Sri Bhagavatam – Conditions at the end of the Kali Yug
కల్కి అవతారంలో స్వామి అవతరించే సమయానికి కలియుగంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేది శుక మహర్షి మరింతగా పరీక్షిత్ కి వివరించడం మొదలుపెడతాడు. కలియుగం చివరిదశలో మానవుల ఆయుర్దాయం పూర్తిగా తగ్గిపోతుంది. తక్కువ ఆయుర్దాయంలోనే వాళ్లు అనేక వ్యాధుల బారిన పడతారు. వ్యాధులు అనేక రకాలుగా చుట్టముట్టడం వలన జనం కుప్పలు తెప్పలుగా మరణిస్తారు. ఎక్కడివారు అక్కడే చివరిశ్వాసను వదులుతుంటారు.
ఇక విద్య వలన .. ధనం వలన .. వయసు కారణంగా ఎవరి పెద్దరికానికి ఎలాంటి గౌరవం ఉండదు. ఒక మనిషి మరొక మనిషికి విలువ ఇవ్వడం ఎక్కడా కనిపించదు. అందరూ తమంతటివారు లేరనే అహంభావపూరితమైన స్వభావంతోనే ఉంటారు. ఒకరికి ఒకరు సాయం చేసుకోవడం ఉండదు. ఒకరికి మించిన ఈర్ష్య ద్వేషాలతోనే మరొకరు మసలుతూ ఉంటారు. ఇతరుల ఎదుగుదలను గురించే ఆలోచిస్తూ అసూయతో రగిలిపోతూ ఉంటారు.
ఇక కుటుంబ జీవనం అస్తవ్యస్తం అవుతుంది .. ముఖ్యంగా వివాహ వ్యవస్థ దెబ్బతింటుంది. భార్యాభర్తలు ఎక్కువ కాలం కలిసి జీవించడమే గగనమైపోతుంది. ఒకరిపట్ల ఒకరికి ప్రేమానురాగాలు పూర్తిగా తగ్గిపోతాయి. ఇక పిల్లలకి కూడ తల్లితండ్రుల పట్ల ఎలాంటి ప్రేమాభిమానులు లేకుండాపోతాయి. తమ ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించడానికి వాళ్లు ఎక్కువగా ఇష్టపడతారు. తల్లిదండ్రుల మాటకు వాళ్లు ఎంతమాత్రం విలువను ఇవ్వరు.
ఇలా భార్యాభర్తల మధ్య .. పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య అనుబంధాలు పూర్తిగా బలహీనపడతాయి. అందువలన ఒకే కప్పు క్రింద కాకుండా కుటుంబ సభ్యులు ఎవరికివారుగా బ్రతకడం మొదలవుతుంది. వ్యక్తి .. కుటుంబం .. సమాజం .. దేశం .. లోకం ఇలా అన్ని విలువలను వదిలేస్తూ పతనం దిశగా పరుగులుతీస్తాయి. జనంలో పాపభీతి పూర్తిగా నశిస్తుంది. దాంతో అరాచకాలు విపరీతమవుతాయి .. అన్యాయాలు పెరుగుతాయి. అలాంటి పరిస్థితుల్లో కల్కి ఖడ్గం ధరించి తెల్లని గుర్రంపై బయల్దేరతాడు.
ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu
గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.
Sri Bhagavatam – Conditions at the end of the Kali Yug