Chilakalapudi Panduranga Swamy Temple
శ్రీమన్నారాయణుడు .. పాండురంగస్వామిగా అనేకమంది భక్తులను అనుగ్రహించాడు. “పండరీపురం”లో చంద్రభాగా నదీ తీరంలో కొలువైన ఆ స్వామి ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులకు దర్శనమిస్తున్నాడు. భక్త పుండరీకుడి కోసం ఇక్కడ వెలసిన స్వామి, ఆ తరువాత నామదేవుడు .. జ్ఞానదేవుడు .. తుకారాం .. పురందరదాసు .. గోరా కుంభార్ .. జనాబాయి .. ఇలా ఎంతోమంది భక్తులను స్వామి అనుగ్రహించి అక్కున చేర్చుకున్న తీరు అద్భుతంగా అనిపిస్తుంది. పాండురంగస్వామి లీలా విశేషాలతో .. ఆయన భక్తుల భజనలతో మహారాష్ట్ర తరించింది.
దక్షిణ భారతానికి వచ్చేసరికి పాండురంగ స్వామి ఆలయాలు చాలా తక్కువగా కనిపిస్తాయి. ఆయన పాటలు .. భజనలు వినిపించడం కూడా ఇటు వైపు తక్కువే. ఈ వైపు నుంచి కూడా పాండురంగస్వామి అనుగ్రహాన్ని కోరుతూ ఒక మహాభక్తుడి స్వరం వినిపించింది. అది ఆ స్వామి పరిగెత్తుకు వచ్చేలా చేసింది. ఆ భక్తుడి పేరే నరసింహం .. ఆ భక్తుడికి తనపై గల విశ్వాసాన్ని నిలబెట్టడానికి స్వామి ఆవిర్భవించిన క్షేత్రమే “చిలకలపూడి పాండురంగ క్షేత్రం”(Chilakalapudi Panduranga Swamy Temple). ఇది ఆంధ్రప్రదేశ్ .. కృష్ణా జిల్లా .. మచిలీపట్నం సమీపంలో వెలుగొందుతోంది.
సాధారణంగా ఆలయాన్ని నిర్మించి .. మూలమూర్తిని తీసుకుని వచ్చి గర్భాలయంలో ప్రతిష్ఠిస్తారు. కానీ ఆలయ నిర్మాణం పూర్తయిన తరువాత భగవంతుడే వచ్చి గర్భాలయంలో మూర్తి రూపంలో ఆవిర్భవించడం నిజంగా ఒక అద్భుతమే. ఆ అద్భుతం జరిగిన క్షేత్రమే .. చిలకలపూడి పాండురంగస్వామి క్షేత్రం. ఆంగ్లేయులు భారతదేశాన్ని పాలిస్తున్న కాలంలో .. చిలకలపూడిలో నరసింహం అనే పాండురంగస్వామి భక్తుడు ఉండేవాడు. ఆయన ప్రతి ఏడాది పండరీపురం వెళ్లి పాండురంగస్వామి దర్శనం చేసుకుని వస్తుండేవాడు.
వయసు పై బడటంతో పండరీపురం వెళ్లి రావడం నరసింహానికి ఇబ్బంది అవుతోంది. స్వామివారి ఆలయం తమ ఊరిలోనే నిర్మించుకుంటే అనునిత్యం దర్శించుకోవచ్చునని ఆయన భావించాడు. ఇదే విషయాన్ని పండరీపురంలో తాను గురువుగా భావించే మహీపతి స్వామీజీకి చెప్పాడు. ముందు ఆలయ నిర్మాణం మొదలుపెట్టమనీ .. ముహూర్త సమయానికి స్వామినే వచ్చి వెలుస్తాడని ఆయన అన్నాడు. ఆ నమ్మకంతోనే నరసింహం ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశాడు. ఇక స్వామివారు గర్భాలయంలో వెలిసే ముహూర్త సమయం సమీపిస్తోంది.
నరసింహం ఆలయ నిర్మాణం చేపడుతూనే .. స్వామివారి వచ్చి వెలుస్తారని అక్కడివారికి చెబుతూ వచ్చాడు. భగవంతుడు ఎలా వచ్చి వెలుస్తాడు అని వాళ్లంతా ఆశ్చర్యపోయారు. స్వామివారు వచ్చి వెలుస్తాడని చెప్పిన రోజున, అక్కడ ఏం జరుగుతుందో చూద్దామని జనాలు పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చేశారు. అదంతా ఆంగ్లేయ అధికారులకు చోద్యంగా అనిపించి, వాళ్లు నరసింహాన్ని మందలించారు. అక్కడి నుంచి జనాలను పంపించే ప్రయత్నం చేస్తూనే .. గర్భాలయం తలుపులు మూశారు. అంతలో పెద్ద శబ్దం వచ్చింది .. ఒక్కసారి ఆగిపోయి అంతా వెనక్కి తిరిగారు.
ఆ శబ్దం గర్భాలయంలో నుంచి రావడంతో .. ఆంగ్లేయ అధికారులు గర్భాలయం తలుపులు తీశారు. లోపల అప్పడే వెలసిన పాండురంగస్వామి మూర్తిని చూసి వాళ్లు విస్మయానికి లోనయ్యారు. ఇక నరసింహం ఆనందానికి అవధులు లేవు. అక్కడికి చేరుకున్న వాళ్లంతా స్వామివారికి సాష్టాంగాలు పడటం మొదలు పెట్టారు. ఆ రోజు నుంచి స్వామివారికి నిత్యపూజలు జరుగుతున్నాయి. తనని నమ్మిన భక్తుల కోసం భగవంతుడు దివి నుంచి భువికి దిగి వస్తాడని చెప్పడానికి ఇదొక నిదర్శనం. పండరీపురం వరకూ వెళ్లలేని భక్తులు, చిలకలపూడి వెళ్లి ఆ స్వామిని దర్శించి తరిస్తుంటారు.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
గమనిక: ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత .. ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే. పూర్తి సమాచారం కాదు.
Chilakalapudi Panduranga Swamy Temple