Sri Bhagavatam – Death of Parikshith Maharaj

కలికాలంలో రానున్న రోజుల్లో అధర్మం పెరిగిపోతుంది .. అవినీతికి హద్దులేకుండా పోతుంది. ఎక్కడ చూసినా అవినీతి .. అన్యాయం విలయ తాండవం చేస్తూ ఉంటాయి. వీటిని ఆశ్రయించి ఉన్నవారే పరిపాలకులై సాధుజనులను నానారకాల ఇబ్బందులకు గురిచేస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో కల్కి అవతారంలో స్వామి వచ్చి దుష్టులందరినీ సంహరిస్తాడు. ధర్మసంస్థాపన కోసం ఆయన తెల్లని అశ్వంపై వీరవిహారం చేస్తాడు.

రానున్న కాలమంతా రాక్షస కాలమే కనుక మరణాన్ని గురించిన భయం .. బెంగ పెట్టుకోకుండా హరినామ స్మరణ చేస్తూ ఉండమని శుకమహర్షి చెబుతాడు. భాగవత కథాశ్రవణం వలన అతనికి ఉత్తమమైన గతులు కలుగుతాయని అంటాడు. హరినామ స్మరణ అన్నిరకాల పాపాల నుంచి .. శాపాల నుంచి విముక్తిని కలిగిస్తుందని చెబుతాడు. కనుక మనసును ప్రశాంత పరచుకుని .. చిత్తము నందు శ్రీహరి పాదాలను నిలపమని అంటాడు.

మరణం ఎంతటివారికైననూ తప్పదు .. దేనిని గురించి ఆలోచన చేస్తూ చింతపడవలదు అని శుక మహర్షి చెప్పడంతో, పరీక్షిత్ మహారాజు .. హరినామ స్మరణ చేస్తూ గంగాతీరంలోనే కూర్చుని ఉంటాడు. ఆయన మనసు తరుముకు వస్తున్న మృత్యువుపై కాకుండా, శ్రీమన్నారాయణుడి పాదాలపై లగ్నమై ఉంటుంది. ఆ స్వామి సన్నిధికి చేరుకోవడానికి ఆయన ఆరాటపడుతూ ఉంటాడు. ఆయన మనసంతా శ్రీహరి నామస్మరణతో నిండిపోయి ఉంటుంది.

శమీక మహర్షి కుమారుడు శృంగి శాపాన్ని విధించిన సమయం దగ్గర పడుతుంది. శాపం మేరకు తక్షకుడు సర్పరూపంలో వాయువేగంతో వచ్చేస్తాడు. అయితే పరీక్షిత్ మహారాజు చుట్టూ పరివారం ఉండటంతో, ఆయన దగ్గరికి సర్పరూపంలో వెళ్లడం కష్టమని భావించిన తక్షకుడు, మారు వేషాన్ని ధరిస్తాడు. పరీక్షిత్ మహారాజుకు అందజేయమని చెప్పి, ఆయన సేవకుడి ద్వారా ఒక పండును పంపిస్తాడు. ఆ పండు సేవకుల ద్వారా పరీక్షిత్తుకు చేరుతుంది. ఆయన ఆ పండును రుచి చూడగానే అందులో నుంచి ఒక చిన్న కీటకం రూపంలో బయటికి వచ్చిన తక్షకుడు, క్షణాల్లో సర్పరూపాన్ని ధరించి పరీక్షిత్ మహారాజును కాటు వేస్తాడు. అంతే పరీక్షిత్ ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసి పోతాయి.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.

Sri Bhagavatam – Death of Parikshith Maharaj