Sri Bhagavatam – Birth of Hiranyaksha and Hiranyakashipu
కశ్యప ప్రజాపతి .. ఆయన భార్య “దితి” ఎంతో అన్యోన్యమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఆహ్లాదకరమైన ప్రదేశంలో ఆశ్రమవాసం చేస్తూ ఉంటారు. ఒకరోజున అసుర సంధ్యవేళలో దితి తన భర్తను సమీపిస్తుంది. ఆమె తనకి సంతానాన్ని ప్రసాదించమని కోరుతుంది. అసుర సంధ్య వేళలో శృంగారం చేయకూడదనీ .. అందువలన అనేక దుష్పరిణామాలు ఎదురవుతాయని కశ్యప ప్రజాపతి చెబుతాడు. అయితే ఆయన మాటలను పట్టించుకోకుండా ఆమె వత్తిడి చేస్తుంది. దాంతో భార్య ముచ్చట తీర్చడం కోసం ఆయన ఆమెతో సంగమిస్తాడు.
కశ్యప ప్రజాపతి – దితి కలయిక కారణంగా వాళ్లకి ఇద్దరు మగబిడ్డలు కలుగుతారు. దితి సంతోషంతో పొంగిపోతుంది. ఓ శుభముహూర్తాన వాళ్లకి నామకరణోత్సవం నిర్వహిస్తారు. వాళ్లిద్దరికీ హిరణ్యాక్షుడు – హిరణ్యకశిపుడు అని కశ్యప ప్రజాపతి నామకరణ చేస్తాడు. ఆ చుట్టుపక్కలగల ఆశ్రమ వాసులంతా ఆ వేడుకలో పాల్గొంటారు. ఆ తరువాత ఎవరి ఇంటికి వాళ్లు వెళ్లిపోతారు. ఆ రాత్రి కశ్యప ప్రజాపతి అదోలా ఉండటం చూసి, కారణం ఏమిటని ఆమె అడుగుతుంది. ఆయన సమాధానం చెప్పడానికి నిరాకరిస్తాడు.
తమ దాంపత్యానికి గుర్తుగా బంగారంలాంటి బిడ్డలు కలిగారు .. తమ జీవితాన్ని ఆనందమయం చేశారు. ఇంకా దేని గురించి చింతిస్తున్నారు? పిల్లల ముద్దు ముచ్చట చూస్తూ మురిసిపోవడమే తాము చేయవలసిన పని అంటుంది. వాళ్లు ప్రయోజకులైతే తమకంటే అదృష్టవంతులు లేరని అంటుంది. కశ్యప ప్రజాపతి పిల్లలు .. తండ్రి మాదిరిగానే గొప్పవాళ్లు అవుతారనే నమ్మకం తనకి ఉందనీ, వాళ్లని ఆ విధంగా తీర్చిదిద్దుతానని అంటుంది. ఆధ్యాత్మిక మార్గంలో వాళ్లను ముందుకు నడిపిస్తానని చెబుతుంది.
ఆ మాటలకు కశ్యప ప్రజాపతి ఆవేదన చెందుతాడు. ఆమె అనుకున్నట్టుగా జరగదని చెబుతాడు. తమ బిడ్డలు ఇద్దరూ అసురులవలె ప్రవర్తిస్తారనీ, సాధుసత్పురుషులను వేధిస్తారని అంటాడు. భక్తులను మాత్రమే కాదు సాక్షాత్తు భగవంతుడినే ఎదిరించడానికి సిద్ధపడతారని చెబుతాడు. చివరికి ఆ భగవంతుడి చేతిలోనే వాళ్లు తమ ప్రాణాలను వదులుతారని అంటాడు. అలా జరగడానికి కారణం తామేనని చెబుతాడు. అసుర సంధ్య వేళలో తాము కూడటం వల్లనే అసుర లక్షణానలతో వాళ్లు జన్మించారని చెప్పగానే ఆమె నివ్వెరపోతుంది.
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.
ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి