చిన్నికృష్ణుడు వచ్చిన దగ్గర నుంచి గోకులంలో పాడిపంటలకు కొదవలేకుండా పోతుంది. గోకుల వాసులంతా సుఖ సంతోషాలతో కాలం గడుపుతూ ఉంటారు. చిన్నికృష్ణుడు తన స్నేహితులతో కలిసి ఆటపాటలతో మునిగిపోతుంటాడు. గోకులంలోని గొల్లభామల ఇంట్లో ఉట్టిపై ఉన్న వెన్నను దొంగిలించడం .. గోపాకులతో కలిసి ఆ వెన్నను ఆరగించడం చేస్తుంటాడు. తాము తిన్నంత వెన్న తినేసి .. వెళుతూ వెళుతూ ఆ ఇంటి కోడలి మూతికి కాస్త వెన్నరాసి వెళ్లేవాళ్లు. దాంతో కోడలే దొంగతనంగా వెన్న తినేసిందని అత్త గొడవ చేసేది .. అది చూస్తూ చిన్నికృష్ణుడి మిత్రబృందం నవ్వుకునేవారు.

ఇలా గోకులంలో చిన్నికృష్ణుడు తమ ఇంట్లోని వెన్నను దొంగిలించి తినేస్తున్నాడని యశోదాదేవికి ఫిర్యాదు చేస్తారు. అయితే కృష్ణయ్య అసలు ఎవరి ఇంటికీ వెళ్లలేదనీ, ఉదయం నుంచి ఇంటుపట్టునే ఉన్నాడని యశోదాదేవి చెబుతుంది. దాంతో వాళ్లు ఆమెనే అబద్ధం చెబుతుందని భావిస్తారు. తమ ఇంటికి కృష్ణుడు వెన్న కోసం వచ్చినప్పుడే కట్టేయాలనీ, ఆ తరువాత యశోదాదేవిని తీసుకొచ్చి చూపించాలని నిర్ణయించుకుంటారు. గోకులంలో వెన్న మీగడలు అమ్మేవారంతా కూడా ఎవరి ఇంటికి కృష్ణుడు వచ్చినా బంధించాలని కూడబలుక్కుంటారు.

ఓ రోజు మధ్యాహ్నం వేళలో వాళ్లంతా యశోదాదేవి ఇంటికి ఒకరి తరువాత ఒకరిగా చేరుకుంటారు. తమ ఇంటికి వెన్న దొంగిలించడానికి కృష్ణుడు వచ్చాడనీ, ఆయనను బంధించి వచ్చామని అంటారు. అదే మాట ఇంకొకరు .. వేరొకరు .. ఇలా అంతా చెప్పడం మొదలుపెడతారు. చివరికి అందరూ కూడా కృష్ణుడు తమ ఇంటికి వచ్చాడంటే .. తమ ఇంటికి వచ్చాడని గొడవ పడుతుంటారు. వాళ్లందరినీ యశోదాదేవి వారిస్తుంది. ఇంతమంది ఇంటికి ఒక్క కృష్ణుడు ఎలా వచ్చాడని అడుగుతుంది. అవును కదా! అన్నట్టుగా వాళ్లంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు.

అబద్ధాలు చెప్పినా అతికేలా ఉండాలి .. చూడండి అంటూ యశోదాదేవి తన ఇంటి ప్రధాన ద్వారం తెరుస్తుంది. లోపల కృష్ణుడు హాయిగా పడుకుని నిద్రిస్తుండటం చూసి వాళ్లంతా నివ్వెరపోతారు. తమ ఇంటికి కృష్ణుడు వచ్చాడు .. వెన్న దొంగిలించాడు .. తాము అతణ్ణి పట్టుకుని బంధించాము .. తన ఇంట్లో బంధించబడిన కృష్ణుడు ఇక్కడికి ఎలా వచ్చాడు? అయినా ఒకేసారి ఇంతమంది ఇళ్లలో ఎలా వెన్న దొంగిలిస్తాడు? అందరి ఇళ్లలో నుంచి ఎలా బయటపడతాడు? అనే విషయాన్ని గురించి ఆలోచిస్తూ వాళ్లు వెనుదిరుగుతారు.

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.