Sri Bhagavatam – Gandhari’s intolerance towards Krishna and curses Yadavs

శ్రీమహావిష్ణువు నివాసమైన వైకుంఠం ద్వార పాలకులుగా ఉన్న జయవిజయులు, సనకసనందనుల శాపం కారణంగా హిరణ్యాక్ష .. హిరణ్యకశిపులుగా, రావణ కుంభకర్ణులుగా, శిశుపాల దంతవక్త్రులుగా జన్మిస్తారు. వరాహావతారంలో హిరాణ్యాక్షుడిని అంతమొందించినస్వామి, నరసింహ అవతారంలో హిరణ్యకశిపుడిని సంహరిస్తాడు. రామావతారంలో రావణ కుంభకర్ణులను సంహరిస్తాడు. ఇక కృష్ణావతారంలో శిశుపాల దంతవక్త్రులను అంతమొందిస్తాడు. దాంతో జయవిజయాలు తమ శాపం నుంచి పూర్తిగా విముక్తులై వైకుంఠానికి చేరుకుంటారు.

కురుక్షేత్ర యుద్ధంలో కౌరువులంతా మరణిస్తారు .. పాండవులు విజయాన్ని సాధిస్తారు. ఒక శుభముహూర్తాన ధర్మరాజుకి పట్టాభిషేకం జరుగుతుంది. ధర్మరాజు .. తన సోదరులతో కలిసి ధృతరాష్ట్రుడి ఆశీస్సులు తీసుకోవడానికి వస్తాడు. ఆ సమయంలో కృష్ణుడు కూడా వాళ్లతోనే ఉంటాడు. ఆ సందర్భంలోనే .. తన ప్రియపుత్రులైన దుర్యోధన .. దుశ్శాసనులను అంతమొందించిన భీముడిని తన ఉక్కు కౌగిలిలో బంధించి హతమార్చాలని ధృతరాష్ట్రుడు అనుకుంటాడు. కానీ కృష్ణుడు తెలివిగా భీముడిని తప్పిస్తాడు.

అదే సమయంలో గాంధారి అక్కడికి వస్తుంది .. వస్తూనే కృష్ణుడి ధోరణి పట్ల తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేస్తుంది. కురుక్షేత్ర యుద్ధం జరగటానికి కారకుడు కృష్ణుడేనని అంటుంది. ఆయన తలచుకుంటే యుద్ధం జరగకుండా చూడగల సమర్థుడు అనీ, కానీ కావాలనే పరిస్థితులను యుద్ధం వరకూ తీసుకెళ్లాడని నిందిస్తుంది. ఎంతటి సమస్యనైనా పరిష్కరించగల కృష్ణుడు, కౌరవ పాండవుల సమస్యను పరిష్కరించలేకపోవడం ఏమిటని అసహనాన్ని వ్యక్తం చేస్తుంది. ఈ విషయంలో ఆయన పాండవ పక్షపాతిగానే కలగజేసుకున్నాడంటూ ఆక్రోశిస్తుంది.

మొదటి నుంచి కూడా కృష్ణుడు పాండవుల గురించి మాత్రమే ఆలోచన చేస్తూ వచ్చాడనీ, వాళ్ల మంచి చెడ్డలను మాత్రమే పట్టించుకున్నాడని అంటుంది. తన కుమారులంతా ప్రాణాలను కోల్పోవడానికీ .. పాండవులకు రాజ్యం దక్కడానికి కృష్ణుడే కారకుడనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. తన కుమారుల మరణానికి కృష్ణుడు కారకుడైనందు వలన, తన కుమారుల మాదిరిగానే యాదవులంతా నశిస్తారని శపిస్తుంది. ఊహించని విధంగా ఆమె అలా శపించడంతో పాండవులతో పాటు కృష్ణుడు కూడా విస్తుపోతాడు.

గమనిక: భగవంతుడి లీలా విశేషాలతో కూడిన “భాగవతం”లోని కథలను ఎంతోమంది రచయితలు తమదైన శైలిలో ఆవిష్కరించారు. వాటిల్లో మేము విన్న .. చదివిన సమాచారాన్ని ఏర్చి కూర్చి, సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో అందించడానికి చేస్తున్న చిరు ప్రయత్న ఇది. ఇది ఏ రకంగాను ప్రామాణికం కాదు..పూర్తి కథనమూ కాదు. కేవలం పరిచయం మాత్రమే అని మనవి చేస్తున్నాము.

ఈ రోజు రాశి ఫలాలు – Today Horoscope in Telugu
ఈ రోజు పంచాంగం వివరాలు – Today Panchangam in Telugu
ఈ వారం రాశి ఫలాలు – Weekly Horoscope in Telugu
ఈ సంవత్సరం రాశి ఫలాలు – Yearly Horoscope in Telugu

Sri Bhagavatam – Gandhari’s intolerance towards Krishna and curses Yadavs