Dwaraka Tirumala Sri Venkateswara Swamy Temple

వేంకటేశ్వరస్వామి వెలసిన ప్రాచీనమైన క్షేత్రాలలో ఒకటిగా “ద్వారకా తిరుమల” కనిపిస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలలో ఇది ఒకటిగా చెబుతారు. మండల కేంద్రమైన ఈ క్షేత్రానికి యుగాల నాటి చరిత్ర ఉన్నట్టుగా స్థలపురాణం చెబుతోంది. పూర్వం ఈ ప్రదేశంలో ద్వారక మహర్షి తపస్సు చేసి స్వామివారి సాక్షాత్కారాన్ని పొందాడట. స్వామివారి పాదుకలను తాను ఎప్పటికీ పూజించే భాగ్యాన్ని ఇవ్వవలసిందిగా కోరాడట. దాంతో స్వామి తన పాదాలను అర్చించే భాగ్యాన్ని ద్వారక మహర్షికి ఇచ్చాడట. అందువలన గర్భాలయంలోని స్వామి పాదాలు పుట్టలో ఉంటాయి. మిగతా భాగం మాత్రమే పైకి కనిపిస్తూ ఉంటుంది.

ఆ తరువాత కాలంలో శేషాద్రి కొండపై గల ఈ క్షేత్రాన్ని దర్శించిన రామానుజాచార్యులవారు, స్వామివారు పాదుకలను దర్శించే భాగ్యం భక్తులకు కల్పించడం కోసం స్వయంభూ మూర్తి వెనుక మరో నిలువెత్తు మూర్తిని ప్రతిష్ఠ చేయించారు. అప్పటి నుంచి గర్భాలయంలో రెండు మూల మూర్తులు భక్తులకు దర్శనమిస్తున్నాయి. స్వామివారి మూల మూర్తి పుట్టలో ఉండటం వలన, అభిషేకాలు చేయరు. దర్శన మాత్రం చేతనే స్వామివారు సకల శుభాలను అనుగ్రహిస్తారని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. శ్రీరామచంద్రుడి వంశీకులు ఇక్కడి స్వామివారి దర్శనం చేసుకున్నట్టుగా స్థల పురాణం చెబుతోంది. అంటే .. త్రేతాయుగం నుంచే స్వామివారు ఇక్కడ ఆవిర్భవించినట్టుగా తెలుస్తోంది.

ప్రస్తుతం భక్తులు దర్శించుకుంటున్న ఈ ఆలయం 17వ శతాబ్దంలో నిర్మితమైనదిగా చరిత్ర చెబుతోంది. ఆ తరువాత కాలంలో ఈ క్షేత్రం మరింత అభివృద్ధి చెందుతూ వచ్చింది. పొడవైన ప్రాకారాలతో .. గాలి గోపురాలతో అలనాటి వైభవానికి ఈ ఆలయం అద్దం పడుతూ ఉంటుంది. స్వామివారి ఆలయ ప్రాంగణంలోనే ప్రత్యేకమైన ఆలయాలలో అలమేలు మంగతాయారు .. గోదాదేవి అమ్మవారు దర్శనమిస్తూ ఉంటారు. ఈ క్షేత్రానికి శ్రీభ్రమరాంబిక మల్లేశ్వరస్వామి క్షేత్ర పాలకుడిగా పూజలందుకుంటూ ఉంటాడు. ఆలయ ప్రాంగణంలోనే ఉపాలయాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడికి సమీపంలో సుదర్శన పుష్కరిణి ఉంది. క్షీరాబ్ది ద్వాదశి రోజున స్వామివారికి ఇక్కడ తెప్పోత్సవం నిర్వహిస్తుంటారు.

“ద్వారకా తిరుమల”ను చిన్న తిరుపతిగా పిలుస్తూ ఉంటారు. తిరుమల వెళ్లి మొక్కులు చెల్లించలేనివారు, ఇక్కడ చెల్లించడం వలన అదే ఫలితం లభిస్తుందని అంటారు. ఇక ఇక్కడ మొక్కుకుంటే మాత్రం ఆ మొక్కులను ఇక్కడే చెల్లించాలని చెబుతారు. స్వయంభూ మూర్తి వైశాఖ మాసంలో దర్శనం ఇవ్వడం వలన వైశాఖ మాసంలోను .. స్వామివారి పూర్తి మూర్తిని ప్రతిష్ఠ చేసిన ఆశ్వయుజ మాసంలోను రెండు సార్లు కళ్యాణోత్సవాలు నిర్వహిస్తారు. విశేషమైన పర్వదినాలాలో ప్రత్యేకమైన సేవలను .. ఉత్సవాలను నిర్వహిస్తుంటారు. ధనుర్మాసంలో జరిగే గోదాదేవి కళ్యాణోత్సవం చూడటానికి రెండు కళ్లూ చాలవు.

కొత్త దంపతులు ద్వారకా తిరుమలను ఎక్కువగా దర్శించుకుంటారు. వైవాహిక జీవితం సుఖసంతోషాలతో కొనసాగడం కోసం స్వామివారిని .. అమ్మవార్లను సేవించి అనుగ్రహాన్ని పొందుతుంటారు. ఈ క్షేత్ర పరిసర ప్రాంతంలోనే మరికొన్ని ఆలయాలు .. తీర్థాలు ఉన్నాయి. అక్కడి నుంచి వాటి దర్శనానికి వెళ్లడానికి సౌకర్యాలు ఉన్నాయి. మిగతా ఆలయాలను కూడా దర్శించుకుంటూ ఉంటారు. ఆధ్యాత్మిక వైభవం .. చారిత్రక నేపథ్యం కలిగిన ఈ క్షేత్ర దర్శనం మనసుకు అనిర్వచనీయమైన ఆనందానుభూతులను కలిగిస్తుంది.

ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత .. ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే. పూర్తి సమాచారం కాదు.