Sri Bhagavatam – Parikshit maharaj getting to know about righteous ways of lord Rama

శుక మహర్షి ద్వారా భాగవతుల కథలను వింటూ .. తనకి గల అనేక ధర్మ సందేహాలను పరీక్షిత్ మహారాజు నివృత్తి చేసుకుంటూ ఉంటాడు. అలా ఆయన సూర్య వంశరాజులను గురించి .. శ్రీరాముడి ధర్మబద్ధమైన జీవితాన్ని గురించి అడుగుతాడు. సూర్య వంశంలో ముఖ్యులను గురించీ .. వాళ్లు అనుసరిస్తూ వచ్చిన ఆదర్శవంతమైన జీవితాన్ని గురించి శుక మహర్షి ప్రస్తావిస్తాడు. శ్రీరాముడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి అవతారమని చెబుతూ, రాముడిని గురించి వివరంగా చెప్పడం మొదలుపెడతాడు.

దశరథమహారాజుకి కౌసల్య .. కైకేయి .. సుమిత్ర అనే ముగ్గురు భార్యలు ఉండేవారు. పుత్ర సంతానం కోసం దశరథమహారాజు యాగం చేయడంతో కౌసల్యాదేవికి రాముడు .. కైకేయికి భరతుడు .. సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు జన్మిస్తారు. అయోధ్య సింహాసనానికి వారసులు లభించినందుకు అయోధ్య వాసులంతా ఆనందంతో పొంగిపోతారు. సంతోషంతో సంబరాలు జరుపుకుంటారు. దశరథుడు తన కుమారుల ఆటపాటలను చూస్తూ మురిసిపోతుంటాడు. ముఖ్యంగా ఆయన రాముడిపై ఎక్కువ ప్రేమను పెంచుకుంటాడు.

దశరథుడు తన కుమారులందరికీ విద్యాబుద్ధులు నేర్పిస్తాడు. విలువిద్యలో ఆరితేరేలా చేస్తాడు. విలువిద్యలో రాముడి ప్రతిభాపాటవాలు చూసిన ఆయన ఆనందాశ్చర్యాలను వ్యక్తం చేస్తాడు. అలాంటి పరిస్థితుల్లోనే ఒక రోజున విశ్వామిత్ర మహర్షి .. దశరథ మహారాజు సభా మందిరానికి వస్తాడు. తన ఆశ్రమ ప్రాంతంలో నిర్వహిస్తున్న యాగానికి కొందరు రాక్షసులు అంతరాయం కలిపిస్తున్నారని చెబుతాడు. యాగ సంరక్షణ కోసం తనతో రాముడిని పంపించమని అడుగుతాడు. అందుకు దశరథుడు నిరాకరిస్తాడు.

రాముడు విలువిద్యలో ఆరితేరిననూ అతనికి రాక్షస మాయలు తెలియవని అంటాడు. అందువలన తాను వస్తానని చెబుతాడు. ఆ మాటలకు విశ్వామిత్రుడు తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేస్తాడు. విశ్వామిత్రుడు తపోబల సంపన్నుడనీ, ఆయన అండగా ఉండగా రాముడి గురించి కంగారు పడవలసిన అవసరం లేదని వశిష్ఠ మహర్షి దశరథ మహారాజుకి నచ్చచెబుతాడు. దాంతో ఆయన రాముడిని విశ్వామిత్రుడి వెంట పంపించడానికి అంగీకరిస్తాడు. రాముడికి తోడుగా లక్ష్మణుడు కూడా విశ్వామిత్రుడిని అనుసరిస్తాడు.

ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ వారం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ సంవత్సరం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.

Sri Bhagavatam – Parikshit maharaj getting to know about righteous ways of lord Rama