Sri Bhagavatam – Emergence of Ugra Narasimhaswamy – Killing of Hiranyakashipu

ఇంతకాలంగా ఇన్నిమార్లు చెబుతూ ఉన్నప్పటికీ ప్రహ్లాదుడు హరినామం మరువకపోవడం .. అనుక్షణం తన ఎదుట తన శత్రువు నామాన్ని పలుకుతూ తనకి మనశ్శాంతి లేకుండా చేయడం హిరణ్యకశిపుడిని ఆలోచనలో పడేస్తుంది. తనని ఇంతగా వేధిస్తున్న ప్రహ్లాదుడు తన తనయుడు కాదు .. తనయుడి రూపంలో వచ్చిన మృత్యువు అని భావిస్తాడు. ఇంతకాలంగా ఈ విషయాన్ని గ్రహించలేకపోవడం తన అజ్ఞానమని అనుకుంటాడు. కుమారుడిని అంతమొందించడానికి తనే స్వయంగా రంగంలోకి దిగుతాడు.

తనకి మరణం భయం ఎప్పుడూ లేదనీ .. శ్రీహరి ఎలా తలిస్తే అలా జరుగుతుందని ప్రహ్లాదుడు చెబుతాడు. ఇంతవరకూ తనని రక్షించిన ఆ నారాయణుడే ఇకపై కూడా తనని కాపాడతాడనే నమ్మకం ఉందని అంటాడు. నారాయణుడు .. నారాయణుడు అని అతను చెప్పే ఆ విష్ణువు తనకి భయపడి దాక్కున్నాడని హిరణ్యకశిపుడు అంటాడు. అతని కోసం గాలించి తాను విసిగిపోయాననీ, ఆయన ఎక్కడ ఉన్నాడో చెప్పమని అడుగుతాడు. ఫలానా చోటున అని ఏమీ లేదు .. ఎక్కడపడితే అక్కడ .. అంతటా ఆయనే ఉన్నాడని ప్రహ్లాదుడు సమాధానం ఇస్తాడు.

అలా అయితే .. అతను చెప్పేదే నిజమైతే .. ఈ రాతి స్థంభాన కూడా హరి ఉండాలి కదా? చూద్దాం .. ఉన్నాడో .. లేడో అంటూ హిరణ్యకశిపుడు తన చేతిలోని గదతో తన రాజభవనంలోని స్థంభాన్ని పగలగొడతాడు. ఆ స్థంభంలో నుంచి సింహం ముఖము .. మానవ శరీరం కలిసిన అవతారంతో .. ఉగ్రరూపంతో స్వామి బయటికి వస్తాడు. ఆ రూపం ఏమిటో అర్థం చేసుకోవడానికి హిరణ్యకశిపుడికి కొంత సమయం పడుతుంది. హిరణ్యకశిపుడు ఆ తేజస్సును చూడలేక .. ఆ గర్జనలు వినలేకపోతాడు. తాను ఎంతోకాలంగా వెదుకుతున్న విష్ణువు తన ఎదురుగా రావడం చూసి, ఆయనపై తన పరాక్రమాన్ని చూపడానికి ప్రయాత్నిస్తాడు.

హిరణ్యకశిపుడికి గల వరాలను గురించి తెలిసిన శ్రీమన్నారాయణుడు .. ఆయనను భూమిపైగానీ .. ఆకాశమునందుగాని కాకుండా, తన తొడపై పడుకోబెట్టి .. ఎలాంటి ఆయుధాలు ఉపయోగించకుండా పదునైన తన గోళ్లతో ఆయన ఉదరాన్ని చీల్చి సంహరిస్తాడు. ఆ స్వామి లీలా విశేషాలను అనేక విధాలుగా కొనియాడుతూ, ఆయనను ప్రహ్లాదుడు శాంతిపజేస్తాడు. హిరణ్యకశిపుడి జన్మ రహస్యాన్ని గురించి ప్రహ్లాదుడికి చెప్పిన స్వామి, ఆయనకి తన అనుగ్రహం లభించిందని అంటాడు. ధర్మబద్ధంగా రాజ్యపాలనను సాగించి .. తన భక్తాగ్రేసరుడిగా ముక్తిని పొందుతావని ప్రహ్లాదుడిని ఆశీర్వదిస్తాడు.

ఈ రోజు రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ రోజు పంచాంగం వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ వారం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఈ సంవత్సరం రాశి ఫలాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.