Sri Bhagavatam – Dasharatha’s death .. Bharata blamed his mother Kaikeyi

తండ్రి మాటను నిలబెట్టడం కోసం శ్రీరాముడు అడవులకు బయల్దేరతాడు. సీత ఆయన వెంటనడుస్తుంది .. లక్ష్మణుడు వాళ్లను అనుసరిస్తాడు. అయితే అయోధ్య వాసులంతా కూడా రాముడిలేని రాజ్యంలో తాము ఉండలేమని దారికి అడ్డుగా నిలబడతారు. రాముడు వాళ్లందరికి ఎంతగానో నచ్చచెబుతాడు. కొంతమంది అడవిలో కొంతదూరం వరకూ వచ్చి రాముడి అభ్యర్థన కాదనలేక వెనుదిరుగుతారు. అక్కడి నుంచి మరికొంతదూరం వెళ్లిన సీతారామలక్ష్మణులు, ఒక చోట విశ్రాంతి తీసుకుంటారు.

రాముడు అడవులకు వెళ్లాడనే విషయం తెలియగానే దశరథుడు తల్లడిల్లిపోతాడు. తన రాముడిని తనకి దక్కకుండా చేశావంటూ కైకేయిపై తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేస్తాడు. రాముడిని విడిచి తాను ఉండలేనంటూ కన్నీళ్ల పర్యంతమవుతాడు. ఒక్క క్షణకాలం పాటు రాముడు కనిపించకపోతే తపించిపోయే తాను, 14 ఏళ్లపాటు ఎదురుచూస్తూ ఎలా ఉండాలంటూ ఆవేదన చెందుతాడు. ఆ రోజునుంచి నిద్రాహారాలు మానేసి .. రాముడిపై బెంగతో ఆయన మరణిస్తాడు. దాంతో అయోధ్యవాసులంతా శోకసాగరంలో మునిగిపోతారు.

తన తాతగారింటికి వెళ్లిన భరతుడు .. అయోధ్యకి తిరిగి వస్తాడు. జరిగిన ఘోరం గురించి తెలుసుకుని ఎంతో బాధపడతాడు. అన్నింటికీ కారకురాలైన తన తల్లిని నిందిస్తాడు. తనని అయోధ్యకు రాజుగా చూడాలనే ఆమె కోరిక ఎప్పటికీ నెరవేరదని చెబుతాడు. రాముడు ఎక్కడ ఉన్నా తిరిగి తీసుకువచ్చి , సింహాసనంపై కూర్చోబెడతానని చెప్పి అడవులకు బయల్దేరతాడు. అతనిని కౌసల్య .. కైకేయి .. సుమిత్ర అనుసరిస్తారు. సీతారాములు విడిది చేసిన చోటుకు భరతుడి పరివారం చేరుకుంటుంది.

తన తండ్రి మరణించాడనే విషయం తెలిసి రాముడు కన్నీళ్లు పెట్టుకుంటాడు. రాముడిని వెనక్కి వచ్చేయమని భరతుడు కోరతాడు. తన వరాలను తాను వెనక్కి తీసుకుంటాననీ .. రాజ్యానికి వచ్చి సింహాసనం అధిష్ఠించమని కైకేయి కోరుతుంది. అలా చేస్తే తన తండ్రి మాటను అతిక్రమించినట్టు అవుతుందని రాముడు అంటాడు. తాము తిరిగి రావడమంటూ జరిగితే అది అరణ్యవాసం ముగిసిన తరువాతనే అని చెబుతాడు. అయితే అప్పటివరకూ అతని “పాదుకలు” సింహాసనం పై ఉంచి పాలన సాగిస్తానని చెప్పి పాదుకలు తీసుకుంటాడు భరతుడు.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో  సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.

Sri Bhagavatam – Dasharatha’s death .. Bharata blamed his mother Kaikeyi