువలన గర్భాలయంలో స్వామివారికి సమీపంలో వెలిగించిన దీపాలు రెపరెపలాడుతూ ఉంటాయి. ఇక్కడి అమ్మవారు “జ్ఞానప్రసూనాంబ” పేరుతో పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో ఉపాలయాలు దర్శనమిస్తూ ఉంటాయి. స్వర్ణముఖీ నదీతీరంలో సువిశాలమైన ప్రదేశంలో నిర్మితమైన ఈ ఆలయం ఎంతో చారిత్రక నేపథ్యాన్ని సంతరించుకుని కనిపిస్తుంది. పాండ్యులు .. చోళులు .. విజయనగర రాజుల ఏలుబడిలో ఈ క్షేత్రం వైభవాన్ని అందుకుంది. ఇక్కడ జరిగే రాహు – కేతు పూజలు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుని కనిపిస్తాయి.

శివరాత్రి పర్వదినం సందర్భంగా వారం రోజుల పాటు జరిగే ఉత్సవాలు .. నవరాత్రుల సందర్భంగా జరిగే ఉత్సవాలు నయనానందకరంగా ఉంటాయి. అలాగే కార్తీకమాసంలోను ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. శ్రీకాళహస్తి అనగానే “భక్త కన్నప్ప” కథ కళ్లముందు కదలాడుతుంది. పూర్వం ఈ ప్రాంతంలో “తిన్నడు” అనే వ్యక్తి ఉండేవాడు. వేట ఆయన జీవనం. అందువలన విల్లంబులు ధరించి అడవిలో తిరుగుతూ ఉంటాడు. ఒకసారి ఒక జంతువు కోసం ఒక చెట్టుపై మాటు వేస్తాడు. ఆ చెట్టు క్రింద ఒక శివలింగం ఉంటుంది.

ఆ రోజున శివరాత్రి అనే విషయం ఆయనకి తెలియదు .. ఆ చెట్టుపై ఆయన కదలడం వలన పూలు రాలిపోయి ఆ శివలింగంపై పడతాయి. వేట దొరక్కపోవడం వలన ఆ రోజు అతను ఉపవాసం ఉంటాడు. ఆ పుణ్య విశేషం వలన అతనికి దృష్టి శివలింగంపైకి పోతుంది. దాంతో ప్రతిరోజు దోసెడు నీళ్లు పోసి .. పూలు సమర్పించి .. తనకి లభించిన వేటనే స్వామికి నైవేద్యంగా సమర్పిస్తుంటాడు. తనపై తిన్నడికి గల భక్తి రోజురోజుకి పెరిగిపోతుండటంతో తిన్నడు భక్తిని స్వామి పరీక్షించాలని అనుకుంటాడు.

అందులో భాగంగా శివలింగం కంటి నుంచి రక్తం రావడం మొదలవుతుంది .. దాంతో తిన్నడు కంగారుపడిపోతాడు. స్వామి కంటికి ఏదో జబ్బు చేసిందని భావించి బాణంతో తన కన్ను ఒకటి తీసి శివలింగానికి పెడతాడు. రెండవ కంటి నుంచి కూడా రక్తం వస్తుండటంతో, అక్కడ ఆనవాలుగా తన కాలు బొటవ్రేలు పెట్టి తన రెండవ కన్నును కూడా పెకిలించబోతాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అలాంటి ఒక అద్భుతమైన సంఘటనకు వేదికగా నిలిచిన ఈ క్షేత్రాన్ని దర్శించినంత మాత్రాన ధన్యతను పొందవచ్చు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక: ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత .. ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే. పూర్తి సమాచారం కాదు.

Sri Kalahasti Temple