జరాసంధుడి కోటలోకి ఒక్కసారిగా ప్రవేశించడానికి భీముడు ఉత్సాహాన్ని చూపుతాడు. వెంటనే ఆయనను కృష్ణుడు అడ్డుకుంటాడు. జరాసంధుడు చాలా తెలివైనవాడు అనే విషయాన్ని ప్రతిక్షణం గుర్తుపెట్టుకోమని అంటాడు. కోట ప్రవేశద్వారం పైన జరాసంధుడు మూడు “నగారా”లను ఏర్పాటు చేశాడనీ, అన్యులు ఎవరు కోటలోకి ప్రవేశించడానికి ప్రయత్నించినా అవి అదే పనిగా మ్రోగుతూ ఉంటాయని చెబుతాడు. అందువలన ముందుగా ఆ నగారాలను ధ్వంసం చేయాలని అంటాడు.

కృష్ణుడు చెప్పినట్టుగానే బీముడు కోట ముఖ ద్వారం వైపు నుంచి కాకుండా మరో వైపు నుంచి ఆ నగారాల దగ్గరికి చేరుకుంటాడు. తన ఉదరంతో ఆ నగారాలను పగలగొడతాడు. ఆ తరువాత కృష్ణుడు .. భీముడు ఇద్దరూ కలిసి కోటలోపలికి ప్రవేశిస్తారు. రాత్రి సమయంలో వచ్చిన వాళ్లిద్దరినీ బ్రాహ్మణులనే జరాసంధుడు అనుకుంటాడు. ఆ సమయంలో వాళ్ల రాకకై గల కారణం ఏమిటని అడుగుతాడు. ఏ సాయం కావాలన్నా అడగమని అంటాడు. అయితే వాళ్లు ప్రధానద్వారం నుంచి కాకుండా మరో ద్వారం నుంచి లోపలికి రావడం ఆయనకి సందేహాన్ని కలిగిస్తుంది.

జరాసంధుడికి అనుమానం వచ్చిందని గ్రహించిన కృష్ణుడు, తన నిజ రూపంలో అతనికి కనిపిస్తాడు. దాంతో జరాసంధుడు ఆగ్రహావేశాలకు లోనవుతాడు. తమలో ఎవరితో యుద్ధం చేస్తావో చెప్పమని కృష్ణుడు అడిగితే, భీముడి వంటి బలశాలితో ద్వంద యుద్ధం చేయడంలోనే అసలైన ఆనందం ఉందని చెప్పేసి జరాసంధుడు రంగంలోకి దిగుతాడు. జరాసంధుడు కోరుకున్నట్టుగానే అతనితో భీముడు యుద్ధానికి దిగుతాడు. ఇద్దరి మధ్య భీకరమైన పోరాటం జరుగుతూ ఉంటుంది. జరాసంధుడితో ద్వంద యుద్ధం చేస్తున్న భీముడికి అతను ఎంతో బలవంతుడనే విషయం అర్థమైపోతుంది.

అతనితో పోరాడుతూ భీముడు అలసిపోతుంటాడు. అది గ్రహించిన కృష్ణుడు .. భీముడు చూస్తుండగా, ఒక గడ్డిపోచను తీసుకుని దానిని రెండుగా చీలుస్తాడు. విషయాన్ని అర్థం చేసుకున్న భీముడు .. జరాసంధుడు శరీరాన్ని నిలువుగా రెండుగా చీల్చి వేస్తాడు. అయితే ఆ వెంటనే ఆ రెండు భాగాలు తిరిగి అతుక్కుని అతను మళ్లీ పునర్జీవితుడు అవుతుంటాడు. ఇలా జరాసంధుడిని భీముడు రెండు భాగాలుగా చీల్చడం .. ఆ శరీరభాగాలు అతుక్కుని అతను తిరిగి పునర్జీవితుడు కావడం జరుగుతుంటాయి.

దాంతో ఏం చేయాలన్నది భీముడికి పాలుపోదు. ఏం చేయాలన్నట్టుగా కృష్ణుడి వైపు చూస్తాడు. అప్పుడు కృష్ణుడు .. జరాసంధుడు శరీరాన్ని రెండుగా చీల్చిన తరువాత కుడివైపు భాగాన్ని ఎడమ వైపున .. ఎడమవైపు భాగాన్ని కుడివైపున పారేయమని గడ్డిపోచ ద్వారానే సూచిస్తాడు. భీముడు అలాగే చేయడంతో .. అపసవ్య దిశలో ఉన్న ఆ శరీర భాగాలు అతుక్కోలేకపోతాయి .. జరాసంధుడు మరణిస్తాడు. అలా లోక కల్యాణం కోసం జరాసంధుడి సంహారం కృష్ణుడి సహకారంతో భీముడి చేతులమీదుగా జరుగుతుంది.

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.