Chitrakoot – The place where Lord Rama Sita and Lakshman lived in exile

సీతారాములు నడయాడిన పుణ్య ప్రదేశాలలో “చిత్రకూట్”(Chitrakoot) లేదా “చిత్రకూటం” ఒకటి. రామాయణంలోని ఈ పేరును వింటున్నప్పుడు .. రామాయణంలో చదివినటువంటి ఈ క్షేత్రాన్ని చూస్తున్నప్పుడు కలిగే ఆనందం .. అనుభూతి వేరు. వనవాస కాలంలో సీతారాములు నడయాడిన ప్రదేశాలు .. వారు స్నానమాచరించిన సరస్సులు .. విశ్రాంతి తీసుకున్న ఆశ్రమాలు చూసినప్పుడు, ఆ పుణ్యభూమిని స్పర్శించడమే మహాభాగ్యం అనిపిస్తుంది. అయ్యో మన సీతారాములు ఆ రోజుల్లో దట్టమైన అడవుల్లో ఎన్ని కష్టాలు పడ్డారో అనే ఆవేదన కలుగుతుంది.

అలా అయోధ్య నగరాన్ని వీడిన సీతారాములు చిత్రకూటం చేరుకున్నారు. ఇది ఇప్పుడు మధ్యప్రదేశ్ లో జిల్లా కేంద్రంగా వెలుగొందుతోంది. వనవాస కాలంలో సీతారాములు ఎక్కువ కాలం పాటు ఇక్కడే ఉన్నారనే ఆధారాలు ఉన్నాయి. మందాకినీ నదీ తీరంలోని ఈ ప్రదేశం వారికి బాగా నచ్చడం వల్లనే ఇక్కడ ఉన్నారని చెబుతారు. సీతారామలక్ష్మణులు .. హనుమకు సంబంధించిన అనేక సంఘటనలకు చిత్రకూటం సాక్షిగా కనిపిస్తూ ఉంటుంది. ఆ కథలన్నీ మనతో చెబుతున్నట్టుగా అనిపిస్తుంది.

చిత్రకూటం(Chitrakoot) ఇప్పటికీ చాలా పచ్చదనంతో .. ప్రశాంతమైన ప్రాంతంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక సీతారాముల కాలంలో ఎలా ఉందనేది ఊహించుకోవచ్చు. మందాకినీ నదీ తీరంలోని ఒక ఎత్తైన ప్రదేశంలో “స్పటికశిల” ఒకటి కనిపిస్తుంది. ఈ శిలపైనే సీతారాములు ఎక్కువగా కూర్చునేవారని అంటారు. ఇక “గుప్త గోదావరి”కి సంబంధించిన గుహలలో సహజంగా ఏర్పడిన రెండు శిలలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. వాటిపై రామలక్ష్మణులు ఆసీనులయ్యేవారని చెబుతారు. చిత్రకూటం వెళ్లినవారు ఈ గుహలను చూడవచ్చు.

ఈ ప్రదేశంలోనే “హనుమాన్ ధార” కనిపిస్తుంది. ఇక్కడ పెద్ద హనుమ విగ్రహం ఉంటుంది. హనుమాన్ ధార నుంచి నిరంతరం నీటి ప్రవాహం వస్తూనే ఉంటుంది. సీతాదేవిని అన్వేషిస్తూ హనుమంతుడు లంకా నగరానికి వెళతాడు. అశోకవనంలో ఉన్న ఆమె ఆచూకీ తెలుసుకుంటాడు. రావణుడి బలం .. బలగం .. ఆయన సైన్య సంపద గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతో కావాలనే పట్టుబడతాడు. అయితే హనుమ మాటలను పెడచెవిన బెట్టిన రావణుడు ఆయనను అవమానపరచాలని చూస్తాడు.

ఈ విషయంలో విభీషణుడి మాటలను పట్టించుకోని రావణుడు, హనుమ తోకకు నిప్పు అంటించమని చెబుతాడు. తన తోకకు నిప్పు అంటించారనే ఆగ్రహంతో హనుమ ఆ నిప్పును లంకానగరంలోని భవనాలకు అంటించి తిరిగివస్తాడు. హనుమ తోక కాలిపోయి ఉండటం చూసిన శ్రీరాముడు .. నీటి ధరను సృష్టించి ఆ నీటితో ఆయనకి ఉపశమనాన్ని కలిగించాడట. హనుమ కోసం సృష్టించిన ధార కనుకనే, దీనికి “హనుమాన్ ధార” అనే పేరు వచ్చిందని చెబుతారు. ఇలా రామాయణానికి సంబంధించిన ఎన్నో విశేషాలను చిత్రకూటం మనకి చెబుతుంది.

ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ వారం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ సంవత్సరం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత .. ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న సమాచారం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే. పూర్తి సమాచారం కాదు.

Chitrakoot – The place where Lord Rama Sita and Lakshman lived in exile